టూకీగా ప్రపంచ చరిత్ర 107 | Brief History of the World 107 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 107

Published Sat, May 2 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

టూకీగా  ప్రపంచ చరిత్ర 107

టూకీగా ప్రపంచ చరిత్ర 107

వేకువ
 
ఈనాడు ‘భారతదేశం’ భూభాగం సరిహద్దుల పరిధిలో దావానలంలో నెరుసుకున్న ‘వర్ణవ్యవస్థ’ ఆర్యులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంక్రమించిందో కాలానుక్రమంగా రుజువు చేయడం కష్టమైనా, వేదకాలంలో ఉండేది కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. రుగ్వేదం తొమ్మిది మండలాలకు గాను ఒకే ఒక్కచోట ‘క్షత్రియ’ అనే పదం కనిపిస్తుంది. సామవేద మొత్తానికి ఒకేవొక సందర్భంలో ‘బ్రాహ్మణులం’ అనే పదం చోటుచేసుకుంది. మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతున్నప్పుడు ప్రక్షిప్తాలు అతి గుప్తంగా జరిగిపోయే అవినీతి. ఒకవేళ అప్పటివే అయినా, ఆ కాలంవారు వాటిని ఏ అర్థంలో ప్రయోగించారో చెప్పడం సాధ్యపడదు. ఈనాడు అందరూ ఆమోదిస్తున్న వేదభాష్యం శాయనుని వ్యాఖ్యానం. శాయనుడు క్రీస్తు తరువాత 1500 కాలానికి చెందినవాడు. ఎంత లేదన్నా వేదం పుట్టిన కాలానికీ శాయనుని కాలానికీ మధ్య 3000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. పెరైండు తావులను మినహాయిస్తే, మూలవేదంలో వర్ణవ్యవస్థ మచ్చుకైనా కనిపించదు. గంగా మైదానంలో అధర్వవేదం పుట్టుకొచ్చేదాకా వర్ణవ్యవస్థ ఘనీభవించినట్టు కనిపించదు. రుగ్వేదంలో ఒకటి రెండు చోట్ల మాటమాత్రంగా కనిపించే ‘మనువు’ పురాణ పురుషుడే గానీ, వేద పురుషుడు కాజాలడు.

 వేదకాలంలో ఆర్యుల్లో తరగతి విభజన లేదు. మహావుంటే రుషుల వంటి ప్రముఖులు, తదితరులు అనే తేడా. కానీ, గంగామైదానం చేరిన తరువాతి రోజుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తరగతులుగా, లేదా వర్ణాలుగా, సమాజం విభజించబడింది. విద్య, విజ్ఞానం కలిగినవారుగా ఆర్యులు బ్రాహ్మణులైనారు. ఆలమందల యజమానులు వైశ్యులైనారు. అదివరకటి పశువుల కాపరులు, క్షురకుల వంటి సేవకులతో కలిపి, రైతులను వృత్తిపనివాళ్లను మెలూహన్ల నుండి విలీనం చేసుకున్నారు. వృత్తిపనుల యజమానులుగా ఉండిన మెలూహ్హన్లు కమ్మరి, సాలె, కంసలి వంటి అగ్రస్థాయి శూద్రులైనారు. వ్యాపారానికి ప్రాముఖ్యత లేనందువల్ల మెలుహ్హన్ వణిజులు విడతలు విడతలుగా దక్షిణాదికి చేరుకుని చిల్లర వర్తకులైనారు. అలాంటివారి ప్రయత్నంలో దక్షిణాదిలో సముద్రయానం ముమ్మరమైంది. ఇంతకూ క్షత్రియులు ఎవరి నుండి ఏర్పడ్డారో ఇదమిత్తంగా చెప్పలేం. వేదకాలం ఆర్యుల్లో ప్రభుత్వాలు లేవు. సింధూప్రాంతంలోని పరిపాలనా విధానం తీరే ఇప్పటికి తెలిసిరాలేదు. పరస్పర అన్యోన్యతా, వేదత్రయం మినహా మిగతా సంస్కృత సాహిత్యం నేర్చుకునేందుకు క్షత్రియులు పొందిన అర్హతలను బట్టి, ఆ వర్ణం ఆర్యుల నుండి ఉద్భవించినదే అయ్యుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంశాలు ‘గోత్రం’ ద్వారా గుర్తింపబడ్డాయి. ఆర్యత్వానికి సంకేతంగా ‘యజ్ఞోపవీతం’ ఉనికిలోకొచ్చింది. శూద్రుల గుర్తింపు వృత్తిపరమైన ‘కులం’తో జరిగింది. శూద్రుల్లోనూ గోత్రం ఉంది గానీ, దాని ప్రయోజనం ‘నిషేదాల’ను సూచించడం మాత్రమే.
 వేదకాలం ఆర్యుల వివాహవిధానం ఎలా ఉండేదో వేదం వల్ల తెలిసిరాదు. బహుశా పాణిగ్రహణంతో సరిపెట్టుకోనుండచ్చు. వాళ్లకు బియ్యమే లేవుగాబట్టి, తలంబ్రాలూ అక్షింతల వంటి ఆచారానికి తావులేదు. మనుధర్మ స్మృతిలో ఎనిమిది రకాల వివాహ విధానాలు ఆమోదయోగ్యమైనవిగా పేర్కొనబడ్డాయి. అవి కూడా వర్ణాలవారిగా అనుసంధానమైనవి. తాళిబొట్టును గురించిన ప్రస్తావన అందులోనూ లేదు. బ్రాహ్మణ, క్షత్రియుల్లో తాళిబొట్టు ఆచారం ఎప్పుడు ప్రవేశించిందో చెప్పటానికి ఆధారాలు లేవు. హరిశ్చంద్రుని భార్య చంద్రమతికున్న తాళిబొట్టు వృత్తాంతమొక్కటే క్షత్రియుల్లో కనిపించే ఉదాహరణ. మహాభారతంలోనూ ఆ సంప్రదాయం ఎక్కడా కనిపించదు. మెలూహన్ల నుండి వచ్చిన తరగతుల్లో తాళి ఆచారం ఇప్పటికీ తప్పనిసరి.
 
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com
 
 

Advertisement
Advertisement