ముఖకాంతికి బంగారం
ముఖ కాంతి పెరగాలంటే ‘గోల్డ్ ఫేసియల్’ మంచి ఎంపిక. ఈ ఫేసియల్ అన్ని చర్మతత్త్వాలకు సరిపడుతుంది. మృతకణాలను తొలగించడంలోనూ, ఎండకు కమిలిన చర్మానికి సహజమైన కాంతి తీసుకురావడంలోనూ, ముడతలను తగ్గించడంలోనూ.. ఇలా చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది ఈ ఫేసియల్!
ఇంట్లోనే ఫేసియల్...
నాణ్యమైన గోల్డ్ ఫేసియల్ కిట్ కొనుగోలు చేయాలి. ఈ కిట్‌లో గోల్డ్ క్లెన్సర్, గోల్డ్ ఫేసియల్ స్క్రబ్, గోల్డ్ ఫేసియల్ క్రీమ్ లేదా జెల్, గోల్డ్ ఫేసియల్ మాస్క్‌లు ఉంటాయి.
క్లెన్స్: ముందుగా ముఖానికి గోల్డ్ క్లెన్సర్‌ను రాసి, మృదువుగా మసాజ్ చేసి, వెచ్చని నీటితో కడిగి, కాటన్ టవల్‌తో తుడుచుకోవాలి.
స్క్రబ్: మృతకణాలను తొలగించడానికి గోల్డ్ స్క్రబ్ సహాయపడుతుంది.
క్రీమ్: గోల్డ్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు రాసి కింద నుంచి పైకి వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ క్రీమ్.. గోల్డ్ ఫాయిల్, గోల్డ్ పౌడర్, గోధుమ నూనె, కుంకుమపువ్వు, అలొవెరా జెల్, చందనం కలిగి ఉంటుంది. చర్మానికి బాగా ఇంకేలా వేళ్లతో రాసి, తడి క్లాత్‌తో తుడవాలి.
మాస్క్: కిట్‌లోని గోల్డ్ మాస్క్ క్రీమ్ తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. ఇందులో పసుపు, గోల్డ్ ఫాయిల్, అలొవెరా జెల్ ఉంటాయి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటిని చిలకరించి, శుభ్రపరచాలి.
మాయిశ్చరైజర్: విడిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వేళ్లతో కొద్దిగా తీసుకొని, ముఖానికి, మెడకు రాసి వలయాకారంగా కదలికలు ఇవ్వాలి.
నోట్:
1. స్క్రబ్ చేసిన తర్వాత ముఖానికి ఆవిరి పట్టడం తగ్గించాలి. ఆవిరికి చర్మం ముడతలు పడే అవకాశం ఉంది.
2. నాణ్యమైన ఉత్పత్తులను వాడితేనే మంచి ఫలితం.