Gold facial
-
బ్యూటీపార్లర్‌కు వెళితే ముఖం కాల్చేశారు!
♦ ఫేషియల్ చేయడంతో ముఖంపై కాలిన మచ్చలు ఏర్పడ్డ వైనం ♦ జీజీహెచ్ వైద్యులను ఆశ్రయించిన బాధిత మహిళ ♦ నాలుగు నెలలపాటు ముఖానికి ఎండ తగలకూడదన్న వైద్యులు ♦ జూన్‌లో జరగాల్సిన కుమార్తె వివాహం వాయిదా సాక్షి, గుంటూరు : అందానికి మెరుగులు దిద్దుకునేందుకు బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకోవడానికి వెళితే అది కాస్తా వికటించి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. వెలుగును సైతం చూడలేని పరిస్థితి దాపురించింది. చివరకు ఈ నెలలో జరగాల్సిన కుమార్తె వివాహాన్ని సైతం వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బాధితురాలు, ఆమె భర్త విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని గౌతమినగర్ 4వలైనులో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ కుటుంబంతో కలిసి ముస్సోరి యాత్రకు వెళ్లే సందర్భంలో గతనెల 13వ తేదీన అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఫ్రూట్ ఫేషియల్ చేయమని కోరగా గోల్డ్ ఫేషియల్ అయితే బాగుంటుందని నిర్వాహకురాలు చెప్పింది. అయితే ఫేషియల్ చేస్తున్న క్రమంలో ముఖమంతా మంటగా ఉందని చెప్పినా మొదట్లో అలాగే ఉంటుందని, తరువాత తగ్గిపోతుందని చెప్పి ఫేషియల్ చేసి స్టీమ్ పెట్టి రూ. 400 చార్జి చేసింది. ఆ మరుసటి రోజుకు కూడా మంట తగ్గకపోగా మొఖంలో తేడా గమనించి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి చెప్పగా, ఆమె ఏదో మాయిశ్చరైజర్ వాడితే తగ్గిపోతుందని చెప్పింది. మరుసటిరోజు ముస్సోరికి బయలుదేరి హైదరాబాద్ వెళ్లేసరికి మహిళ ముఖం మరింత నల్లగా మారడం గమనించిన భర్త ఆమె ముఖాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు మెసేజ్ చేశారు. నిర్వాహకురాలు విషయాన్ని ఓ చర్మవ్యాధుల వైద్యునికి చెప్పి ఆయన ఇచ్చిన ప్రిక్సిప్షన్ను తిరిగి వాట్సాప్‌లో పెట్టారు. ముస్సోరి పర్యటన ముగించుకుని గుంటూరుకు వచ్చిన బాధితురాలు మరో వైద్యుడిని కలిసి తన ముఖాన్ని చూపించగా, ఆయన వైద్యం మొదలు పెట్టడంతోపాటు, వేడి, ధూళి, ఎండ పడకుండా ముఖానికి గుడ్డకట్టుకుని నాలుగు నెలలపాటు ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలికి తెలియజేయగా, ఆమె తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడింది. బాధితురాలు బుధవారం జీజీహెచ్‌లో చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ నాగేశ్వరమ్మను చికిత్స నిమిత్తం కలిశారు. అక్కడ విలేకరులకు తన ఆవేదన తెలియజేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు చేసిన తప్పుకు తాను శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని బాధిత మహిళ వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తన మాదిరిగా మరే మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. విచ్చిలవిడిగా బ్యూటీ పార్లర్లు గుంటూరు నగరంలో బ్యూటీ పార్లర్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వీటిపై ఏ శాఖకు స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మోటిక్ వంటి వాటిపై తమకు నియంత్రణ ఉందే తప్ప, బ్యూటీ పార్లర్‌పై నియంత్రణ లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు విన్నవించి వీటిపై ఫిర్యాదు చేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి తెలిపారు. -
ముఖకాంతికి బంగారం
ముఖ కాంతి పెరగాలంటే ‘గోల్డ్ ఫేసియల్’ మంచి ఎంపిక. ఈ ఫేసియల్ అన్ని చర్మతత్త్వాలకు సరిపడుతుంది. మృతకణాలను తొలగించడంలోనూ, ఎండకు కమిలిన చర్మానికి సహజమైన కాంతి తీసుకురావడంలోనూ, ముడతలను తగ్గించడంలోనూ.. ఇలా చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది ఈ ఫేసియల్! ఇంట్లోనే ఫేసియల్... నాణ్యమైన గోల్డ్ ఫేసియల్ కిట్ కొనుగోలు చేయాలి. ఈ కిట్‌లో గోల్డ్ క్లెన్సర్, గోల్డ్ ఫేసియల్ స్క్రబ్, గోల్డ్ ఫేసియల్ క్రీమ్ లేదా జెల్, గోల్డ్ ఫేసియల్ మాస్క్‌లు ఉంటాయి. క్లెన్స్: ముందుగా ముఖానికి గోల్డ్ క్లెన్సర్‌ను రాసి, మృదువుగా మసాజ్ చేసి, వెచ్చని నీటితో కడిగి, కాటన్ టవల్‌తో తుడుచుకోవాలి. స్క్రబ్: మృతకణాలను తొలగించడానికి గోల్డ్ స్క్రబ్ సహాయపడుతుంది. క్రీమ్: గోల్డ్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు రాసి కింద నుంచి పైకి వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ క్రీమ్.. గోల్డ్ ఫాయిల్, గోల్డ్ పౌడర్, గోధుమ నూనె, కుంకుమపువ్వు, అలొవెరా జెల్, చందనం కలిగి ఉంటుంది. చర్మానికి బాగా ఇంకేలా వేళ్లతో రాసి, తడి క్లాత్‌తో తుడవాలి. మాస్క్: కిట్‌లోని గోల్డ్ మాస్క్ క్రీమ్ తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. ఇందులో పసుపు, గోల్డ్ ఫాయిల్, అలొవెరా జెల్ ఉంటాయి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటిని చిలకరించి, శుభ్రపరచాలి. మాయిశ్చరైజర్: విడిగా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వేళ్లతో కొద్దిగా తీసుకొని, ముఖానికి, మెడకు రాసి వలయాకారంగా కదలికలు ఇవ్వాలి. నోట్: 1. స్క్రబ్ చేసిన తర్వాత ముఖానికి ఆవిరి పట్టడం తగ్గించాలి. ఆవిరికి చర్మం ముడతలు పడే అవకాశం ఉంది. 2. నాణ్యమైన ఉత్పత్తులను వాడితేనే మంచి ఫలితం.