అక్కినేని అంటే పట్టుదల... అక్కినేని అంటే కార్యదీక్ష... అక్కినేని అంటే ధర్మాగ్రహం...
అక్కినేనిలో కోపం కనిపించదు. కానీ... ఆయనది ధర్మరాజు ఆగ్రహం. అక్కినేనిని నటునిగా పరిచయం చేసిన దర్శకుడు పి.పుల్లయ్య చనువుతో... ఆయన్ను ఓ అనరాని మాట అన్నారు. అక్కినేని అప్పుడు చాలా చిన్నవాడు. అయినా... ఆయన మనస్సు చివుక్కుమంది. కాలచక్రం గిర్రున పదిహేనేళ్లు తిరిగింది.. అక్కినేని సూపర్‌స్టార్‌గా అవతరించారు. అదే పుల్లయ్య... ‘అర్ధాంగి’ సినిమాలో హీరో పాత్ర కోసం అక్కినేనిని కలిశారు. ‘మీరు మళ్లీ తిడతారేమోనని భయంగా ఉందండీ’ అన్నారు తాపీగా అక్కినేని. పుల్లయ్య గతుక్కుమన్నారు. ‘ఏదో పొరపాటున అన్నానయ్యా...’ అని అపాలజీ చెప్పారు. మనసు బాధ పడితే... ఆ బాధను తేలిగ్గా మరిచిపోడు అక్కినేని అంటానికి ఇదో నిదర్శనం.
స్ఫురద్రూపం.. పచ్చటి ఛాయ.. ఖంగున మోగే కంఠం.. అద్భుతమైన భాషా పరిజ్ఞానం... ఇవన్నీ ఉంటేనే హీరో అనుకుంటున్న రోజుల్లో... హీరోకు ఉండాల్సింది ఇవేమీ కావు... మనుషుల్ని తెలుసుకోవడం, మనసుల్ని తెలుసుకోవడం, మట్టి వాసన తెలుసుకోవడం.. హీరో అంటే కోటికొక్కడు కాదు. అందరిలో ఒక్కడు అని నిరూపించిన మేటి అక్కినేని. అర్హతల గురించి ఆలోచించకుండా.. ఇంతమంది సినీ నటులు కావాలని ఉవ్విళ్లూరుతున్నారంటే... దానికి బీజం వేసింది ఆయనే.
మహానటుడుగా ఎంత ఎదిగాడో.. మహావ్యక్తిగా అంత ఎదిగిన ఘనత ఒక్క అక్కినేనికే చెల్లుతుంది. తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయబావుటా ఎగరవేసిన మేరునగధీరుడు అక్కినేని నాగేశ్వరరావు. హీరోగా నంబర్‌వన్ అయ్యారు. నిర్మాతగా నంబర్‌వన్ అయ్యారు. స్టూడియో అధినేతగా నంబర్‌వన్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లలేదు కానీ... వెళితే... అక్కడ కూడా నంబర్‌వన్ అయ్యేవారేనేమో.
ఏఎన్నార్ చదివింది నాల్గవ తరగతి. కానీ ఆయన మాట్లాడినట్లు గ్రాడ్యుయేట్‌లు కూడా ఇంగ్లిష్ మాట్లాడలేరు. ఏఎన్నార్ పెద్ద అందగాడు కాదు.. కానీ ఆయన్ను ఆరాధించినట్లుగా అమ్మాయిలు ఏ హీరోనీ ఆరాధించలేదు. సాటి, పోటీ అయిన ఎన్టీఆర్‌తో పోలిస్తే... ఏ మూల నుంచి చూసినా అక్కినేని హీరోలా అనిపించరు. కానీ హీరోదాత్తమైన పాత్రలకు తెలుగుతెరపై శ్రీకారం చుట్టింది ఏఎన్నారే. తెలుగులో తొలి సోషల్ యాక్షన్ సినిమా అక్కినేనిది. ఆ సినిమానే ‘దొంగల్లో దొర’(1957). పదిమంది కథానాయికలతో ఒకేసారి డ్యూయెట్ పాడిన తొలి రొమాంటిక్ హీరో అక్కినేని. ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961) ట్రైన్‌పై ఫైట్ చేసిన తొలి హీరో అక్కినేని.
ఆ సినిమా ‘బుద్ధిమంతుడు’(1969). హెలీకాప్టర్‌పై ఫైట్ చేసిన తొలి హీరో అక్కినేని. ఆ సినిమా ‘బంగారుబాబు’(1973). కథానాయికలకు మాత్రమే పరిమితమైన డాన్సుల్ని హీరోకీ వర్తింపజేసి, హీరోలకు డాన్సులు కంపల్సరీ చేసింది అక్కినేని. ఆయన అందుకున్న పురస్కారాలు ఎవ్వరూ అందుకోలేదు. ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు ఏ నటుడిపైనా రాలేదు. ఇలా చూసుకుంటూ పోతే... అక్కినేని రికార్డులు ఎన్నో... ఎన్నెన్నో...
- బుర్రా నరసింహ
పదిహేనేళ్లయినా మర్చిపోలేదు!
Published Thu, Jan 23 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement