akkeneni nageswara rao
-
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!
దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఏఎఫ్.ఏ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఉదాహరణంగా వివరించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఏ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఏ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనేగ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యం చేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్‌ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. క్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.” శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు) -
ANR Birthday Special: మహానటుడు, రికార్డుల రారాజు
సాక్షి, హైదరాబాద్: సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన గొప్ప నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. యావత్ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. ఏఎన్ఆర్ అంటే తరతరాలకు తరగని గని. ఆయన సినిమాలు, పాత్రలు గొప్ప పాఠాల్లాంటివి. తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటిన ఘనత ఆయనది. పెద్దగా చదువుకోకపోయినా నాటకాల్లో స్త్రీ పాత్రల్లో రాణించారు. స్వయంగా పద్యాలు పాడుతూ ఆకట్టుకున్నారు. ఆ తరువాత సినీరంగంలో ఎన్నో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో తనదైన హావభావాలు, నటనతో నట సామ్రాట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. అందుకే ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ విభూషణ్, కళా ప్రపూర్ణ , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సహా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1923, సెపెంబర్ 20న పుట్టిన ఆయన చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి, అనేక కష్టసుఖాలకోర్చి, పట్టుదలతో రాణించి పుట్టిన గడ్డ గర్వపడేలా ఎదిగారు. అంతేనా.. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను అందించారు. (ANR: ఫేవరెట్ వాచ్, ఖద్దరు ఇదే! నాగ్ ఎమోషనల్ ట్వీట్) తొలినాళ్ళలో నాటక రంగానికి ఆకర్షితుడై బాల్యంలోనే స్త్రీ పాత్రలతో అలరించిన అక్కినేని నాగేశ్వరరావు, 1941లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ప్రశంసలందుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారంటేనే ఆయన నట ప్రస్థానాన్ని ఊహించుకోవచ్చు. ఎన్నో చిత్రాలు, మరెన్నో పాత్రలు, ప్రతిపాత్రా ఒక ఛాలెంజ్. ప్రతీ సినిమా ఒక ల్యాండ్ మార్క్. కీలు గుర్రం సినిమాలో బాలరాజుగా అద్భుత నటనతో తొలి జానపద హీరోగా శభాష్ అనిపించుకున్నారు. ఇలా జానపదం, సాంఘికం పౌరాణికం పాత్ర ఏదైనా దానికి జీవంపోశారు. అక్కినేని సినీ ప్రస్థానంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో. ప్రేమికుడిగా మురిపించినా, భగ్న ప్రేమికుడుగా ఏడిపించినా, ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా, వీరభక్తుడిగా అలరించినా, సైనికుడిగా ధీరత్వం చూపించినా అది ఆయనకు మాత్రమే సొంతం. తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూత లూగించడమే కాదు. తన ఊపిరి ఉన్నంత వరకు కళామతల్లికి సేవచేస్తూనే ఉంటానన్న మాటకు కట్టుబడి అనారోగ్యంతో బాధపడుతున్నా 'మనం' ద్వారా తన మాటను నిలబెట్టుకున్నారు. అలాగే హీరో అక్కినేని నాగార్జునతో పాటు, యంగ్ హీరోలు నాగ చైతన్య, అఖిల్, సుమంత్ తదితరులను తన నట వారసులుగా అందించారు. రాసికన్నా వాసి మిన్న అని నమ్మిన ఏఎన్ఆర్ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకునే వారని సినిమా పెద్దలు చెబుతుంటారు. కుటుంబ సంబంధాలు, ఆత్మీయతా, అనురాగాలు, మానవ విలువలకు తన చిత్రాల్లో పెద్ద పీట వేసేలా జాగ్రత్త పడ్డారు. 1990వ దశకంలో బంగారు కుటుంబం నుంచి చిట్టచివరి సినిమా మనంలోనూ అదే చాటి చెప్పారు. సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజి బుల్లోడు, అనుబంధం, శ్రీవారి ముచ్చట్లు లాంటి చిత్రాలతో పాటు అమరశిల్పి జక్కన, విప్రనారాయణ, భక్త తుకారాం లాంటి ఆణిముత్యాలను అందించారు. ఈ క్రమంలో 1991లో స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. డాక్టర్ చక్రవర్తి ద్వారా తొలి నందిని అందుకున్నారు నాగేశ్వరరావు. దీంతోపాటు అంతస్తులు, స్వీయ నిర్మాణంలో వచ్చిన సుడిగుండాలు చిత్రాలకు కూడా నంది అవార్డులు దక్కాయి. మహాకవి కాళిదాసుగా అద్భుత నటనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస సమ్మాన్ బిరుదు వరించింది. అలాగే మేఘసందేశానికి 18 అవార్డుల తోపాటు, మరో బంగారు నందిని దక్కించుకోవడం విశేషం. మలిదశలో సీతారామయ్యగారి మనువరాలు సినిమాతో ఫిలింఫేర్ సొంతం చేసుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు. అవార్డుల రారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరావు 1968లో పద్మశ్రీ అందుకున్న తొలిహీరో. అంతేకాదు 1988లో గౌరవ పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు హీరో అక్కినేని. 1990లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడు. 1996లో ఎన్టీఆర్ అవార్డు, 2011లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. రోజులు మారాయి, అనార్కలి, దసరాబుల్లోడు, దేవదాసు, ప్రేమాభిషేకం ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రజలు బళ్లు కట్టుకొని మరీ వచ్చి ఆయన సినిమాలను చూసేవారట. ప్రధానంగా పూర్తి రంగుల హంగులతో వచ్చిన దసరా బుల్లోడు, ప్రేమ్‌నగర్ సినిమాలు పెద్ద సంచనలనం. వీటితోపాటు అనేక సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరెన్నో సినిమాలు శతదినోత్సవాల్ని దాటేసి సుదీర్ఘకాలం థియేటర్లలో సందడి చేసి రికార్డు సృష్టించాయి. సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలతోపాటు నవరాత్రి మూవీలో ఏకంగా తొమ్మిది పాత్రలతో మెప్పించి లెజెండ్ అనిపించుకున్నారు. ఇక లవ్ అండ్ రొమాంటిక్ కింగ్‌గా మహిళా ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్నారు. తనదైన స్టెప్పులతో ప్రేక్షకులతో ఈలలు వేయించుకున్నారు. 75 వసంతాలకు పైగా వెండితెరను సుపంపన్నం చేసిన ఆయన సినిమాలు అప్పటికి ఇప్పటికీ ఏనాటికీ చిరస్మరణీయమే. -
ఇక్కడా పదిలం
ఏయన్నార్...తెలుగువారి గుండెలపై చెదిరిపోని పచ్చబొట్టు. గుర్తుకు వచ్చినప్పుడల్లా హుషారైన ‘దసరా బుల్లోడు’. వయోబేధాలతో పనిలేకుండా అందర్నీ మెప్పించిన ‘ఆత్మీయుడు’. ఎందరితోనో ఆయనకు ‘వి‘చిత్ర’బంధం’. ముచ్చటగా మూడు తరాల వారికి అక్కినేని ‘సూత్రధారి’. ఇలా పాలమూరు జిల్లావాసులతోనూ ఆ మహానటుడు అనుబంధాన్ని పంచుకున్నాడు. రెండుమార్లు ఈ ప్రాంతాన్ని వేర్వేరు సందర్భాల్లో సందర్శించాడు. ఇక సినీరంగం వారితోనూ, ఎగ్జిబిటర్లతోనూ సంబంధాన్ని కొనసాగించారు. అభిమాన సంఘాలవారైతే ఏటా ఆయన పుట్టినరోజునాడు వెళ్లి కలిసేవారు. ఆ జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ ఆయన అభిమానులు కంటతడిపెడుతున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ ‘బుద్ధిమంతుడు’ తమ హృదుల్లో ఎప్పుడూ సజీవుడే అని చెప్తున్నారు. విభిన్న పాత్రలను పోషించి వెండితెర వేల్పుగా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ‘అందరికి టాటా...గుడ్‌బై...ఇంక సెలవు’ అంటూ ఈ లోకాన్ని వీడారని తెలియడంతో బుధవారం జిల్లాలో ఆయన అభిమానులు, ఆయనతో అనుబంధం ఉన్నవారు కన్నీటి సాగరంలో మునిగారు. తొలితరం హీరో అక్కినేని మరణం యావత్ ప్రేక్షక లోకాన్ని కుదిపేసింది. - న్యూస్‌లైన్, పాలమూరు, మహబూబ్‌నగర్ (కల్చరల్) ఇది 47 ఏళ్లకిందటి మాట... ఆయన ఒకే ఒక్కసారి పాలమూరు పట్టణానికి విచ్చేశారు. 1967 సంవత్సరంలో ఆయన కథానాయకుడుగా నటించిన పూలరంగడు సినిమాను ప్రదర్శిస్తున్న ఒకప్పటి అశోక్ థియేటర్‌ను అప్పట్లో సందర్శించారు. సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులను తనదైన శైలిలో పలకరించి వెళ్లారు. ఆయన రాక తమకెంతో సంతోషాన్ని కలిగించిందని, తాము బ్రతికున్నంత కాలం ఆయనను మదిలో గుర్తుంచుకుంటామని పలువురు అభిమానులు ఆ రోజును గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్ల కిందట గద్వాలకు వచ్చిన అక్కినేని గద్వాల, న్యూస్‌లైన్ : ‘ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం గద్వాలకు వచ్చారు. ఇక్కడ కొత్తగా నిర్మాణమైన శ్రీనివాస థియేటర్ ప్రారంభోత్సవానికి 3 ఫిబ్రవరి 1983 రోజున వచ్చారు. ఈ థియేటర్లో మొదటి ప్రారంభోత్సవ చిత్రంగా ఆయన నటించిన ప్రేమాభిషేకం సినిమాను ప్రదర్శించారు. వెంకటేశ్వర సినీ ఫైనాన్స్, నిర్మాతగా వ్యవహరిస్తున్న గద్వాల వెంకట్రామిరెడ్డి సినీ ప్రముఖులతో ఉన్న పరిచయాలతో నాగేశ్వరరావును గద్వాలకు ఆహ్వానించారు. అప్పుడు మా అందరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడడం ఇప్పటికీ గుర్తుంది. అలాంటి ఉన్నత వ్యక్తి మృతి మమ్మల్ని కలచివేసింది’ అని థియేటర్ నిర్వాహకులు రాజవర్ధన్‌రెడ్డి, మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డిలు అన్నారు. ఏడోతరగతిలోనే ఆయనను కలిశాను..! నేను స్థానిక మోడల్బేసిక్ ఉన్నత పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నపుడు 1977 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వర్రావును కలిసే అవకాశం దక్కింది. మా పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు, 8 మంది విద్యార్థులం కలిసి రేడియో స్టేషన్లో పాటలు పాడేందుకు వెళ్లాం. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మా బృందం అంతా కలిసి అక్కినేని నివాసానికి వెళ్లాం. ఆ చిన్న వయసులోనే ఆయనను కలిసే అవకాశం వచ్చింది. మా నాన్నకు అక్కినేని సన్నిహితులు కావడం.. ఆయన సినిమాల పట్ల నాకున్న అపరిమితమైన అభిమానం కారణంగానే నేను జిల్లా కేంద్రంలో థియేటర్లు నెలకొల్పాలన్న అభిప్రాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో జరిగిన పలు సినిమా వేడుకల్లో అక్కినేని నాగేశ్వర్రావుతో కలిసే అవకాశం దక్కింది. - గుద్దేటి శివకుమార్, సినిమా థియేటర్ల యజమాని మరపురాని సృ్మతి..! నటనలో ఆయనకు ఆయనే సాటి. గంగోత్రి పేరిట ఆరునెలల క్రితం లయన్స్‌క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వర్రావు చేతుల మీదుగా.. సత్కరింపబడటం నాకు మరపురాని సృ్మతి. కాలధర్మం చెందిన అక్కినేనికి నివాళి. 1990-96 వరకు నేను ఫిల్మ్‌ఛాంబర్ సభ్యుడిగా కొనసాగాాను. ఎన్నో సినిమా వేడుకల్లోనూ ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అంతకు పూర్వం నాగర్‌కర్నూల్‌లో మా నాన్నగారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రవీంద్ర థియేటర్లో అక్కినేని సినిమాలు ఎక్కువగా ప్రదర్శించే వాళ్లం. ఆయన మనవడు సుమంత్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రారంభోత్సవ వేడుక లోనూ అక్కినేనిని కలిసే అవకాశం దక్కింది. ఆయనతో నాది మరపురాని అనుబంధం. - ఎ.నటరాజ్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌ఛైర్మన్ ప్రేమ స్వరూపుడు షాద్ నగర్, న్యూస్‌లైన్: నా దృష్టిలో అక్కినేని మంచి నటుడే కాదు. సమాజానికి మార్గదర్శకుడు కూడా. సమయాపాలన, విధి నిర్వహణ, అంకితభావం మొదలైనవి ప్రాణపదంగా భావించేవారు అక్కినేని నాగేశ్వరరావు. తరతరాల యువతకు భవితకు బంగారుబాటలు పరిచిన మంచి మనసున్న ఓ మనోవైజ్ఞానికుడు కూడా. అలాంగటి మహోన్నతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని భాషపైన పట్టు, భావ ప్రకటన, హుందాతనం, గాంభీర్యతను నాలో పెంపొందించుకొని నా ఆధ్యాపక వృత్తికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తున్నాను. అక్కినేనితో నాకు పుష్కరకాలంగా ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. వారి చేతుల మీదుగా హాస్యచక్ర బిరుదును అందుకున్నాను. వారికి బెల్లంతో చేసిన జిలేబిలు అంటే ఎంతో మక్కువ. ఎప్పుడు అక్కినేనిని కలవడానికి వెళ్లినా వాటిని తీసుకు వెళ్లేవాడిని. అక్కినేని మన మధ్య లేకపోయినా ఆయన మిగిల్చిన మధురసృ్మతులు మనమధ్యే ఉంటాయి. - రాధాకృష్ణ, తెలుగు ఉపాధ్యాయుడు, షాద్‌నగర్ ప్రతీ పుట్టినరోజుకు వెళ్లేవాడిని ఏటా సెప్టెంబర్ 20వ తేది వచ్చిం దంటే మాకు పండుగరోజులా ఉం డేది.. ఆరోజు ఉదయాన్నే హైదరాబాద్‌కు వెళ్లి అక్కినేని నాగేశ్వర్రావును కలిసిన తర్వాతే మాకు సంతృప్తి కలి గేది. అలా.. దాదాపు 44 ఏళ్లుగా ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని నేను ఎప్పటికప్పుడు చాటుకునే వాడిని. 1970లో నటరాజ్ థియేటర్ ఏర్పాటు చేసిన నాటి నుంచి అక్కినేని అభిమానిని. అయితే 1976లో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి అభిమానుల సంఘం లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చాను. నాగేశ్వరరావు పుట్టి న రోజునాడు హైదరాబాద్‌కు వెళ్లేవాళ్లం.. చాలా ఏళ్లుగా నేను అక్కినేని అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఆయన చనిపోయారని తెలిసినప్పటి నుంచి అన్నం సహించడంలేదు. మా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నోసార్లు ఆయన్ను కలిసాను. అంత్యక్రియలకు మేమంతా హాజరవుతున్నాం. - అబ్దుల్ ఖాదర్, అక్కినేని అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొప్ప భావాలున్న వ్యక్తి అక్కినేని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. భవిష్యత్ తరాలవారందరికీ ఆయన ఆదర్శం. నటుడిగా కన్నా.. గొప్ప భావాలున్న వ్యక్తిత్వం అక్కినేనిది. ఇరవై ఏళ్లకిందట హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమంలో చేపట్టిన లయన్స్‌క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అక్కినేని ప్రసంగిస్తూ.. ప్రతీ మనిషికి ఆత్మబలం గొప్పదని, దృఢ సంకల్పం కలిగిన మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. - సత్తూరు రాములుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు. చిత్రసీమకు పెద్దవాడు సహజనటుడు, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించడమే కాకుండా నటన ద్వారా అభిమానులకు దిశా నిర్దేశం చూపిన మహా నటుడు నాగేశ్వరరావు సినిమాలంటే కుటుంబ కథాంశాలతో ముడివడి ఉంటుందని చూసేవాళ్లం. ఆయనలేని లోటు చిత్రసీమకు తీరనిలోటు. - బుర్రి వెంకట్రాంరెడ్డి, కళాపోషకుడు -
మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను!
అక్కినేని దేవుణ్ని పెద్దగా నమ్మేవారు కాదు; అభిమానుల ఆశీర్వాదబలాన్ని మాత్రం నమ్మేవారు. అక్కినేని గుడికి వెళ్లేవారు కాదు; పరిశ్రమనే దేవాలయంగా భావించేవారు. ఆధ్యాత్మిక, ఆహార, అలవాట్ల విషయాల్లో ఆయనవైన పద్ధతులు ఉండేవి. నటనలోనే కాదు, వాటిలో కూడా ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకోవచ్చు. కొన్నేళ్లక్రితం అక్కినేనితో వివిధ వ్యక్తిగత అంశాల మీద జరిపిన సంభాషణాసారం.. ఆరోగ్యం: మీ ఆరోగ్య రహస్యం ఏంటంటారు? 1. వారసత్వంగా వచ్చిన జీన్స్; 2. నిర్వహణ; 3. అభిమానుల ఆశీస్సులు! నిర్వహణ అంటే క్రమశిక్షణ, మితాహారం, సమయపాలన, ప్రతి విషయానికీ గాభరా పడకపోవడం... ఇవన్నీ! ఇక అభిమానుల ఆశీస్సులు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. (నవ్వుతూ) లండన్‌లో బీబీసీ వాడి ప్రసారాలు ఇక్కడ మనం అందుకోవడం లేదూ... ఇదీ అంతే! మిమ్మల్ని భయపెట్టిన అనారోగ్యం ఏదైనా వుందా? (క్యాన్సర్‌ను గుర్తించకముందు చెప్పిన మాటలివి) అసలు ఇంతవరకూ తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి ఎరగను! ఒక్క పన్నూ ఊడలేదు! ఒకే ఒక్కసారి అనారోగ్యం వచ్చింది. 1955లో కాశ్మీరులో ఉండగా స్మాల్‌పాక్స్ వచ్చింది. 1974 అక్టోబర్ 18న తొలిసారి బైపాస్ సర్జరీ జరిగింది. 1988లో రెండోసారి గుండెపోటు వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకుని, గుండె బలహీనంగా ఉండడంతో మానేశారు. ఆ ఆపరేషన్ అయ్యి నాలుగు దశాబ్దాలైంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ ఇలా ఆపరేషన్ అయ్యాక ఇన్నేళ్లు బతకలేదట! మనోబలాన్ని మించింది మరొకటి లేదు. అదే నా శక్తి! మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఉదయం 5 గంటలకు లేస్తాను. 45 నిమిషాలు మెడిటేషన్, వాకింగ్ చేస్తాను. తర్వాత పేపర్లు చదువుతాను. 1946 నుంచి దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి సలహా మేరకు ‘హిందూ’ పేపరు కచ్చితంగా చదువుతున్నాను. ఆల్కహాల్ అలవాటు వుందా? నాకు మొదట్లో మందు అలవాటు లేదు. అయితే కొలెస్టరాల్‌ను కరిగించేందుకు ఆల్కహాల్ ‘వాసోడైలేటర్’గా పనిచేస్తుందని రోజుకు రెండు ఔన్సుల బ్రాందీ తీసుకోమన్నారు డాక్టర్లు. అప్పటినుంచీ తీసుకుంటున్నాను. ఆహారం: మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఇష్టపడే ఐటమ్స్? తిననివి? దాదాపు వెజిటేరియన్నే! మునుపు కొంచెం నాన్‌వెజ్ తినేవాణ్ణి కానీ ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఒకప్పుడు వృత్తి మూలంగా లిమిట్లో తినాల్సి వస్తే, ఇప్పుడు ఆరోగ్యరీత్యా లిమిట్లో తినాల్సి వస్తోంది. గుత్తి వంకాయ కూరంటే ఇష్టం! అలాగే బెల్లంతో చేసిన పదార్థాలంటే ఇష్టం. ఇక ఇష్టపడనివంటే... వేపుళ్లు అస్సలు తినను! మీ డైలీ ఫుడ్ చార్ట్..? బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్స్ ఎక్కువగా వుండే పదార్థాలు, పాలు తీసుకుంటాను. వీటికి అదనంగా చిన్న పైనాపిల్ ముక్క, గ్లాసు మజ్జిగ! మధ్యాహ్నం సోయామిల్క్ తాగుతాను. మళ్లీ 11.30 నుంచి 12 గంటల మధ్య మజ్జిగ తీసుకుంటాను. ఇక లంచ్ విషయానికొస్తే ఒక చపాతీ, పులుసు కూర, ఇగురు కూర, సాంబారు, ఒక స్పూన్ అన్నం తింటా! రాత్రి మాత్రం కొద్దిగా అన్నం తీసుకుంటాను. దుస్తులు: సాధారణంగా ఎటువంటి దుస్తులు ఇష్టపడతారు? షాపింగ్ చేస్తారా? సినిమాల్లో రంగురంగుల బట్టలు వేసుకోవడం ఇష్టపడేవాణ్ణి కానీ, విడిగా ఖద్దరు ఇష్టం. అప్పుడప్పుడూ ప్యాంటూ షర్టూ వేస్తుంటాను. ఇక షాపింగ్ అంటారా... అమెరికాలాంటి దేశాలకెళితే తప్ప అస్సలు చేయను! ఫ్యాషన్లను పట్టించుకుంటారా? పట్టించుకుంటాను... కానీ అవి సినిమాల వరకే పరిమితం! ఈ పంచెకట్టు ఎప్పటినుంచి అలవాటు? సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తున్నప్పుడు ఓసారి వెయ్యి రూపాయలు సంపాదించాను. ఆ సమయంలో దుక్కిపాటి మధుసూధనరావుగారు, మరో ఇద్దరు బంధువులు కలిసి తలో ఐదువేల పెట్టుబడితో గుడివాడలో ‘జవహర్ ఖాదీబండార్’ పెట్టారు. ఆ షాపు ఓపెనింగ్ టైంలో ముగ్గురు కలిసి వ్యాపారం చేయకూడదని ఎవరో సెంటిమెంట్ పెట్టారు. దాంతో నా దగ్గరున్న వెయ్యి రూపాయలతో నేనూ ఒక భాగస్వామిగా చేరాను. అప్పుడు ఖద్దరు బట్టలు కొన్నాను. అప్పటినుంచీ పంచెలే అలవాటయ్యాయి. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు. అన్నపూర్ణా స్టూడియో కట్టిన సమయంలో ప్యాంట్లు కుట్టించుకున్నాను. జూలై, ఆగస్టుల్లో గాలి ఎక్కువగా వీస్తుంది. అప్పట్లో స్టూడియో చుట్టుపక్కలంతా నిర్మానుష్యం కాబట్టి సుడిగాలులు వీచేవి. దగ్గరుండి పనులు చేయిస్తున్నప్పుడు ఈ గాలులు వల్ల పంచె ఎగురుతుండేది. దాంతో కంఫర్ట్ కోసం పది ప్యాంట్లు కుట్టించాను. అంతకుముందు నా జీవితంలో ప్యాంట్లు కుట్టించడమే ఎరుగను. నా కోసం అప్పట్లో ప్రత్యేకంగా పొందూరులో పంచె అంచెను డిజైన్ చేసేవారు. ‘నాగేశ్వరరావు అంచు’ అని దానికి పేరు. ఇప్పుడు హైదరాబాదులోనే కొంటున్నాను. ప్రస్తుతం సభలూ సమావేశాలకే పంచెను పరిమితం చేశాను. ఆడవాళ్లలో మీరు ఎటువంటి వస్త్రధారణను కోరుకుంటారు? చీరకంటే అందమైనది ఇంకేం ఉంది! ఒంపుసొంపులన్నీ చీరకట్టులోనే బాగా కనబడతాయి! పుస్తకాలు: మీరు పుస్తకాలు చదువుతుంటారా? చదవను! మనుషులను, వాళ్ల మనస్తత్వాలను చదవడం ఇష్టపడతాను. అయితే చిన్నప్పుడు మాత్రం శరత్ నవలలు చదివేవాణ్ణి. ఆధ్యాత్మిక గ్రంథాలు..? అస్సలు చదవను! నా ఆధ్యాత్మిక గ్రంథం సినిమానే! దేవాలయం ఇక్కడే వుంది... దేవుడూ ఇక్కడే వున్నాడు! ఇక వేరే ఆధ్యాత్మికత లేదు. మీరిష్టపడే సినీరచయితలు? చాలామంది ఉన్నారు. నీట్‌గా డైలాగ్‌లు రాయాలంటే సముద్రాల రాఘవాచార్యగారే! అలాగే ఆరుద్ర గారిది ఒక స్టయిల్. నాకెక్కువ ఆత్రేయగారే పనిచేశారు. ఇలా ఇంకా ఎంతోమంది అద్భుతమైన ప్రతిభావంతులు నాకెంతో జ్ఞానాన్నిచ్చారు! భక్తి: దేవుని ఉనికి గురించి..? ఎనభై లక్షల జీవరాశుల్లో గొప్ప జీవరాశి మానవుడు. అతణ్ణి మించిన శక్తిమంతుడు లేడు. అసలు నా దృష్టిలో మనకు మించిన శక్తిమంతుణ్ణి గౌరవించడమే ఆస్తికత్వం! నేను పెద్దవాళ్లను గౌరవిస్తాను, మంచితనం ఎక్కడుంటే అక్కడే భగవంతుడు ఉంటాడని నమ్ముతాను. అసలు దేవుడున్నాడా లేడా అనే మీమాంసను పక్కనపెడితే... ఆ భావన వల్ల్లే మానవుల్లో కనీసం ఈ మాత్రమైనా క్రమశిక్షణ ఉందనిపిస్తుంది. అయితే మీరు నాస్తికులనుకోవచ్చా? మనల్ని సృష్టించిన అమ్మానాన్నల్ని పూజించకుండా, ఎక్కడో వున్నాడనుకునే దేవుణ్ణి పూజిస్తాం. దేవుడు ఉన్నాడని అనుకోవడం తప్పనికాదు... అన్నీ తనే చూస్తాడులే అనుకుని అనేక పాపాలు చేసుకుంటూ పోవడమే మంచిది కాదు! వెళ్లి హుండీలో డబ్బు వేసేస్తే పాపాలు కడిగేస్తాడు అనుకోవడం పొరపాటు. నువ్వు చెడు చేయనంతవరకు దేవునిగురించి ఆలోచించనక్కర్లేదంటాను నేను! మీ హ్యాపీనెస్‌కి, హ్యాపీలైఫ్కి దేవుడు కారణం అనుకోవడం లేదా? వయసు పెరిగాక - ఆరోగ్యం, మనశ్శాంతి, కాలక్షేపం అనేవి అతిపెద్ద సమస్యలు. అయితే వీటిని మూడు ఆయుధాలతో తిప్పికొట్టవచ్చు. దేహాన్ని దేవాలయంగా చూసుకోవడంతో ఆరోగ్యాన్ని; తన చుట్టూ వున్న వాళ్లను ప్రేమిస్తూ, ప్రేమించబడటంతో మనశ్శాంతిని; దేనికి ఎంత సమయం కేటాయించాలనే సమయపాలన ద్వారా కాలక్షేప సమస్యను జయించవచ్చు. ఏ వయసులోనైనా మనిషి సుఖసంతోషాలతో హాయిగా జీవించాలంటే యుద్ధాలు, పోరాటాలు చేసి రాజ్యాలు జయించనవసరం లేదు. ఈ మూడు సూత్రాలను కచ్చితంగా పాటించడమే నా హ్యాపీనెస్‌కు, హ్యాపీలైఫ్కూ ఫార్ములా! - పులగం చిన్నారాయణ -
పదిహేనేళ్లయినా మర్చిపోలేదు!
అక్కినేని అంటే పట్టుదల... అక్కినేని అంటే కార్యదీక్ష... అక్కినేని అంటే ధర్మాగ్రహం... అక్కినేనిలో కోపం కనిపించదు. కానీ... ఆయనది ధర్మరాజు ఆగ్రహం. అక్కినేనిని నటునిగా పరిచయం చేసిన దర్శకుడు పి.పుల్లయ్య చనువుతో... ఆయన్ను ఓ అనరాని మాట అన్నారు. అక్కినేని అప్పుడు చాలా చిన్నవాడు. అయినా... ఆయన మనస్సు చివుక్కుమంది. కాలచక్రం గిర్రున పదిహేనేళ్లు తిరిగింది.. అక్కినేని సూపర్‌స్టార్‌గా అవతరించారు. అదే పుల్లయ్య... ‘అర్ధాంగి’ సినిమాలో హీరో పాత్ర కోసం అక్కినేనిని కలిశారు. ‘మీరు మళ్లీ తిడతారేమోనని భయంగా ఉందండీ’ అన్నారు తాపీగా అక్కినేని. పుల్లయ్య గతుక్కుమన్నారు. ‘ఏదో పొరపాటున అన్నానయ్యా...’ అని అపాలజీ చెప్పారు. మనసు బాధ పడితే... ఆ బాధను తేలిగ్గా మరిచిపోడు అక్కినేని అంటానికి ఇదో నిదర్శనం. స్ఫురద్రూపం.. పచ్చటి ఛాయ.. ఖంగున మోగే కంఠం.. అద్భుతమైన భాషా పరిజ్ఞానం... ఇవన్నీ ఉంటేనే హీరో అనుకుంటున్న రోజుల్లో... హీరోకు ఉండాల్సింది ఇవేమీ కావు... మనుషుల్ని తెలుసుకోవడం, మనసుల్ని తెలుసుకోవడం, మట్టి వాసన తెలుసుకోవడం.. హీరో అంటే కోటికొక్కడు కాదు. అందరిలో ఒక్కడు అని నిరూపించిన మేటి అక్కినేని. అర్హతల గురించి ఆలోచించకుండా.. ఇంతమంది సినీ నటులు కావాలని ఉవ్విళ్లూరుతున్నారంటే... దానికి బీజం వేసింది ఆయనే. మహానటుడుగా ఎంత ఎదిగాడో.. మహావ్యక్తిగా అంత ఎదిగిన ఘనత ఒక్క అక్కినేనికే చెల్లుతుంది. తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయబావుటా ఎగరవేసిన మేరునగధీరుడు అక్కినేని నాగేశ్వరరావు. హీరోగా నంబర్‌వన్ అయ్యారు. నిర్మాతగా నంబర్‌వన్ అయ్యారు. స్టూడియో అధినేతగా నంబర్‌వన్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లలేదు కానీ... వెళితే... అక్కడ కూడా నంబర్‌వన్ అయ్యేవారేనేమో. ఏఎన్నార్ చదివింది నాల్గవ తరగతి. కానీ ఆయన మాట్లాడినట్లు గ్రాడ్యుయేట్లు కూడా ఇంగ్లిష్ మాట్లాడలేరు. ఏఎన్నార్ పెద్ద అందగాడు కాదు.. కానీ ఆయన్ను ఆరాధించినట్లుగా అమ్మాయిలు ఏ హీరోనీ ఆరాధించలేదు. సాటి, పోటీ అయిన ఎన్టీఆర్‌తో పోలిస్తే... ఏ మూల నుంచి చూసినా అక్కినేని హీరోలా అనిపించరు. కానీ హీరోదాత్తమైన పాత్రలకు తెలుగుతెరపై శ్రీకారం చుట్టింది ఏఎన్నారే. తెలుగులో తొలి సోషల్ యాక్షన్ సినిమా అక్కినేనిది. ఆ సినిమానే ‘దొంగల్లో దొర’(1957). పదిమంది కథానాయికలతో ఒకేసారి డ్యూయెట్ పాడిన తొలి రొమాంటిక్ హీరో అక్కినేని. ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961) ట్రైన్‌పై ఫైట్ చేసిన తొలి హీరో అక్కినేని. ఆ సినిమా ‘బుద్ధిమంతుడు’(1969). హెలీకాప్టర్‌పై ఫైట్ చేసిన తొలి హీరో అక్కినేని. ఆ సినిమా ‘బంగారుబాబు’(1973). కథానాయికలకు మాత్రమే పరిమితమైన డాన్సుల్ని హీరోకీ వర్తింపజేసి, హీరోలకు డాన్సులు కంపల్సరీ చేసింది అక్కినేని. ఆయన అందుకున్న పురస్కారాలు ఎవ్వరూ అందుకోలేదు. ఆయన మీద వచ్చినన్ని పుస్తకాలు ఏ నటుడిపైనా రాలేదు. ఇలా చూసుకుంటూ పోతే... అక్కినేని రికార్డులు ఎన్నో... ఎన్నెన్నో... - బుర్రా నరసింహ