ఆత్మబంధువు
ట్రింగ్‌గ్‌గ్... పక్కనే పెట్టుకున్న అలారం సరిగ్గా అయిదు గంటలకు మోగింది. ఆ శబ్దం వినిపించగానే టక్కున నాలుగు కళ్లు తెరుచుకున్నాయి. రెండు అంజన్నవి.. మిగతా రెండు తన అర్ధాంగి లక్ష్మివి. అర్ధాంగి అంటే అర్థం సగ భాగం. కానీ లక్ష్మమ్మ అంజన్నలో సగం కాదు మూడొంతులనే చెప్పాలి. ముప్పై ఐదేళ్ల తమ దాంపత్య జీవితంలో వారిద్దరూ ఇప్పటి వరకూ ఒకర్ని విడిచి మరొకరు ఉండలేదు. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఇద్దరూ కలిసే పంచుకున్నారు. ఉన్నదాంట్లోనే సంతోషంగా జీవించారు. అనుకోకుండా ఇప్పుడు వారిద్దరినీ ఓ కష్టం ప్రేమగా పలకరించింది!
రోజులాగే ఆ రోజు కూడా అలారం పెట్టుకొని ఉదయాన్నే లేచారిద్దరూ. రోజూలాగే ఆ రోజూ వాకింగ్‌కు బయలుదేరారు. ఇంటి గేటు దగ్గర మొదలైన సంభాషణ.. వాకింగ్ చేస్తున్న గంటసేపు సాగుతూనే ఉంది. ‘‘నాకెందుకో చాలా బాధేస్తోంది. ఇన్నేళ్లూ అది మన కష్టాలు తీర్చింది. ఇప్పటి వరకు వేళకింత తిండి దొరుకుతోందంటే దానివల్లే. పదహారేళ్లుగా మన సంతోషాలను, బాధలను చూసిందది. రేపటి నుంచి అది మన ఇంట్లో ఉండదని తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది’’ అంటూ భర్తతో చెప్పుకుంటూ కళ్లు తుడుచుకుంటోంది లక్ష్మి. భార్య కళ్లల్లో నీటిని చూడగానే.. అంజన్న కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా కూలబడ్డాడు. కంగారుతో లక్ష్మమ్మకు కాళ్లూ చేతులు వణికాయి. భర్తను మెల్లిగా లేపి పక్కనున్న ఓ అరుగుపై కూర్చోబెట్టింది. రెండు నిమిషాల్లో ఇద్దరూ సంబాళించుకొని, పది నిమిషాల్లో ఇల్లు చేరుకున్నారు.
గోడకున్న పెద్ద గడియారంలో టైం పదవుతోంది.. దంపతులు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సమయం గడుస్తోంది. అప్పుడో పిలుపు గేటు దగ్గర నుంచి వినిపించింది... ‘‘అంజన్నా.. పోదామా.. టైం అయింది..!’’. ఆ పిలుపుతో ఇద్దరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఒకరి ముఖాన్ని ఇంకొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ‘అంతా అయిపోయింది’ అన్న అర్థం ధ్వనిస్తోంది. రోజూ దేవుడికి దీపం పెట్టగానే, గ్లాసు పాలు తాగి, వేడివేడి అన్నం తిని బయలుదేరే అంజన్నకు ఆ రోజు ఏమీ సహించలేదు. పరగడుపునే గుండె నిండా బాధతో, కన్నీళ్లను దాచుకుంటూ.. చూపులతోనే వెళ్తున్నానని భార్యకు చెప్పి బయలుదేరాడు.
ఏడ్చి.. ఏడ్చి.. దిగాలుగా కూర్చున్న లక్ష్మమ్మకు... ‘మమ్మీ.. మమ్మీ’ అన్న పిలుపు వినిపించడంతో వెంటనే తలుపు దగ్గరకు వచ్చి నిల్చుంది. ‘‘మమ్మీ..! డాడీ వెళ్లాడా.. అసలు అలా గ్యారేజీకి పంపకుండా, మన ఆటోను ఊరికేనైనా ఇంట్లో ఉంచుకోవాల్సిందేమో’’ అంది. ఆ అమ్మాయికీ దుఃఖం ఆగట్లేదు. ఆటో రేపటి నుంచి ఇంట్లో కనిపించదంటేనే తనకు బాధగా ఉంది. తను, తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా అందులోనే తిరిగారు. తమ చిన్నతనమంతా అది చూసింది. ఎంత దూరం నుంచి డాడీ ఆటో వస్తున్నా.. అది మన ఆటోనే అని గుర్తు పట్టే వాళ్లు. హారన్ సౌండ్ వినిపిస్తే చాలు, డాడీ వస్తున్నాడని తెలుసుకునేవాళ్లు. అవన్నీ తలచుకుంటూనే తమాయించుకుంది. ‘‘మమ్మీ.. మనకే ఇలా ఉంటే, పాపం ఇరవై నాలుగు గంటలూ దానిపైనే తిరిగిన డాడీకి ఇంకెంత బాధగా ఉందో కదా’’ అంది.
‘‘అవునమ్మా.. ! నేనూ అదే ఆలోచిస్తున్నా.. ఆ ఆటో ఆయనలో ఒక భాగమైపోయింది. మనలో ఒక మనిషిగా మారిపోయింది. దానిపై వచ్చిన పైసలతోనే ఈ సంసారాన్ని ఇన్నాళ్లూ వెళ్లదీశాం. నిన్ను చదివించి, పెళ్లి చేశాం.. చిన్నోణ్ని చదివించాం. అదంతా మన ఆటో చలవే. మీ చదువులకు, పెళ్లికి అయిన అప్పును కూడా దాని మీదే తీర్చాం. ఇప్పుడది బాగా మొరాయిస్తోందని అమ్ముతున్నాం కానీ నాకూ, డాడీకి అసలు ఇష్టం లేదమ్మా. దాన్ని గ్యారేజీలో ముక్కలు ముక్కలుగా విడదీస్తారంటేనే నాకు బాధగా ఉంది. పేరుకు ఆటోనే కానీ, అది మన ఇంట్లోని మనిషే. ఏనాడూ యాక్సిడెంట్ జరగకుండా మనల్ని కాపాడింది. ఇప్పుడు అరవై వేల కోసం దాన్ని అమ్ముతున్నందుకు గుండె పగిలిపోతోంది. కానీ ఆ పైసలకు కష్టంగా ఉండబట్టి అమ్ముతున్నాం. అది అమ్మకుండా కొత్త ఆటోను కొనాలంటే అంత డబ్బు లేకపాయే. ఆ డబ్బే ఉంటే, దాన్ని మన పెరట్లో ఓ జ్ఞాపకంలా ఉంచుకొని, అపురూపంగా చూసుకునే వాళ్లం’’ అంటున్న తల్లికి మంచినీళ్లు అందించింది కూతురు. - నిఖిత నెల్లుట్ల