సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్‌నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్‌కు వచ్చారు.
సునీత, సురేష్‌లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్‌కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్‌కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్‌కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు.
జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్‌లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్‌కు కూడా.
భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్‌ల మధ్య ఇది శూన్యం.
మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్‌కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం.
అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్‌పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు.
ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు.
నిరంతరం ప్రయత్నించాలి..
- ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్‌లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి.
- శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్‌ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి.
ఆత్మీయతకు ఆటంకాలు
- ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం.
- కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది
- పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది.
(చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!)
Comments
Please login to add a commentAdd a comment