ఆర్థిక ఒత్తిడిని జ‌యించాలంటే..! | Case of the expenses to be perfect | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఒత్తిడిని జ‌యించాలంటే..!

Published Mon, Feb 11 2019 3:39 AM | Last Updated on Mon, Feb 11 2019 4:52 AM

Case of the expenses to be perfect - Sakshi

ఇప్పుడు ఎవరినోటవిన్నా వినిపిస్తున్న మాట.. ఒత్తిడి. జీవనశైలిలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఇక మన దేశానికొస్తే... ప్రతీ పది మందిలో ఒక్కరు మినహా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఆర్థిక అంశాలే మూలమని సిగ్నా 360 వెల్‌ బీయింగ్‌ సర్వే పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారు 86 శాతం అయితే, మన దేశంలో మాత్రం 89 శాతంగా ఉన్నారు. ఉద్యోగం కోల్పోవడం లేదా కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణంతో అప్పులు... ప్రణాళిక లేని ఖర్చులు ఇలా ఆర్థిక ఒత్తిళ్లకు ఎన్నో కారణాలు ఉంటున్నాయని పీక్‌ ఆల్ఫా ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ప్రియా సుందర్‌ తెలిపారు. ఈ ఒత్తిళ్లు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. ఆర్థిక ఆందోళన ఎక్కువ కావడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 13 శాతం ఉంటుందని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ అంటోంది. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం చెందడం వంటివీ ఆర్థిక కుంగుబాటుకు కారణాలుగా ఉన్నాయి. అందుకే పక్కా ప్రణాళికతో, నియంత్రణ చర్యలతో ఈ ఒత్తిళ్ల నుంచి బయటపడే మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆర్థిక ఒత్తిళ్లకు కారణమవుతున్న ప్రధాన కారణాలు, వీటిని అధిగమించడం ఎలాగన్నది నిపుణుల అభిప్రాయాల ఆధారంగా తెలియజేసే కథనం ఇది...

షేర్లు కుప్పకూలితే...! 
దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పడు, ఫండమెంటల్స్‌ బలంగానే ఉంటే మార్కెట్‌ పతనం చూసి ఆందోళన చెందక్కర్లేదు. 2008 ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయినప్పటికీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో కరెక్షన్‌ మొదలైందన్న సంకేతం రాగానే వెంటనే అమ్మేయాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘‘ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలన్నది తెలుసుకోవాలి. కానీ, మార్కెట్‌ కదలికలను చూసి ప్రతిస్పందించకూడదు’’ అని 5నాన్స్‌ సహ వ్యవస్థాపకుడు దినేష్‌ రోహిరా పేర్కొన్నారు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసిన వారు స్వల్ప కాల ఆటుపోట్లపై ఆందోళన చెందక్కర్లేదని సూచించారు. ‘‘మార్కెట్, గ్రూపు, పథకం మూలాలు బలంగా ఉన్నాయా, లేవా అన్నది చూడాలి. మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పనితీరు చక్కగా ఉంటే పెట్టుబడిని ఎప్పటిలాగానే కొనసాగించాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నప్పుడే ఎంత కాలానికి అన్న స్పష్టత అవసరం. మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ ప్రతీ 6–7 ఏళ్లకోసారి వస్తుంటుంది. దీర్ఘకాల ఇన్వెస్టర్లు అయితే ఆందోళన చెందకుండా సిప్‌ను కొనసాగించాలి’’ అని ఫైనాన్షియలప్లానర్‌ పంకజ్‌ తెలిపారు. ఉదాహరణకు... హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌లో 2014 నుంచి 2016 వరకు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, పెట్టుబడి భారీగా వృద్ధి చెంది ఉండేది. అలా కాకుండా 2016 ఫిబ్రవరిలో కరెక్షన్‌ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని తిరిగి అదే ఏడాది మార్చిలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే పై ఉదాహరణ కంటే తక్కువే రాబడులు వచ్చేవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు అయినా... కంపెనీల ఫండమెంటల్స్‌ బలంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆర్థిక నిపుణుల సూచన. అయితే, దీర్ఘకాలం కోసం కాని వారు, అవసరమైతే నష్టాలను బుక్‌ చేసుకుని బయటకు వచ్చేయాలని దినేష్‌ రోహిరా సూచించారు. ఉదాహరణకు... ఐఎల్‌అండ్‌ఎఫ్‌ గ్రూపు ఆర్థిక సంక్షోభంతో కొన్ని డెట్‌ ఫండ్స్‌ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటి రికవరీపై ఆశలు కూడా సన్నగిల్లాయి. ఆ సమయంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం సరైనదే. ఆశ, భయాలకు దూరంగా ఉండి, క్రమం తప్పకుండా పెట్టుబడులను పరిశీలిస్తూ ఉండాలని రోహిరా సూచించారు. 

 పరిమితికి మించి రుణాలు 
అప్పటికే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలని చెప్పి మరో రుణాన్ని తీసుకోవడం సరైనది కాదు. రుణమన్నది నిర్వహణను బట్టి స్నేహితునిగాను, శత్రువుగానూ మారగలదని దినేష్‌ రోహిరా హెచ్చరించారు. ఓ ఆస్తి సమకూర్చుకోవడానికి రుణం చేస్తే (ఇల్లు), క్రెడిట్‌ స్కోరును పెంచుకునేందుకు బాధ్యతాయుతంగా క్రెడిట్‌ కార్డును వినియోగిస్తే, రుణం తీసుకోవడమే మంచిది. అవసరం ఉంది కదా అని పెద్ద ఎత్తున రుణం తీసుకుంటే లేదా అధిక వడ్డీ రేటు కోసం వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటే బడ్జెట్, నగదు ప్రవాహాలపై ఒత్తిడి నెలకొంటుంది. కొంత మంది ఒక రుణాన్ని తీర్చివేసేందుకు మరో పెద్ద రుణం తీసుకుంటుంటారు. ఇవన్నీ ఆర్థికంగా తలకిందులు చేసే నిర్ణయాలు. ఒకటికి మించి రుణాలు ఉంటే, అధిక వడ్డీతో ఉన్న రుణాన్ని ముందుగా తీర్చివేయడంపై దృష్టి పెట్టాలి. రుణంపై 13 శాతం వడ్డీ రేటు చెల్లిస్తూ... అదే సమయంలో 6–7 శాతం వడ్డీనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఉంటే... ఉపసంహరించుకుని రుణాన్ని చెల్లించివేయడం వివేకం. అన్ని రుణాల చెల్లింపులు నెల వేతనంలో సగాన్ని మించకుండా చూసుకోవాలి. ఆదాయ–రుణ–వ్యయ నిష్పత్తులను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. 

 రిటైర్మెంట్‌కు ముందునుంచే
రిటైర్మెంట్‌ జీవితం గురించి మరీ ఆలస్యంగా  పొదుపు మొదలు పెడితే అవసరాలు తీరవు. ఆర్థిక సమస్యలతో మలి వయసులోనూ ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది. 25 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.20,000 వేలను ఇన్వెస్ట్‌ చేస్తే 60 ఏళ్ల నాటికి రూ.10.9 కోట్లు (12 శాతం రాబడి) సమకూరుతుంది. కానీ, 35 ఏళ్ల వయసు నుంచి ప్రతీ నెలా రూ.20,000 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే 60 ఏళ్ల నాటికి కేవలం రూ.3.4 కోట్లే సమకూరుతుంది. ఇంకాస్త ఆలస్యంగా 45వ ఏట నుంచి మొదలు పెడితే రూ.94.3 లక్షలు, 55 ఏళ్ల నుంచి అయితే రూ.16.1 లక్షల దగ్గర నిధి ఆగిపోతుంది.

 భాగస్వామితో సమన్వయం 
జీవిత భాగస్వామికి ఆర్థిక లక్ష్యాల్లోనూ చోటు కల్పించడం ఎంతైనా అవసరం. కుటుంబ బడ్జెట్‌ గురించి ఇద్దరూ మాట్లాడుకోవడం, ఉమ్మడి లక్ష్యాల కోసం చేయాల్సిన పొదుపు విషయాలపై ఏకాభిప్రాయానికి రావాలి. దంపతుల మధ్య ఆర్థిక విషయాల్లో సఖ్యత లేకపోయినా, ఆ కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకునేందుకు దారితీయవచ్చు. ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్, భవిష్యత్తు లక్ష్యాల విషయంలో ఇద్దరూ ఓ నిర్ణయానికి రావడం తప్పనిసరి. ఇద్దరూ ఆర్జనాపరులే కావాల్సిన అవసరం లేదు. దంపతుల్లో ఒక్కరే ఆదాయ పరులైనా కానీ, ఆర్థిక విషయాల్లో ఇద్దరూ ఏకాభిప్రాయంతో, సమన్వయంతో నడుచుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. దంపతులిద్దరూ సంపాదిస్తుంటే... ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచి, తమ వేతనం నుంచి ఇద్దరూ సమాన మొత్తంలో జాయింటు ఖాతాలోకి కుటుంబ ఖర్చుల కోసం మళ్లించుకోవాలని ఆర్థిక నిపుణులు సుందరం సూచించారు. వ్యక్తిగత ఖర్చులను వారు తమ వ్యక్తిగత ఖాతాల్లో ఉన్న మిగులు నిల్వల నుంచి చేసుకోవచ్చన్నారు. ఇక జీవిత భాగస్వాముల్లో ఒకరే ఆర్జనా పరులైతే, ఒకరు ఇన్వెస్ట్‌మెంట్, మరొకరు ఇంటి ఖర్చులను నిర్వహించడం చేయాలి. 

 ముందుగానే పక్కా ప్రణాళిక  
భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాలకు ముందు నుంచే సరైన ప్రణాళిక వేసుకోవాలి. మూడేళ్ల చిన్నారి ఉన్నత విద్య కోసం నిధిని సమకూర్చుకోవాలంటే... ఈ రోజు రూ.10 లక్షలయ్యే కోర్సు, 15 ఏళ్ల తర్వాత 7 శాతం ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా రూ.27.59 లక్షలు అవుతుంది. 

ఆర్థిక సన్నద్ధత 
తీవ్ర అనారోగ్యం, ప్రమాదానికి గురవడం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడం వంటి సందర్భాల్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలకు కారణమయ్యే వాటిల్లో ఇవే అతిపెద్దవి. అత్యవసర నిధి ఈ సమయాల్లో అక్కరకు వస్తుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుందన్న హామీ కష్టమే. ఇక ఆరోగ్యానికి రిస్క్‌తో కూడిన ఉద్యోగాలలో ఉన్న వారు ముందుగానే రిటైర్మెంట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారు ముందు నుంచే విచక్షణారహిత ఖర్చులకు కళ్లెం వేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అనవసర ఖర్చులు వద్దు.. 
బడ్జెట్‌ను అనుసరించి ఖర్చు చేసే వారికి ఈ పరిస్థితి ఎదురుకాదు. ఆర్థిక ఒత్తిళ్లు అన్నవి చాలా సాధారణం. వీటికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. మీ వేతనం తక్కువగా ఉంటే, అధిక వేతనం లభించే కొత్త ఉద్యోగ అవకాశం చూసుకోవడం, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం మినహా ప్రత్యామ్నాయాలు లేవు. ‘‘చాలా మంది విషయంలో నెల చివర్లో నిధుల్లేని పరిస్థితికి కారణం సరైన బడ్జెట్‌ లేకపోవడమే, నగదు నిర్వహణ నిర్మాణాత్మకంగా లేకపోవడమే’’ అని దినేష్‌ రోహిరా తెలిపారు. ఇక మనలో చాలా మందికి అసలు ఓ బడ్జెట్‌ అంటూ ఉండదు. దీంతో వస్తున్న ఆదాయంతో ఖర్చులను సమన్వయం చేసే అవకాశం ఉండదు. నెల వేతనం రాగానే అనవసరమైన ప్రతిదానికీ ఖర్చు చేయడం వల్ల... ఉన్నదంతా నెల మొత్తానికి సర్దుబాటు కాదు. మరో కారణం దుబారాగా ఖర్చు పెట్టే అలవాటు. తప్పనిసరి ఖర్చులు, ఇష్టానికి చేసే ఖర్చుల మధ్య భేదాన్ని చాలా మంది గుర్తించరు. వేతనం రాగానే పెట్టుబడులు, బిల్లు చెల్లింపులు, రుణ ఈఎంఐల చెల్లింపులు ముందుగా చేయడానికి బదులు... రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన విందు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో అవసరాల కోసం క్రెడిట్‌ కార్డు లేదంటే మరో రుణమో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రుణ సమస్యల్లో చిక్కుకుంటారు. పరిమితికి మించిన రుణ భారం కూడా మనిషిని ఆర్థికంగా కుంగదీస్తుంది. కారు రుణం, ఇంటి రుణం, వ్యక్తిగత రుణం అన్ని ఈఎంఐలు నెల ఆదాయంలో 50 శాతానికి మించాయంటే సంక్షోభంలోకి వెళుతున్నట్టే. దీన్నుంచి బయటపడేందుకు ముందుగా బడ్జెట్‌ రూపొందించుకోవాలి.

తప్పనిసరి ఖర్చులను విచక్షణ లేకుండా చేసే ఖర్చుల నుంచి వేరు చేయాలి. తప్పనిసరి అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత... మీ ఆదాయంలో మిగులు ఉంటే అప్పుడు విచక్షణా రహిత ఖర్చులకు వెళ్లడంలో తప్పులేదు. ఇక ఆర్జన మొదలైన నాటి నుంచే మొత్తం ఆదాయంలో 20–30 శాతాన్ని ఇన్వెస్ట్‌ చేస్తుండాలని, ఇది చేస్తుంటే ఖర్చులన్నవి పెద్ద సమస్యే కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోయినా బడ్జెట్‌ తలకిందులు అవుతుంది. అత్యవసరాలు చేతిలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కనీసం మూడు నెలల అవసరాలకు సరిపడా అయినా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కారు ఖర్చులను భరించే సామర్థ్యం లేకపోతే, రుణంపై కారు తీసుకోవద్దు. నెలంతా చేతిలో డబ్బుల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు క్రెడిట్‌కార్డు వినియోగానికి దూరంగా ఉండాలి. డబ్బులంతా ఖర్చవడానికి అనవసర ఖర్చులే కారణం అయితే... అటువంటి వారు మరింత ఆదాయం కోసం కష్టపడినా నిష్ప్రయోజనమే. ఎందుకంటే పిండికొద్దీ రొట్టె అన్నట్టు ఎంత వచ్చినా విచక్షణారహితంగా ఖర్చు చేసే అలవాటు పెద్ద ముప్పు. నెలసరి ఆదాయం అంతా నెల మధ్యలోనే ఖాళీ అయిపోతే, అవసరాల కోసం అత్యవసర నిధి జోలికి వెళ్లొద్దు. అధిక ఆదాయం కోసం లాటరీలు, జూదం, చాలా స్వల్ప కాలంలోనే భారీ రాబడులు ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రుణ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు, బిల్లులు అన్నీ చేతికి ఆదాయం అందించిన వెంటనే చెల్లింపులు చేసేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement