రుణం వ్రణమై.. | Hope for loan payment | Sakshi
Sakshi News home page

రుణం వ్రణమై..

Published Thu, Jun 29 2017 3:42 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM

Hope for loan payment

రుణమాఫీ సొమ్ము కోసం  అన్నదాతల నిరీక్షణ
బడ్జెట్‌లో ఘనంగా కేటాయింపులు
రైతుల ఖాతాల్లో జమకాని నగదు
రుణమాఫీ బాండ్లు ఉన్నా ఫలితం సున్నా
కొత్త రుణాలందక రైతుల అవస్థ


పొదలకూరు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కండే వెంకటేశ్వర్లు. తనకున్న 4.76 ఎకరాల భూమిని పొదలకూరులోని స్టేట్‌బ్యాంక్‌లో తనఖా పెట్టి 2012–13 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు రుణం తీసుకున్నారు. పొదలకూరులోని మరో బ్యాంకులో రూ.50 వేల రుణం పొందారు. పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అందరిలానే వెంకటేశ్వర్లు కూడా నమ్మారు. ఆ రెండు బ్యాంకులకు అప్పు చెల్లిం చడం మానేశారు. అదే అతని పాలిట శాపమైంది. ఇతనికి రుణమాఫీ సొమ్ము పైసా కూడా అందలేదు. తీసుకున్న రూ.2.50 లక్షలపై వడ్డీ తడిసి మోపెడైంది. ఇప్పటికే రూ.లక్షకు పైగా వడ్డీ చెల్లించగా.. అసలు అప్పు అలాగే ఉంది.

ఆయనకు కొత్త రుణం ఇస్తున్నట్టుగా బ్యాంకర్లు రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నా.. చేతికి మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదు. కొత్త అప్పును పాత రుణానికి జమ చేసుకుంటూ.. వడ్డీ సొమ్మును మాత్రం అతనితో కట్టించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రైవేట్‌ అప్పు పుట్టక ఖరీఫ్‌ సాగు ఎలా చేయాలో తెలియక వెంకటేశ్వర్లు సతమతం అవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి రైతులెందరో రుణమాఫీ ఫలాలు అందక.. కొత్త రుణాలు మంజూరుకాక సతమతమవుతున్నారు.

సైదాపురం : రైతులు తీసుకున్న రుణం వ్రణమై (పుండులా) పీడిస్తోంది. సర్కారు తీరు కారణంగా రుణమాఫీ కాక.. కొత్త రుణాలు అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ చేశామని.. మూడో విడత సొమ్ము కూడా ఇచ్చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా ఇప్పటికీ తమ ఖాతాల్లో ఆ సొమ్ము జమ కాకపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. రుణమాఫీ కోసం విజయవాడలో రైతు సాధికారిత సంస్థను ఏర్పాటు చేశామని.. ఆ సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు మాఫీ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయిస్తామని సర్కారు ప్రకటించింది. రుణాలన్నిటినీ బేషరతుగా ఒకేసారి మాఫీ చేస్తామని మొదట్లో చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత ఐదు విడతలుగా ఇస్తామని మాట మార్చింది. రైతులకు నమ్మకం కలిగించేందుకంటూ రుణమాఫీ బాండ్లను జారీ చేసింది. గడచిన రెండు విడతల్లో అరకొరగా మాఫీ సొమ్ము విదిల్చినా.. మూడో విడత సొమ్మును మాత్రం ఇప్పటికీ విడుదల చేయలేదు.

పెట్టుబడులెలా!
రుణమాఫీ విషయాన్ని పక్కనపెడితే.. పాత రుణా లపై వడ్డీలు పెరిగిపోయి రైతులు సతమతమవుతున్నారు. మరోవైపు కొత్త రుణాలు అందక ఖరీఫ్‌ పంట ను ఎలా సాగు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులుండగా.. రూ.3,500 కోట్లను రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే రూ.2,900 కోట్లను పంపిణీ చేశామని చెబుతుండగా.. ఆ మొత్తం భూ యజమానులకు మాత్రమే అందింది. కౌలు రైతులకు పైసా కూడా ఇవ్వలేదు. జిల్లాలో ఈ ఏడాది 49 వేల మంది కౌలు రైతులను గుర్తించి రుణా లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో గత ఏడాది రుణార్హత కార్డులు పొందిన 25 వేల మందితోపాటు కొత్తగా మరో 24 వేల మందిని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, గత  ఏడాది గుర్తింపు పొందిన 25 వేల మందిలో కేవలం 54 మందికి కార్డులను మాత్రమే రెన్యువల్‌ చేశారు. కొత్తగా మరో 24 వేల మందికి రుణార్హత పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. 893 మందికి మాత్రమే ఇచ్చారు. మొత్తంగా చూస్తే 48,107 మందికి రుణార్హత పత్రాలు అందించాల్సి ఉంది. పత్రాలు ఎప్పటికిస్తారో.. రుణాలు మంజూరు చేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
ఈ ఏడాది పంట రుణాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 81 శాతం మంది రైతులకు రుణాలను అందించాం. మిగిలిన వారికి కూడా రుణాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు ఆగస్టు 21వ తేదీలోగా బ్యాంకుల రుణాలను రెన్యువల్‌ చేసుకుంటేనే బీమా వర్తిస్తుంది.                              
– వెంకట్రావ్, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement