పచారీ షాపుకు వెళ్లి.. రూపాయి మందు అడిగితే ఏమిస్తాడు? ఈ ఊళ్లో అయితే ఎలుకమందు ఇస్తాడు. కడుపులో ఉన్నా.. కడుపులోంచి పడినా.. ఆడపిల్లలను ఈ మందుతోనే పొట్టన పెట్టుకుంటారు. మనింట్లో పుట్టిన ఆడపిల్ల ‘క్యార్’మంటే..
ఇల్లంతా పరుగెత్తుకుని వస్తుంది. ఆ ఇంట్లో.. ఆ రాత్రి... ఆ బిడ్డ.. ‘క్యార్’మంటే.. తల్లే చెవులు మూసుకుంది! ఆడపిల్లను కనిన తల్లి చెవుల్లో సీసం పోసుకోవాల్సిందే. బిడ్డకు రూపాయి సీసా మందు పోయాల్సిందే. మరి అది ఆడపిల్లా? ఎలుకపిల్లా??
‘‘అవును.. అది రూపాయి మందే! నా బిడ్డ సచ్చిపోనీకె రూపాయి మందు పాలల్ల గలిపిన’’ తన బిడ్డను తానే చంపుకున్నానని ఆ తల్లితో ఒప్పించడానికి పోలీసులు పెద్దగా కష్టపడాల్సిన పనిరాలేదు. నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం వద్దిపట్లకు చెందిన సబిత (పేరు మార్చాం) తన మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్లకు రూపాయి మందు పాలల్లో కలిపి బాటిల్‌తో పట్టింది. ఎలుకల మందుకి ఈ ప్రాంతంలో రూపాయి మందు అని పేరు.
తండాలో ఆడపిల్లల ప్రాణాలను తీసేందుకు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రూపాయి మందునే ఆశ్రయిస్తుంటారంతా. ‘‘ఈ ఆడపిల్లతోని ఇంట్లకు బోతె నా మొగుడు నన్నేలుకోనన్నడు గద! గందుకే చంపిన.’’ఎందుకు చంపావన్న పోలీసుల ప్రశ్నకు సబిత జవాబిది. మళ్ళీ ఆమే పోలీసులను ఎదురు ప్రశ్నించింది‘‘నా మొగుడు మారుబెళ్ళి చేసుకుంటనన్నడు మగపోరడి కోసం. ఏం జెయ్యమంటరు?’’ నీ భర్తకు తెలుసా పోలీసుల అర్థం లేని ప్రశ్నకు అతను జాతరకెళ్ళాడని సమాధానమిచ్చింది సబిత. జాతరకెళ్ళాడని చెప్పింది కానీ ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చి తెరలు తెరలుగా దుఃఖం పొంగుకొస్తోంది సబితకి.
ఏడ్చి ఏడ్చి పసిపాపాయి పాలబుగ్గలమీద పడిన కన్నీటి చారికల ముద్రలను చేతితో నిమిరి చివరిసారిగా చెక్కిళ్ళను ముద్దాడింది సబిత. వెనుతిరిగి దేవుడి దగ్గర పెట్టిన రూపాయిబిళ్ళను చేతిలోకి తీసుకుంది. నాలాంటి పాపాత్మురాలిని ఎందుకు పుట్టించావు తండ్రీ అని దేవుడి పటం ముందు బోరుమంది. చిరిగిన పైటచెంగుతో కన్నీళ్ళు తుడిచేసి గబ గబా బయటకు పరిగెత్తింది. ఇంకొక్క నిముషం ఆలస్యమైనా తన భర్త వచ్చేస్తాడు. రాత్రి కొట్టిన దెబ్బలకు పదిరోజుల బాలింత ఒళ్ళంతా పుండులా మారింది.
నాలుగు నెలల క్రితమే ఆడపిల్ల అని తెలిశాక స్కానింగ్ సెంటర్‌లోనే భర్త డాక్టర్‌తో గొడవపడిన విషయం గుర్తొచ్చింది సబితకి. అబార్షన్ చేయించుకోవాల్సిందేనని ఇంటికొచ్చాక చితకబాదాడు బాలాజీ. అయినా ఆమెకెందుకో ఆ పనిచేయబుద్ధి కాలేదు. బిడ్డ కడుపులో ఉండగా ఏ నెలలో ఏ అవయవాలు ఏర్పడతాయో సబిత తల్లి పాడిన పాట గుర్తొచ్చి ఆరోజు అబార్షన్‌కి ససేమిరా అంది. ఐదోనెలలో అబార్షన్ అంటే బిడ్డకీ, తల్లికీ కూడా ప్రమాదమని చెప్పారు డాక్టర్. ఆ డాక్టర్ కాకపోతే ఎంతో మంది డాక్టర్లున్నారన్నాడు అబార్షన్ చేయడానికి. గర్భంపోయేందుకు నాటు మందుకూడా తెచ్చి మింగిచ్చాడు. చావుతప్పి కన్నులొట్టబోయి బతికింది సబిత.
ఆ రోజు నుంచి రోజూ భర్త తాగొచ్చి కొడుతున్న దెబ్బలకు కూడా తట్టుకుంది కానీ ఈ రోజు రూపాయి మందు పాలల్లో కలిపి రక్తపుగుడ్డుని చంపేయమన్నప్పుడు మాత్రం తట్టుకోలేకపోయింది. ముందు పుట్టిన ఇద్దరు బిడ్డలనూ తనకు తెలియకుండానే దూరం చేశాడు భర్త. ఈ బిడ్డనైనా దక్కనిస్తాడనుకుంటే తన చేతితోనే తన బిడ్డను చంపేయాలని హుకుం జారీచేశాడు. లేదంటే ఇంట్లోనుంచి తరిమేస్తానన్నాడు. తన పెళ్ళికి చేసిన అప్పుని తీర్చలేక దొర దగ్గర అమ్మానాన్నా జీతానికున్నారు. జీవితమంతా చాకిరి చేసినా వారు ఆ ఇంట్లోనుంచి బయటకు రాలేరు. చెల్లెళ్ళిద్దరికీ తన లాగే పన్నెండేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేశారు. వాళ్ళ కాపురాలు కూడా దినదిన గండంగా ఉన్నాయి.
ఈ పేరుతో తనని వదలించుకొని రెండో పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు భర్త. ఈ యింట్లోంచి బయటకెళితే భర్త లేని ఆడపిల్ల బతుకెంత హీనమో సబితకు తెలుసు. ఆ మరుసటి రోజు నుంచి మగాళ్లందరికీ ఆమె చులకనే. అప్పుడు తానేతప్పూ చేయకపోయినా అన్ని నిందలూ భరించాల్సిందే. బిడ్డను ఎలాగోలా బతికించుకుందామన్నా ఊరు ఊరుకోదు. ఒంటరి స్త్రీకి ఎంత విలువో, ఆమె బిడ్డనీ అంతే హీనంగా చూస్తుందీ సమాజం. తనకాళ్ళపై తాను బతికేందుకు చదువూ సంధ్యాలేదు.
ఈ పిల్ల పెద్దదై అన్ని కష్టాలూ పడి మళ్ళీ తనలా ఏదోరోజు ఎవరో ఒకరికి పెళ్ళాం అయ్యి వాడిచేతిలో చావుదెబ్బలు తినేబదులు ఈ రూపాయిమందిచ్చి గుండెను చిక్కబట్టుకుంటే చాలనుకుని తండా చివరి చిల్లరకొట్టుకెళ్ళి రూపాయి మందిమ్మంది సబిత. బడ్డీకొట్టతను ఒకసారి జాలిగా చూసి గాల్లో వేళ్ళాడుతున్న రూపాయి మందు ప్యాకెట్టుని ఆమె చేతిలో పెట్టాడు. బిడ్డపాలల్లో కొద్దిగా కలిపి మిగిలింది నీళ్ళల్లో కలుపుకుని తను తాగేసింది. ఆమె అంచనాలు తారుమారయ్యి తను బతికింది కానీ, పొత్తిళ్ళలోని పసిగుడ్డుకెంత కావాలి విషపుచుక్క చాలదూ ఈ వికృత సమాజంలోంచి శాశ్వతంగా దూరంగా సాగిపోవడానికి.
ఆడపిల్లను కన్న తర్వాత ఆమెను ఇంటికి రానివ్వడొక తండ్రి. గుక్కపెట్టి ఏడ్చినా, పాలబుగ్గల పసికందుకు పాలివ్వనివ్వడు మరో తండ్రి. ఏడ్చి ఏడ్చి గొంతెండి చచ్చిపోయిందా సరేసరి, లేదంటే ఏ వెయ్యిరూపాయలకో అమ్మేసుకుంటాడు మరో తండ్రి. కొద్దోగొప్పో కన్నబిడ్డ మీద మమకారం ఉన్నవాళ్ళకు ఉండనే ఉన్నది ఊయల. వద్దనుకున్న బిడ్డను చంపకండంటూ తమిళనాడు తరహాలో ఊయలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం దేవరకొండలో. అయితే సబిత భర్త బాలాజీ ఇవేవీ కాకుండా రూపాయిమందుని కలపమన్నాడు బిడ్డకి పట్టే పాలల్లో. సరిగ్గా ఆ తల్లి అదే చేసింది.
బిడ్డని చంపేసి గప్‌చుప్‌గా పూడ్చిపెట్టేసారు మెట్టినింటివారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల పోరాటంతో ఇప్పుడు తెలంగాణలో అతి తక్కువ బాలికల నిష్పత్తి ఉన్న ప్రాంతాల్లో ప్రతి బిడ్డ మరణాన్నీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో సబిత బిడ్డ ఎలా చనిపోయిందన్న ప్రశ్న వచ్చింది. పదిహేను రోజుల తర్వాత చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ బృందం వెళ్ళి బిడ్డ భౌతిక కాయాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం చేస్తే రూపాయి మందు దారుణం బయటకు వచ్చింది.
ఈ ప్రశ్నలన్నింటికీ మనచుట్టూ జరుగుతున్న పరిణామాలే సమాధానం చెబుతాయి. యిప్పుడొస్తోన్న సినిమాలను గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏం భాష వాడుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఒసేయ్, ఒరేయ్ అనా, పోస్టర్స్ ఎంత అశ్లీలంగా ఉంటున్నాయి? అన్నింటిలో కాంప్రమైజ్ కావడమేనా మనం చేస్తున్నది? అలా కాంప్రమైజ్ కాలేక, మనకి నచ్చినా న చ్చకపోయినా చూసీ చూడనట్టు, తెలియనట్టు నటించడం నాకు చేతకాక నేను సెన్సార్ బోర్డునుంచి పదేళ్ళక్రితమే రిజైన్ చేసి బయటకు వచ్చాను.
దైనందిన జీవితంలో స్త్రీలను గౌరవించకపోగా, హింసను ప్రేరేపించే సినిమాలను వ్యతిరేకించే చైతన్యం కావాలి. ఎంతో పెద్ద చదువుచదివిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అత్తమామలనుంచి, భర్తల నుంచి అనేకరకాల హింసను ఎదుర్కొంటోంది. నాకు తెలిసిన కేసులే బోల్డున్నాయి. నిర్భయ అత్యాచారాలను ఆపగలిగిందా? అలాగే పీసీపీఎన్‌డీటీ యాక్ట్ కూడా. చట్టం మంచిదే కానీ ఎవరు కంప్లైంట్ చేస్తారు.
ఈరోజు ఏ ఆడపిల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోగలుగుతోంది? అందుకే ముందు సమాజంలో ఆడపిల్లల పట్ల పాతుకుపోయిన అభిప్రాయాలు మారాలి. ఆడపిల్లలను హాయిగా ఈ లోకంలోనికి ఆహ్వానించే పరిస్థితులు సమాజంలో ఉండాలి. అప్పుడే ఆడపిల్లలను కడుపులోనే చంపుకోరు. వైద్యపరంగా డాక్టర్లపైనే తప్పులు నెట్టకుండా అబార్షన్ చేయించుకోవడానికి వచ్చేవారి ఆలోచనల్లో సైతం మార్పులు తేవాలి.
ప్రిమిటివ్ క్యాపిటల్
ఇక్కడ ఆడపిల్లలు ప్రిమెటివ్ క్యాపిటల్. దేవరకొండ మండలం, మెగావత్ తండాలో ఇంట్లో తొలిచూలు ఆడబిడ్డను అమ్మి మూడు మేకలను కొనుక్కున్నాడొక తండ్రి. అదేమండలం కట్టకొమ్మ తండాలో ఆడపిల్లను అమ్మేసి ఆటో కొనుక్కున్నాడో తండ్రి. మన దేశంలో వెయ్యి రూపాయలకీ, వంద రూపాయలకీ కూడా ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు.
వీటికి సాక్ష్యాధారాలూ ఏవీ ఉండవు. కానీ ఒకే ఊర్లో పదుల సంఖ్యలో అమ్మాయిలు మరణిస్తుంటారు. అయితే డబ్బొక్కటే ప్రధానం కాదు. సబిత కేసే అందుకు సాక్ష్యం. వాళ్ళు పేదవాళ్ళు కాదు. వాళ్ళకి నాలుగెకరాల పొలం వుంది. ట్రాక్టర్ వుంది. అయినా ఆడబిడ్డని చంపారంటే అందుకు సన్‌ప్రిఫరెన్స్ కారణం.వారసుడు, కొడుకు పున్నామ నరకాన్నుండి తప్పిస్తాడనీ, కొరివిపెట్టేవాడుండడనీ ఏవో సాకులు చెపుతారు. కానీ దానివెనుక దాగున్నది మాత్రం ఆడపిల్లల పట్ల వివక్షే. ఆడపిల్లల భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా తెచ్చిన పీసీపీఎన్‌డీటీ యాక్ట్ వుంది. అది అమలు పర్చేందుకు అంచెలంచెల అధికార వ్యవస్థ వుంది. అయితే చిత్తశుద్ధి మాత్రం లేదు.
– రుక్మిణీరావు, గ్రామ్య స్వచ్ఛంద సంస్థ
Comments
Please login to add a commentAdd a comment