యూరాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 18 ఏళ్లు. దాదాపు రెండేళ్ల క్రితం వృషణాల దగ్గర నొప్పి వస్తే ఎంబీబీఎస్ డాక్టర్‌కు చూపించాం. అది ‘హైడ్రోసిల్’ అని ఆయన నిర్ధారణ చేసేవరకూ మాకు మా అబ్బాయి ఏమీ చెప్పలేదు. ఇప్పటికీ ఎంత అడిగినా ఏం జరిగిందో చెప్పలేదు. సర్జన్ దగ్గరికి వెళ్లి అవసరమైన చికిత్స చేయిద్దామంటే భయంతో వెనకడుగు వేస్తున్నాడు. మాకు ఏమి చేయాలో బోధపడటం లేదు. సముచితమైన సలహా ఇవ్వండి. అన్నట్టు ఒక్క విషయం.... నేను చాలామంది ప్రముఖులను గమనించినప్పుడు వారిక భారీపరిమాణంలో ‘హైడ్రోసిల్’ ఉన్నప్పటికీ వారు చికిత్స చేయించుకోకుండా అలాగే వదిలేసినట్లు అనిపించింది. ఎందుకు? ఇతర సమస్యలేవైనా ఉత్పన్నమవుతాయని భయమా?
- జీ.బీ. అప్పారావు, విజయవాడ
హైడ్రోసిల్ (బుడ్డ) సమస్య ఉన్నప్పుడు వృషణాల చుట్టూ నీరు చేరడం వల్ల ఆ ప్రాంతం అంతా వాపు వస్తుంది. దీనివల్ల కొద్దిపాటి ఉబ్బంది ఉంటుంది కానీ సాధారణంగా నొప్పి ఉండదు. సాధారణంగా దీనితో ప్రమాదం కూడా ఉండదు. చాలా సందర్భాల్లో హైడ్రోసిల్ సమస్యకు కారణాలు తెలియవు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఎందుకంటే వాళ్లలో కడుపునకూ, వృషణాలకూ మధ్య కొద్దిపాటి సందు ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ సందుమూసుకుపోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
లక్షణాలు: నీరు చేరి వృషణాల వాపు రావడం మినహా దీనిలో సాధారణంగా ఇతర లక్షణాలేవీ కనిపించవు. కానీ అరుదుగా కొన్నిసార్లు నొప్పి, వృషణాల సంచి ఎర్రబారడం వంటివి కనిపించవచ్చు. వృషణాల సంచికి వాపు వస్తున్నకొద్దీ పురుషాంగానికి కిందినుంచి పైవైపునకు ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపించవచ్చు.
నిర్ధారణ: పేషెంట్‌ను భౌతికంగా పరీక్షించి, వృషణాల సంచిని చూడగానే హైడ్రోసిల్‌ను నిర్ధారణ చేయవచ్చు. అంతేగాక ఈ పరీక్షలో భాగంగా వృషణపు సంచిలోని ప్రతి బీజం వెనక నుంచి లైట్ వేసి దాని వెలుగు ఏమేరకు ఇవతలివైపునకు ప్రసరిస్తుంటుందో చూస్తారు. ఈ ప్రక్రియను ట్రాన్స్‌ల్యూమినేషన్ అంటారు. దీనివల్ల లోపల ఏవైనా మామూలు గడ్డలుగానీ, క్యాన్సర్ వంటి గడ్డలుగానీ ఉన్నాయేమో చూస్తారు.
చికిత్స: వృషణాల సంచి పెరుగుతున్నందున కలిగే ఇబ్బంది తప్ప సాధారణంగా ఇందులో నొప్పి ఉండదు. కాబట్టి నొప్పి వచ్చేవరకూ గానీ లేదా అది బట్టల్లోంచి బయటకు అసహ్యంగా కనిపిస్తున్నప్పుడుగానీ లేదా చాలా అరుదుగా సంభవించే పరిణామం అయిన పురుషాంగానికి రక్తసరఫరా తగ్గడం గాని జరిగినప్పుడే చికిత్స చేయించుకుంటారు. హైడ్రోసిల్ వచ్చినా దాని సైజు చిన్నదిగానే ఉంటే, వృషణాల సంచిలోకి ఊరిన ద్రవాన్ని శరీరం మళ్లీ పీల్చుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ఇక 65 ఏళ్ల లోపు వారిలో చాలామందికి ఒక్కోసారి ఈ సమస్య దానంతట అదే తగ్గవచ్చు కూడా. అయితే ఆపై వయసు వారికి మాత్రం అలా తగ్గే అవకాశం లేదు కాబట్టి శస్త్రచికిత్స అవసరం. ఇక ఆ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం హైడ్రోసీలెక్టమీ అనే శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది.
డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు,
కన్సల్టెంట్ యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
మా అబ్బాయికి హైడ్రోసిల్... ఏం చేయాలి?
Published Thu, Jun 25 2015 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement
Advertisement