అనసూయత్వం
జ్యోతిర్మయం
అనసూయత్వం అంటే అసూయలేమితనం. ఇది ఆధ్యాత్మిక విషయాల జిజ్ఞాస ఉన్న వారికి అవసర మైన సద్గుణం. ఈర్ష్య, అసూయ అనే పదాలు రెండూ లోక వ్యవహారంలో దాదాపు ఒకటే అర్థంలో వాడు తుంటాం కాని ఆ రెంటికీ మధ్య కొంత భేదం ఉంది. ఈర్ష్య అంటే ఉడుకుబోతుతనం. మరొకడు పచ్చగా ఉంటే, ప్రగతి సాధిస్తే, బాగుపడితే చూసి ఓర్వలేని గుణం. ఈర్ష్యాళువు బాధ తనకేదో లేదని గాదు, ఎదుటి వాడికేదో ఉందని. ఇది అవగుణాలన్నిటిలోనూ నికృష్టమైనదని వేరే చెప్పక్కర్లేదు. ఈర్ష్యాళువు ఎప్పుడూ ఏడుస్తూ ఉండే ఆరు రకాల దుఃఖ భాగుల్లో మొట్ట మొదటి తరగతి. ‘అయ్యా, నాకు తిండి లేదు, డబ్బు లేదు, లేదా, మరొకటి లేదు’ అని ఏడ్చే వాడి బాధ, ఆ లేనిదేమిటో వీలయితే ఇచ్చి పోగొట్టవచ్చు. ‘నా ఏడుపు నా దగ్గర లేని వాటి గురించి కాదు. ఎదుటి వాడి దగ్గర ఏవేవో ఉన్నాయని’ అని దుఃఖించే వారి దుఃఖం ఆ భగవంతుడు కూడా తీర్చలేడు, తీర్చడు! దుర్యోధనుడి బాధ తను సుఖపడ టం లేదనీ, తనకున్నది చాలదనీ కాదు. పాండవులు సుఖపడుతున్నారనీ, నలుగురూ వాళ్ల ధర్మ వర్తననీ, పరాక్రమాన్నీ, సద్గుణాలనూ మెచ్చుకొంటున్నారనీ. పాండవులు ఎంత అగచాట్ల పాలయితే దుర్యోధనుడి కళ్లు అంత చల్లబడతాయి. ఆ లక్షణమే అతనికి సర్వ భ్రష్టత్వం కలిగించి వంశ నాశనానికి దారితీసింది.
అసూయ కూడా ఈర్ష్యకు అక్కో చెల్లెలో అయ్యే అవగుణమే. ఈర్ష్యకు మరో రూపం. ఎవరివైనా, గోరంత దోషాలు కనిపిస్తే వాటిని కొండంతలుగా చూసి సంతోషించే గుణం. అవీ దొరకకపోతే, వితండ వాదమన్నా చేసి ఎదుటి వాడి సద్గుణాలే దోషాలుగా చూపాలనే అతురతా, అత్యుత్సాహం, ఆపుకోలేని తపనా! ఇదొక నకారాత్మకమైన మానసిక వికారం. ఇతరుల గుణాలలో దోషాలు వెలికి తీయటం అని అసూయకు పారిభాషిక నిర్వచనం ఉంది.
సజ్జనులు ఎక్కడైనా, ఎవరిలోనయినా సద్గుణాల కోసం, మంచి కోసం చూస్తారు. చిటికెడంత మంచి ఎదుటి వాడిలో కనిపిస్తే, దాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవిస్తారు. భర్తృహరి భాషలో చెప్పాలంటే, పర గుణ పరమాణువులను పర్వతీకరించి, నలుసంత మం చిని కొండంతగా చూపటం సజ్జనుల లక్షణం. అసూ యాగ్రస్తులు ఇందుకు సరిగ్గా వ్యతిరేకం. నిరంతరం దోషాల కోసమే వెతుకుతారు. తెల్లబట్టలు వేసుకొన్న వాడు కనిపిస్తే, అతడి మీద ఎలాగయినా తక్షణం బురదజల్లి వేద్దాం అని తాపత్రయపడుతుంటారు. నా దుస్తుల కంటే ఎదుటి వాడి దుస్తులు తెల్లగా ఎందు కుండాలి అని కాబోలు.
అసూయ ఏ రూపంలోనైనా అసూయాగ్రస్తుడికే ఎక్కువ హాని చేస్తుంది. ఇది వేరుపురుగులా మనిషి ఇతర సద్గుణాలను కూడా తొలిచి డొల్ల చేస్తుంది అంటారు శ్రీ విద్య ప్రకాశానంద గిరిస్వామి వారు.
రామాయణం పాటగా గానం చేస్తూ, లవకు శులు, ‘ధర్మార్థ కామ సహితమైన ఈ దివ్య కథను అసూయ వీడి వినండి’ అని ప్రార్థిస్తారు. పరుల తప్పు లెన్ను వారు ఆ సమయాన్ని తమ తప్పులు గుర్తించి, వదిలేయటానికి కేటాయించుకొంటే ఉపయోగం.
ఎం. మారుతిశాస్త్రి