గీతోపదేశం
జ్యోతిర్మయం
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది. శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని సంస్క రించడానికి ఉద్దేశించినది. భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం. చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక. అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు పరమాత్ముడు బోధించినదే గీత.
ఇది భౌతిక జీవనమార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే గ్రంథమే. అందులో సందేహం లేదు. అయితే ఎంతటి ఆధ్యాత్మికతను ఉపదేశిస్తుం దో, అంతకు మించి దైనందిన జీవితాన్ని ఎట్లా సమర్థ వంతంగా సాగించుకోవాలో కూడా ప్రబోధిస్తున్నది. జీవితాన్ని ఒక నందనవనంగా చేసుకోవడం ఎలాగో చెప్పే మహోన్నత వాక్య సముదాయం భగవద్గీత.
సుఖ దుఃఖాలనూ, జయాపజయాలనూ, లాభ నష్టాలనూ, శీతోష్ణాలను సహించడానికి అవసరమైన మానసిక సంసిద్ధతను గీతోపదేశం ద్వారా పొంద వచ్చు. జ్ఞానంతో సమానమైన పవిత్ర సాధనం ప్రపం చంలో మరొకటి లేనే లేదనీ, ఇట్టి పరమ పవిత్ర జ్ఞానం శ్రద్ధావంతులకే అబ్బుతుంది- ‘న హి జ్ఞానేన సదృ శం పవిత్రమిహ విద్యతే’, ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’ అని భగవద్గీత చెబుతోంది.
ప్రశాంతమైన మనసు లేని వానికి సుఖాలు ఎలా లభిస్తాయి? అవిచ్ఛిన్నమైన ఆనందానుభూతి ఎలా సంభవిస్తుంది? అని ప్రశ్నించి, కామక్రోధాలు రెండూ రజోగుణం వల్ల ఉద్భవించినవేనని పేర్కొంటున్నది. అవే మన చేత ఘోర పాపాలను చేయిస్తాయనీ, జ్ఞాని అయినవాడు వాటినే ముఖ్య శత్రువులుగా భావించా లని చెబుతోంది.
‘కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్’
అని గీత ఉపదేశిస్తున్నది.
విద్యా ఉద్యోగ వ్యాపార సేవా రంగాల వారికి వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుష, ప్రాంత కుల భేదం లేకుండా ప్రతి తరానికీ చెందిన విశ్వమానవ శ్రేయస్సుకు ఉపకరించే ప్రధానోపదేశమే భగవద్గీత.
మహాత్మా గాంధీ తనకు ఎదురైన ప్రతి సమస్యకు భగవద్గీత నుంచే నివారణోపాయాన్ని పొందానని పేర్కొన్నారు. నేర్వదగిన శాస్త్రాలు లెక్కకు అందనన్ని ఉన్నాయి. అభ్యసించవలసిన విద్యలు ఎన్నో ఉన్నాయి. కాని మనిషి ఆయుర్దాయం పరిమితం. అందులో కలి గే విఘ్నాలు ఎన్నెన్నో! హంస పాలనూ నీళ్లనూ వేరు చేసి, నీరు వదలి పాలను స్వీకరించినట్టు సర్వోపనిష త్సారం, సర్వశాస్త్ర సంగ్రహం అయిన గీతోపదేశాన్ని ఉపదేశాత్మకంగా పరిశోధనాబుద్ధితో స్వీకరిద్దాం. ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.
సముద్రాల శఠగోపాచార్యులు