క్షమాగుణం
జ్యోతిర్మయం
క్షమా అనేది ఒక విశిష్ట గుణం. శారీరకంగా, మానసి కంగా ఇతరులు ఎంతగా బాధించినా తిరిగి ఇతరు లను కోపగించకుండా, వధించకుండా కన్నెర్ర జేయ కుండా ఉండే స్థితిని క్షమ అంటారు. ఓర్పు ఉన్న వారిని క్షమాగుణ సంపన్నులు అని వ్యవహరిస్తారు. విశిష్టమైనరీతిలో సకల ప్రాణివర్గాన్ని సహనంతో ఎల్ల ప్పుడూ ధరించునట్టి భూమాత క్షమాగుణ సంపన్ను లలో అగ్రగణ్యురాలు. భూదేవికి క్షమ అనే సార్థక నామధేయం కూడా ఉన్నది.
రావణాసురుని ఆజ్ఞకు బద్ధులై రాక్షస స్త్రీలు తనను అశోకవనంలో ఎంతగా హిం సించినా సీతాదేవి ఓర్పుతో భరించినది. అంతేకాకుండా రావణవధ తర్వాత హనుమం తుడు రాక్షస స్త్రీలను వధించు టకు సిద్ధపడినా ఆమె అందుకు అంగీకరించకుండా తన క్షమాగుణాన్ని చాటుకున్నది. క్షణకాలం కూడా శ్రీహరి యొక్క వియోగాన్ని భరించలేని శ్రీమహాలక్ష్మి ఆయన వక్షః స్థలంలో నిత్యనివాసాన్ని ఏర్పరచుకొని శ్రీమహావిష్ణువుకు ఉండే క్షమను మరింతగా వృద్ధిపర చాలని భావించినది. అనేక శుభగుణములకు నిల యుడైన శ్రీహరి తనను ఆశ్రయించిన వారిలోని దోషా లను చూడడు. వారు చేసిన అపరాధములను క్షమి స్తాడు. తన క్షమాగుణవైభవాన్ని చాటుతూ వారిని అక్కున చేర్చుకుంటాడు.
అనన్య భావనతో తనను ఆశ్రయించిన వారిలో దోషాలున్ననూ వారిని క్షమిస్తాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మయే స్వయంగా పేర్కొన్నాడు. ‘ఓ స్వామీ! నీవు రామావతార సమయంలో సహించలేని మహాపాపాన్ని చేసిన కాకాసురుణ్ణి కూడా క్షమించి రక్షించావు. అట్లాగే కృష్ణావతారంలో కూడా వరుసగా మూడు జన్మల నుండి నీ పట్ల ఘోర అపరాధాలను చేస్తున్న శిశుపాలునికి మోక్షాన్ని అనుగ్రహించావు. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్రకాశించే నీ క్షమా గుణానికి పాత్రం కాని దోషం అంటూ ఏదీ ఉండదు. మా సమస్త అపరాధాలను క్షమించగలవాడవు నీవే’ అని యామునాచార్యులు స్తోత్రరత్నంలో పరమాత్మను ప్రస్తుతించారు.
కొన్ని వేల బ్రహ్మ కల్పముల కాలంలో పూర్తిగా అనుభవించినా తీరనంతటి మహా పాతకాలను మాన వుడు ఒక అర క్షణంలోనే చేస్తున్నాడు. అలాంటి పాపా లను విడవకుండా ప్రతి జన్మలో ప్రతిక్షణం చేస్తూ జీవిం చేవాణ్ణి ఎవరు క్షమిస్తారయ్యా! మహా పాపాత్ముడు తన మనసు మార్చుకొని ఇక పాపాలు చేయను అని మనసు మార్చుకొని క్షమించమని వేడుకుంటే వెంటనే నీ మనసు కరిగి క్షమిస్తున్నావు. స్వామీ నీ హృదయం చాలా విశాలమైనది అని పరమాత్మ క్షమాగుణ వైభ వాన్ని కూరేశులు కీర్తించారు. వేదాచార్య భట్టర్ అనే వారు శ్రీరంగనాథుని క్షమాగుణాన్ని స్తుతిస్తూ 16 శ్లో కాలతో క్షమాషోడని అనే స్తోత్రాన్ని రచించారు. మనం కూడా క్షమాగుణాన్ని అలవర్చుకుంటే వివాదాలు ఘర్షణలు తగ్గుతాయి. ప్రశాంతంగా, సుఖసంతో షాలతో జీవించే అవకాశం కూడా కలుగుతుంది.
- సముద్రాల శఠగోపాచార్యులు