samudrala satagopacharyulu
-
ప్రియదర్శనం
కళ్లకు ప్రియమైన దృశ్యాన్ని చూడటం ద్వారా, మనసుకు నచ్చే ప్రదేశాన్ని దర్శించడంవల్ల కూడా మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అంతే కాకుండా కంటిని ఆకర్షించే రూపం గల వ్యక్తిని లేదా మనసుకు దగ్గరైన వ్యక్తిని దర్శించడంవల్ల కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. అయితే మనకు ప్రస్తుతం ప్రియంగా భాసిస్తున్న వ్యక్తులో, దృశ్యాలో కొంత కాలం తరువాత అప్రి యంగా మారవచ్చు. కాని తన రూపం చేత, గుణాల చేత అందరినీ ఆకర్షించే శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహ దర్శనం ప్రాంత-వయో-లింగ కాల భేదం లేకుండా అందరికీ ప్రియమైనట్టిదే. శ్రీరామచంద్రుని సుందరమైన వదనాన్ని దర్శిం చిన వారికి ఎవరికీ విసుగు రాకపోయేదట. ఆయన దర్శనం పొందిన వారికి ఇక చాలులే అనే సంతృప్తి కలుగదట. ఇంకా ఇంకా దర్శించాలనే ఆశ రేకెత్తు తూనే ఉండేదట. చంద్రుని కన్నా సుందరమైన ముఖ సౌందర్యం, సర్వాతి శయమైన అవయవ శోభ కలిగిన శ్రీరామచంద్రుని దర్శించే వారం దరికీ ఆయన నిత్య నూతనంగా భాసిస్తూ నేత్రానందాన్ని, పరమ ప్రీతిని కలిగించెడివాడట. శ్రీరామచంద్రుని రూపం, గుణాలు వ్యక్తుల దృష్టినే కాకుండా వారి మనసును కూడా బాగా ఆకర్షిస్తాయని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని అయోధ్యాకాండలో ‘చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనమ్/ రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్॥అనే శ్లోకం ద్వారా పేర్కొన్నాడు. సాధారణంగా లోకంలో స్త్రీ సౌందర్యం పురు షులను, పురుషుల సౌందర్యం స్త్రీలను మాత్రమే ఆక ర్షిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీరామచంద్రుని సౌందర్యం స్త్రీలనే కాక పురు షులను కూడా విశేషంగా ఆకర్షించేదని ‘పుంసాం మోహన రూపాయ’ వంటి ప్రమాణ వాక్యాలు విశద పరుస్తున్నాయి. దశరథ మహారాజు సుమంత్రుడు అను పేరుగల ముఖ్యమైన మంత్రిని శ్రీరామచంద్రుని వద్దకు పంపి తన సభకు రప్పించుకొన్నాడు. రథంపై ఊరేగుతూ వచ్చిన శ్రీరాముని అద్భుత సౌందర్యాన్ని దశరథుడు తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయాడు. శ్రీరాముని రూపమే కాక, ఆయన నడక సౌందర్యం కూడా అందరికీ ప్రియాన్ని కలిగించేదే. అందుకే శ్రీరాముని నడక సౌందర్యాన్ని పరమప్రియంగా దర్శించే దశరథ మహారాజు ముసలితనపు బాధలు దూరమయ్యేవట. ఆయన మనసు యవ్వన దశను పొందేదట. పరమప్రియ దర్శనాన్ని మనకు అనుగ్రహించే శ్రీరామచంద్రుని స్మరిద్దాం. ఆయన గుణాలను ఆదర్శంగా గ్రహిద్దాం. - సముద్రాల శఠగోపాచార్యులు -
సోదరప్రేమ
రామ, లక్ష్మణ, భరత ,శత్రుఘు్నల సోదరప్రేమ చిరస్మ రణీయమైనది, ఆదర్శప్రాయమైనట్టిది. వనవాసానికి బయలుదేరుతున్న శ్రీరామచంద్రునితో, నన్ను కూడా అడవికి తీసుకువెళ్లమని లక్ష్మణుడు ప్రాధేయపడ్డాడు. ‘నీవు దగ్గరలేనప్పుడు నాకు ఐశ్వర్యం లభించినా, స్వర్గాది లోకవాసం సిద్ధించినా నేను దానిని అంగీ కరించను. అరణ్యవాసానికి వెళ్లే నీకు నేను దారి చూపిస్తూ ముందు నడుస్తాను. కంద మూల ఫలాలను నీకు అడవిలో సమకూరుస్తాను. నీకు సీతాదేవికి పగలు, రాత్రి అవసరమయ్యే సేవలను నేను సమకూరు స్తాను’ అని లక్ష్మణుడు శ్రీరామునితో పేర్కొన్నాడు. తన ప్రయత్నం లేకుండానే తన చేతికి అందివ చ్చిన రాజ్యాన్ని అనుభవించాల్సిన భరతుడు తనకీ రాజ్య సుఖాలు, పరిపాలనాధికారం వద్దన్నాడు. నిండు సభలో అందరి ముందు ఏడ్చాడు. ఈ రాజ్యం అన్నకే చెందాలన్నాడు. రాజ్యం కన్న తనకు అన్నయే ముఖ్యమని పేర్కొన్నాడు. శ్రీరామ దర్శనం, ఆయన పాదస్పర్శ వల్లనే తన మనస్సుకు ప్రశాంతత కలుగు తుందని తెలిపాడు. శ్రీరామచంద్రునికి కూడా తమ్ముళ్లంటే గొప్ప ఆదరభావం ఉంది. అందుకే లక్ష్మణుణ్ని తనకు బహిః ప్రాణంగా పేర్కొన్నాడు. తనకు తండ్రిలేని లోటు తెలియకుండా ప్రక్కనే ఉంటూ కంటి రెప్పలాగా రక్షిస్తూ, తండ్రిని మరిపిస్తున్నాడని లక్ష్మణుణ్ని గూర్చి ప్రశంసాపూర్వకంగా శ్రీరాముడు చెప్పాడు. లోకంలో ఎందరెందరో సోదరులుంటారు. కాని ఎవరికి కూడా భరతుని లాంటి సోదరుడు లభించడు అని ప్రకటించాడు. లక్ష్మణుడు తన పరిచయాన్ని హనుమంతునికి వివరిస్తూ- నేను బంధుత్వాన్ని బట్టి శ్రీరామచంద్రునికి తమ్ముడను. కాని ఆయనలోని గుణాలకు నేను పారవశ్యం చెంది దాసుడనయ్యాను అని పేర్కొన్నాడు. యుద్ధభూమిలో మూర్ఛనొందిన లక్ష్మణుణ్ని చూసిన శ్రీరాముడు, ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ బంధుమిత్రులను, తగిన భార్యను పొందగలమేమో కాని లక్ష్మణునివంటి తోబుట్టువును సంపాదించ లేమని వాపోయాడు. భరతుణ్ని వదలి క్షణం కూడా ఉండలేని శత్రుఘు్నడు భరతునితో కలసి అతని మేనమామ ఇంటికి సంతోషంగా వెళ్లాడు. భరతుని సేవలో నిమగ్నుడై జీవనయానాన్ని కొనసాగించిన శత్రు ఘు్నడు అరిషడ్వర్గాన్ని జయించిన మహనీయుడు. ఈ నలుగురి సోదర ప్రేమను మనం ఆదర్శంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. -సముద్రాల శఠగోపాచార్యులు -
గీతోపదేశం
జ్యోతిర్మయం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది. శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని సంస్క రించడానికి ఉద్దేశించినది. భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం. చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక. అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు పరమాత్ముడు బోధించినదే గీత. ఇది భౌతిక జీవనమార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే గ్రంథమే. అందులో సందేహం లేదు. అయితే ఎంతటి ఆధ్యాత్మికతను ఉపదేశిస్తుం దో, అంతకు మించి దైనందిన జీవితాన్ని ఎట్లా సమర్థ వంతంగా సాగించుకోవాలో కూడా ప్రబోధిస్తున్నది. జీవితాన్ని ఒక నందనవనంగా చేసుకోవడం ఎలాగో చెప్పే మహోన్నత వాక్య సముదాయం భగవద్గీత. సుఖ దుఃఖాలనూ, జయాపజయాలనూ, లాభ నష్టాలనూ, శీతోష్ణాలను సహించడానికి అవసరమైన మానసిక సంసిద్ధతను గీతోపదేశం ద్వారా పొంద వచ్చు. జ్ఞానంతో సమానమైన పవిత్ర సాధనం ప్రపం చంలో మరొకటి లేనే లేదనీ, ఇట్టి పరమ పవిత్ర జ్ఞానం శ్రద్ధావంతులకే అబ్బుతుంది- ‘న హి జ్ఞానేన సదృ శం పవిత్రమిహ విద్యతే’, ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’ అని భగవద్గీత చెబుతోంది. ప్రశాంతమైన మనసు లేని వానికి సుఖాలు ఎలా లభిస్తాయి? అవిచ్ఛిన్నమైన ఆనందానుభూతి ఎలా సంభవిస్తుంది? అని ప్రశ్నించి, కామక్రోధాలు రెండూ రజోగుణం వల్ల ఉద్భవించినవేనని పేర్కొంటున్నది. అవే మన చేత ఘోర పాపాలను చేయిస్తాయనీ, జ్ఞాని అయినవాడు వాటినే ముఖ్య శత్రువులుగా భావించా లని చెబుతోంది. ‘కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్’ అని గీత ఉపదేశిస్తున్నది. విద్యా ఉద్యోగ వ్యాపార సేవా రంగాల వారికి వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుష, ప్రాంత కుల భేదం లేకుండా ప్రతి తరానికీ చెందిన విశ్వమానవ శ్రేయస్సుకు ఉపకరించే ప్రధానోపదేశమే భగవద్గీత. మహాత్మా గాంధీ తనకు ఎదురైన ప్రతి సమస్యకు భగవద్గీత నుంచే నివారణోపాయాన్ని పొందానని పేర్కొన్నారు. నేర్వదగిన శాస్త్రాలు లెక్కకు అందనన్ని ఉన్నాయి. అభ్యసించవలసిన విద్యలు ఎన్నో ఉన్నాయి. కాని మనిషి ఆయుర్దాయం పరిమితం. అందులో కలి గే విఘ్నాలు ఎన్నెన్నో! హంస పాలనూ నీళ్లనూ వేరు చేసి, నీరు వదలి పాలను స్వీకరించినట్టు సర్వోపనిష త్సారం, సర్వశాస్త్ర సంగ్రహం అయిన గీతోపదేశాన్ని ఉపదేశాత్మకంగా పరిశోధనాబుద్ధితో స్వీకరిద్దాం. ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. సముద్రాల శఠగోపాచార్యులు -
సౌశీల్యవంతుడు
జ్యోతిర్మయం పుట్టుకచేత, విద్యా సంపదల చేత గొప్పతనం ఉన్నప్ప టికీ తక్కువ వారితో అరమరిక లేకుండా కలసి ఉండ టాన్ని సౌశీల్యం అని అంటారు. ఇట్టి సౌశీల్యవంతు లలో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. ఇతడు క్షత్రియ వంశంలో జన్మించినా వేదవేదాంగాల్లో, ధనుర్వేదాది ఉపవిద్యల్లో నిష్ణాతుడైనా, చక్రవర్తి కుమారుడైనా, అష్టై శ్వర్యములు కలవాడైనా తనకు ఏ మాత్రం సరిజోడుగా నిలువలేని ముగ్గురితో ఎటువంటి అరమరిక లేకుండా కలసియుండేవాడు. ముగ్గురిలో మొదటివాడు పడవ నడుపుకొనే పల్లె వాడైన గుహుడు. గుహుణ్ణి శ్రీరామచంద్రుడు ఆత్మస ముడైన సఖుడని భావించాడు. అడవిలో నివసించే గుహుడు తనకు ఎదురుగా వచ్చి స్వాగ తం పలికినం దుకు శ్రీరామచంద్రుడు ఎంత గానో పొంగిపోయాడు. రెండవవాడు సుగ్రీవుడు. ఇత డు మానవజాతికి చెందినవాడే కాడు. ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు దూకే, గంతులు వేసే వానరజాతికి చెందినవాడు. అట్టి సుగ్రీవుణ్ణి శ్రీరామ చంద్రుడు తనకు సంరక్షకుడుగా, సుఖదుఃఖానుభ వాలలో తోడుగా నిలిచే ఆప్తునిగా భావించెను. మూడవవాడు మానవ స్వభావానికి విరుద్ధమైన రాక్షసజాతికి చెందిన వాడు. శ్రీరామచంద్రుని భార్య యైన సీతాదేవిని అపహరించిన రావణాసురునికి స్వయంగా తమ్ముడైన విభీషణుడు. సుగ్రీవాదులు విభీ షణుణ్ణి నమ్మవద్దని సూచించినప్పుడు, ఈ విభీషణుడే గాక స్వయంగా రావణాసురుడు మిత్రభావంతో వచ్చి నా అతణ్ణి కూడా క్షమించి రక్షిస్తాను అని తెలిపిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. అందరితో కలసిమెలసి ఉండటమే కాకుండా తనకు సంబంధించిన వారికి గాని, తన రాజ్యంలోని ప్రజలకు గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టాలలో ఉన్న వారి కంటే శ్రీరామచంద్రుడే ఎక్కువగా బాధను పొం దేవాడు. వారి కష్టాలు తొలగునట్లుగా సహాయం చేసే వాడు అని వాల్మీకి రామాయణంలో ప్రస్తావించారు.. తనకు ఆప్తులైన సుగ్రీవునికి, విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసిన పిమ్మటనే తనకు రాజ్య పట్టాభి షేకం జరుగుటకు రాముడు అంగీకరించాడు. తన రాజ్యంలోని ప్రజలకు సంబంధించి ఎవరిం ట్లో ఏ శుభకార్యం జరిగినా, శుభకార్యం జరుపుకునే వారికంటే తానే ఎక్కువగా ఆనందిస్తూ వారికి విరి విగా కానుకలను బహుమానంగా ఇచ్చేవాడు అని శ్రీరామచంద్రుని ఔదార్యాన్ని వాల్మీకి మహర్షి శ్రీమ ద్రామాయణంలో వర్ణించాడు. మహర్షులు కోరకముందే వారి యజ్ఞయాగాది వైదిక కార్యక్రమాలకు రక్షణ ఏర్పాటు చేయవలసి ఉం ది కానీ అట్లుగాక వారు వచ్చి కోరిన మీదట వారి రక్ష ణకు తాను సిద్ధపడితిని కదా అని శ్రీరామచంద్రుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు. అవతార పురుషుడైనా, అద్భుత శక్తియుక్తులు, ప్రజ్ఞాపాటవాలు మెండుగా నిండుగా కలిగియున్నా, ‘ఆత్మానం మానుషం వన్యే’ అని పేర్కొని తనను ఒక సామాన్య మానవునిగానే భావించుకున్న సౌశీల్యవం తుడు, సచ్చరితుడు శ్రీరామ చంద్రుడు. అట్టి మహనీ యుని ఆదర్శంగా గ్రహిద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
శాంతచిత్తులు
జ్యోతిర్మయం అంతరింద్రియాలను జయించడాన్ని శమమని, బాహ్యేంద్రియాలను నిగ్రహించడాన్ని దమమని అంటారు. సంసార బంధంలో చిక్కుకున్న వారు తెలు సుకోవలసిన తత్త్వజ్ఞానాన్ని ప్రబోధించి, వారు ఆచరిం చవలసిన వాటిని తెలియజెప్పేవారిని సద్గురువులని లేదా సదాచార్యులని వ్యవహరిస్తారు. కారణజన్ములైన సద్గురువులు వైదిక-ధార్మిక- సంప్రదాయిక జ్ఞానాన్ని, ఆచరణను కలిగి ఉంటారు. ధార్మిక చింతనతో జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బాహ్యేంద్రియాలను తమ వశంలో ఉంచు కుంటూ వైరాగ్య సంపత్తిని కలిగివుంటూ వారు దాం తులుగా పేరొందుతారు. మనుష్యుల బంధ మోక్షా లకు, అనేక విధాలైన సంకల్ప వికల్పాలకు కారణమై నిలిచే మనస్సును సదాచార్యులు తమ అధీనంలో ఉంచుకొని శాంతులుగా కీర్తి పొందుతారు. తత్త్వజ్ఞానులైన సద్గురువుల తేజస్సు సంసార చక్రంలో చిక్కుకున్నవారి పాపాలను నశింపజేస్తుంది. అయితే వారి తేజస్సు సూర్యకాంతి వలె తీక్షణమైనది కాదు. మనం ప్రచండ భానుణ్ణి చూడలేము. సూర్య తాపాన్ని భరించలేము. కాని సద్గురువుల తేజస్సును దర్శించగలము. వారి ప్రసన్నమైన చూపులకు పాత్రు లం కాగలుగుతాము. మహర్షుల వంటి స్వభావం, స్వరూపం, గుణ సముదాయం కలి గిన సదాచార్యుల సన్నిధిలో పర స్పరం విరుద్ధ భావాలు కలిగిన వారు కూడా కలసి మెలసి ఉండ గలుగుతారు. వేదవ్యాస, కణ్వాది మహర్షుల యొక్క ఆశ్రమా లలో సహజవైరం కలిగిన మృగ-పశుపక్ష్యాదులు తమ లోని వైరభావాన్ని, ఉద్రేకాన్ని కోల్పోయి శాంతస్వభా వాన్ని కలిగియున్నట్లే, రజస్తమాలను అణచివేసి స్త్వగుణభూషితులై, శాంతచిత్తులై, లోకహిత పరాయ ణులై ప్రవర్తించే సదాచార్యుల సాంగత్య లాభాన్ని పొందిన వారు కూడా తమలోని ఉద్రేకాన్ని, విరుద్ధ భావాలను కోల్పోయి ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వేదవ్యాసమహర్షి శాంత స్వభావాన్ని, సహజ వైరం గలవారిలోని ఉద్రేకాలను తొలగించి ప్రశాంత తను నెలకొల్పే చాతుర్యాన్ని వర్ణించేటువంటి ‘‘మధురై రవశాని లంభయన్నపి తిర్యంచి శమం నిరీక్షితైః / పరితః పటుబిభ్రదేనసాం దహనం ధామని లోకన క్షమమ్’’ అనే కిరాతార్జునీయ శ్లోక సారాంశము శం కర భగవత్పాదులు, రామానుజాచార్యులు వంటి జగదాచార్యులు ఎందరెందరికో వర్తిస్తుంది. శాంతచిత్తులైన మహర్షులకు, మునీశ్వరులకు సంసారుల వలె ప్రియాప్రియములు ఉండవు. శాంత చిత్తులై శీతోష్ణ సుఖదుఃఖాలను సహించగలుగుతారు. సమచిత్తులై వ్యవహరిస్తారు. అట్టి మహనీయుల శాంతచిత్తం నేటి తరానికేగాక అన్ని తరాల వారికీ ఆదర్శప్రాయమైనట్టిది, అనుసరణీయమైనట్టిది. కాబ ట్టి మనం కూడా యథాశక్తి మన చిత్తాన్ని ప్రశాంతం గా ఉంచుకొనే ప్రయత్నం చేద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
క్షమాగుణం
జ్యోతిర్మయం క్షమా అనేది ఒక విశిష్ట గుణం. శారీరకంగా, మానసి కంగా ఇతరులు ఎంతగా బాధించినా తిరిగి ఇతరు లను కోపగించకుండా, వధించకుండా కన్నెర్ర జేయ కుండా ఉండే స్థితిని క్షమ అంటారు. ఓర్పు ఉన్న వారిని క్షమాగుణ సంపన్నులు అని వ్యవహరిస్తారు. విశిష్టమైనరీతిలో సకల ప్రాణివర్గాన్ని సహనంతో ఎల్ల ప్పుడూ ధరించునట్టి భూమాత క్షమాగుణ సంపన్ను లలో అగ్రగణ్యురాలు. భూదేవికి క్షమ అనే సార్థక నామధేయం కూడా ఉన్నది. రావణాసురుని ఆజ్ఞకు బద్ధులై రాక్షస స్త్రీలు తనను అశోకవనంలో ఎంతగా హిం సించినా సీతాదేవి ఓర్పుతో భరించినది. అంతేకాకుండా రావణవధ తర్వాత హనుమం తుడు రాక్షస స్త్రీలను వధించు టకు సిద్ధపడినా ఆమె అందుకు అంగీకరించకుండా తన క్షమాగుణాన్ని చాటుకున్నది. క్షణకాలం కూడా శ్రీహరి యొక్క వియోగాన్ని భరించలేని శ్రీమహాలక్ష్మి ఆయన వక్షః స్థలంలో నిత్యనివాసాన్ని ఏర్పరచుకొని శ్రీమహావిష్ణువుకు ఉండే క్షమను మరింతగా వృద్ధిపర చాలని భావించినది. అనేక శుభగుణములకు నిల యుడైన శ్రీహరి తనను ఆశ్రయించిన వారిలోని దోషా లను చూడడు. వారు చేసిన అపరాధములను క్షమి స్తాడు. తన క్షమాగుణవైభవాన్ని చాటుతూ వారిని అక్కున చేర్చుకుంటాడు. అనన్య భావనతో తనను ఆశ్రయించిన వారిలో దోషాలున్ననూ వారిని క్షమిస్తాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మయే స్వయంగా పేర్కొన్నాడు. ‘ఓ స్వామీ! నీవు రామావతార సమయంలో సహించలేని మహాపాపాన్ని చేసిన కాకాసురుణ్ణి కూడా క్షమించి రక్షించావు. అట్లాగే కృష్ణావతారంలో కూడా వరుసగా మూడు జన్మల నుండి నీ పట్ల ఘోర అపరాధాలను చేస్తున్న శిశుపాలునికి మోక్షాన్ని అనుగ్రహించావు. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్రకాశించే నీ క్షమా గుణానికి పాత్రం కాని దోషం అంటూ ఏదీ ఉండదు. మా సమస్త అపరాధాలను క్షమించగలవాడవు నీవే’ అని యామునాచార్యులు స్తోత్రరత్నంలో పరమాత్మను ప్రస్తుతించారు. కొన్ని వేల బ్రహ్మ కల్పముల కాలంలో పూర్తిగా అనుభవించినా తీరనంతటి మహా పాతకాలను మాన వుడు ఒక అర క్షణంలోనే చేస్తున్నాడు. అలాంటి పాపా లను విడవకుండా ప్రతి జన్మలో ప్రతిక్షణం చేస్తూ జీవిం చేవాణ్ణి ఎవరు క్షమిస్తారయ్యా! మహా పాపాత్ముడు తన మనసు మార్చుకొని ఇక పాపాలు చేయను అని మనసు మార్చుకొని క్షమించమని వేడుకుంటే వెంటనే నీ మనసు కరిగి క్షమిస్తున్నావు. స్వామీ నీ హృదయం చాలా విశాలమైనది అని పరమాత్మ క్షమాగుణ వైభ వాన్ని కూరేశులు కీర్తించారు. వేదాచార్య భట్టర్ అనే వారు శ్రీరంగనాథుని క్షమాగుణాన్ని స్తుతిస్తూ 16 శ్లో కాలతో క్షమాషోడని అనే స్తోత్రాన్ని రచించారు. మనం కూడా క్షమాగుణాన్ని అలవర్చుకుంటే వివాదాలు ఘర్షణలు తగ్గుతాయి. ప్రశాంతంగా, సుఖసంతో షాలతో జీవించే అవకాశం కూడా కలుగుతుంది. - సముద్రాల శఠగోపాచార్యులు -
తల్లిదండ్రుల ప్రేమ
తల్లి తన పిల్లల క్షేమం కొరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తండ్రి తన పిల్లల చేతిలో తాను ఓట మిని పొందేంతగా పిల్లలు ఎదగాలి ‘‘పుత్రాదిచ్ఛేత్ పరా జయం’’ అని భావిస్తాడు. జన్మనిచ్చి, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతాభావా న్ని కలిగి ఉండటం పిల్లల ప్రథమ కర్తవ్యం. తల్లిదండ్రు లు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి అవసరాలను గుర్తిం చాలి. తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లలు పుట్టనేమి వారు గిట్టనేమి అనే పద్యపాదం పిల్లలు తల్లిదండ్రుల పై చూపవలసిన శ్రద్ధను ఉపదేశిస్తున్నది. తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని ‘‘మాతృదేవోభవ- పితృదేవోభవ’’ అను ైతె త్తరీయోపనిషత్ వాక్యాలు ఉద్బోధిస్తున్నాయి. ప్రత్యక్ష దైవాలైన తల్లి-తండ్రి-గురువులతో సమానమైన పవి త్ర వ్యక్తులను లోకంలో మరెక్కడా చూడలేము. సత్యదాన తపః కర్మలకంటే, పెద్దలను, ఋషుల ను, దేవతలను పూజించుట కంటే, యథోక్త దక్షిణల నిచ్చి చేసే యజ్ఞాలకంటే తల్లిదండ్రులకు చేసే సేవే గొప్పదని శ్రీరాముడు సీతాదేవికి చేసిన ఉపదేశం అన్ని కాలాలకు చెందిన పిల్లలందరికీ శిరోధార్యమై నట్టిది. ఒక్కొక్క ఫలితాన్ని పొందటానికి లౌకికమైన ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రుల సేవ చేసిన వారికి లోకంలో పొందరా నిది ఏదీ ఉండదు. ఐహికమైన శ్రేయస్సుతో పాటు పారలౌకికమైన శ్రేయస్సును కూడా పొందవచ్చునని శ్రీరాముడు ఉపదేశించాడు. తల్లిదండ్రులకు చేయవలసిన సపర్యలను క్రమం తప్పక చేసిన వ్యాధునికి (బోయ వానికి) ధర్మశాస్త్ర సూక్ష్మములన్ని స్ఫురించేవి. అతడు ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధిని పొందాడు. మాతాపితృపరా యణుడైన ధర్మవ్యాధుడు తన వద్దకు వచ్చిన ఎందరెం దరికో కర్తవ్యనిర్దేశాన్ని, ధర్మప్రబోధాలను చేశాడు. మాతాపితృ సేవాపరాయణుడైన శ్రవణ కుమారు డు తన తల్లిదండ్రులకు చూపు లేకపోయినా, వారికి ఏ లోటు రాకుండా సకల సపర్యలనందించాడు. అతడు ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే తల్లిదండ్రులను కావడిలో కూర్చుండబెట్టుకొని మోసుకొని వెళ్లేవాడు. శ్రవణ కుమారుడి సేవలు జాతిపిత మహాత్మాగాంధీని ఆక ర్షించాయి. అతడు తన తల్లిదండ్రుల సేవలో నిమ గ్నమయ్యేట్లుగా ప్రేరేపించినాయి. తల్లిదండ్రులకు చేయు ప్రదక్షిణ, పాద నమస్కా రాల వల్ల పరమ పవిత్రత, విశేష పుణ్యములు సమకూ రుతాయని, సత్ఫలితాలు కలుగుతాయని నైతిక, పౌరా ణిక ప్రమాణాలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రుల వల్ల ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న పిల్లలు ఎందరో విదేశాల లో స్థిరపడుతూ విదేశాభివృద్ధికి కారకులవుతున్నారు. అట్టి వారు మాతాపితరులకు, మాతృదేశానికి సంబం ధించిన కర్తవ్య నిర్వహణను కూడా తగిన విధంగా చేయుటకు ఉద్యుక్తులవ్వాలి. తల్లిదండ్రుల ప్రేమతో పుత్రులందరూ తరించాలి. జన్మసార్థకం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి అని ఆశిద్దాం. -సముద్రాల శఠగోపాచార్యులు