శాంతచిత్తులు
జ్యోతిర్మయం
అంతరింద్రియాలను జయించడాన్ని శమమని, బాహ్యేంద్రియాలను నిగ్రహించడాన్ని దమమని అంటారు. సంసార బంధంలో చిక్కుకున్న వారు తెలు సుకోవలసిన తత్త్వజ్ఞానాన్ని ప్రబోధించి, వారు ఆచరిం చవలసిన వాటిని తెలియజెప్పేవారిని సద్గురువులని లేదా సదాచార్యులని వ్యవహరిస్తారు.
కారణజన్ములైన సద్గురువులు వైదిక-ధార్మిక- సంప్రదాయిక జ్ఞానాన్ని, ఆచరణను కలిగి ఉంటారు. ధార్మిక చింతనతో జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బాహ్యేంద్రియాలను తమ వశంలో ఉంచు కుంటూ వైరాగ్య సంపత్తిని కలిగివుంటూ వారు దాం తులుగా పేరొందుతారు. మనుష్యుల బంధ మోక్షా లకు, అనేక విధాలైన సంకల్ప వికల్పాలకు కారణమై నిలిచే మనస్సును సదాచార్యులు తమ అధీనంలో ఉంచుకొని శాంతులుగా కీర్తి పొందుతారు.
తత్త్వజ్ఞానులైన సద్గురువుల తేజస్సు సంసార చక్రంలో చిక్కుకున్నవారి పాపాలను నశింపజేస్తుంది. అయితే వారి తేజస్సు సూర్యకాంతి వలె తీక్షణమైనది కాదు. మనం ప్రచండ భానుణ్ణి చూడలేము. సూర్య తాపాన్ని భరించలేము. కాని సద్గురువుల తేజస్సును దర్శించగలము. వారి ప్రసన్నమైన చూపులకు పాత్రు లం కాగలుగుతాము. మహర్షుల వంటి స్వభావం, స్వరూపం, గుణ సముదాయం కలి గిన సదాచార్యుల సన్నిధిలో పర స్పరం విరుద్ధ భావాలు కలిగిన వారు కూడా కలసి మెలసి ఉండ గలుగుతారు.
వేదవ్యాస, కణ్వాది మహర్షుల యొక్క ఆశ్రమా లలో సహజవైరం కలిగిన మృగ-పశుపక్ష్యాదులు తమ లోని వైరభావాన్ని, ఉద్రేకాన్ని కోల్పోయి శాంతస్వభా వాన్ని కలిగియున్నట్లే, రజస్తమాలను అణచివేసి స్త్వగుణభూషితులై, శాంతచిత్తులై, లోకహిత పరాయ ణులై ప్రవర్తించే సదాచార్యుల సాంగత్య లాభాన్ని పొందిన వారు కూడా తమలోని ఉద్రేకాన్ని, విరుద్ధ భావాలను కోల్పోయి ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు.
వేదవ్యాసమహర్షి శాంత స్వభావాన్ని, సహజ వైరం గలవారిలోని ఉద్రేకాలను తొలగించి ప్రశాంత తను నెలకొల్పే చాతుర్యాన్ని వర్ణించేటువంటి ‘‘మధురై రవశాని లంభయన్నపి తిర్యంచి శమం నిరీక్షితైః / పరితః పటుబిభ్రదేనసాం దహనం ధామని లోకన క్షమమ్’’ అనే కిరాతార్జునీయ శ్లోక సారాంశము శం కర భగవత్పాదులు, రామానుజాచార్యులు వంటి జగదాచార్యులు ఎందరెందరికో వర్తిస్తుంది.
శాంతచిత్తులైన మహర్షులకు, మునీశ్వరులకు సంసారుల వలె ప్రియాప్రియములు ఉండవు. శాంత చిత్తులై శీతోష్ణ సుఖదుఃఖాలను సహించగలుగుతారు. సమచిత్తులై వ్యవహరిస్తారు. అట్టి మహనీయుల శాంతచిత్తం నేటి తరానికేగాక అన్ని తరాల వారికీ ఆదర్శప్రాయమైనట్టిది, అనుసరణీయమైనట్టిది. కాబ ట్టి మనం కూడా యథాశక్తి మన చిత్తాన్ని ప్రశాంతం గా ఉంచుకొనే ప్రయత్నం చేద్దాం.
సముద్రాల శఠగోపాచార్యులు