ప్రియదర్శనం
కళ్లకు ప్రియమైన దృశ్యాన్ని చూడటం ద్వారా, మనసుకు నచ్చే ప్రదేశాన్ని దర్శించడంవల్ల కూడా మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అంతే కాకుండా కంటిని ఆకర్షించే రూపం గల వ్యక్తిని లేదా మనసుకు దగ్గరైన వ్యక్తిని దర్శించడంవల్ల కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది.
అయితే మనకు ప్రస్తుతం ప్రియంగా భాసిస్తున్న వ్యక్తులో, దృశ్యాలో కొంత కాలం తరువాత అప్రి యంగా మారవచ్చు. కాని తన రూపం చేత, గుణాల చేత అందరినీ ఆకర్షించే శ్రీరామచంద్రుని దివ్య మంగళ విగ్రహ దర్శనం ప్రాంత-వయో-లింగ కాల భేదం లేకుండా అందరికీ ప్రియమైనట్టిదే.
శ్రీరామచంద్రుని సుందరమైన వదనాన్ని దర్శిం చిన వారికి ఎవరికీ విసుగు రాకపోయేదట. ఆయన దర్శనం పొందిన వారికి ఇక చాలులే అనే సంతృప్తి కలుగదట. ఇంకా ఇంకా దర్శించాలనే ఆశ రేకెత్తు తూనే ఉండేదట. చంద్రుని కన్నా సుందరమైన ముఖ సౌందర్యం, సర్వాతి శయమైన అవయవ శోభ కలిగిన శ్రీరామచంద్రుని దర్శించే వారం దరికీ ఆయన నిత్య నూతనంగా భాసిస్తూ నేత్రానందాన్ని, పరమ ప్రీతిని కలిగించెడివాడట.
శ్రీరామచంద్రుని రూపం, గుణాలు వ్యక్తుల దృష్టినే కాకుండా వారి మనసును కూడా బాగా ఆకర్షిస్తాయని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని అయోధ్యాకాండలో ‘చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనమ్/ రూపౌదార్యగుణైః పుంసాం దృష్టిచిత్తాపహారిణమ్॥అనే శ్లోకం ద్వారా పేర్కొన్నాడు.
సాధారణంగా లోకంలో స్త్రీ సౌందర్యం పురు షులను, పురుషుల సౌందర్యం స్త్రీలను మాత్రమే ఆక ర్షిస్తూ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీరామచంద్రుని సౌందర్యం స్త్రీలనే కాక పురు షులను కూడా విశేషంగా ఆకర్షించేదని ‘పుంసాం మోహన రూపాయ’ వంటి ప్రమాణ వాక్యాలు విశద పరుస్తున్నాయి.
దశరథ మహారాజు సుమంత్రుడు అను పేరుగల ముఖ్యమైన మంత్రిని శ్రీరామచంద్రుని వద్దకు పంపి తన సభకు రప్పించుకొన్నాడు. రథంపై ఊరేగుతూ వచ్చిన శ్రీరాముని అద్భుత సౌందర్యాన్ని దశరథుడు తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయాడు.
శ్రీరాముని రూపమే కాక, ఆయన నడక సౌందర్యం కూడా అందరికీ ప్రియాన్ని కలిగించేదే. అందుకే శ్రీరాముని నడక సౌందర్యాన్ని పరమప్రియంగా దర్శించే దశరథ మహారాజు ముసలితనపు బాధలు దూరమయ్యేవట. ఆయన మనసు యవ్వన దశను పొందేదట. పరమప్రియ దర్శనాన్ని మనకు అనుగ్రహించే శ్రీరామచంద్రుని స్మరిద్దాం. ఆయన గుణాలను ఆదర్శంగా గ్రహిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు