
కోరిక జనించే క్షణాన...
మనిషి వాంఛాతీతుడు కావడానికి అతడి జ్ఞానేంద్రియాలనన్నింటినీ మూసివేయడం ఒక్కటే మార్గమని ఆ రంగంలోని తీవ్రవాదులు అనుకున్నప్పటికీ, అది సాధ్యమైన పని కాదు. స్పర్శ గనక సంభవిస్తే ఫీలింగ్ అనే భావావేశం ఉదయించక మానదు; స్పర్శ ఉంటే దానితో బాటు ఫీలింగ్ మనసుకు కలిగి తీరుతుంది. కానీ సరిగ్గా ఈ సమయాననే, ఆ గొలుసును తెగ్గొట్టవచ్చు.
ఈ వాంఛ అనే శృంఖలను మనం తెంచేయడానికి మార్గమున్నది. మన ఫీలింగులు, గాఢమైన భావనలు మన కోర్కెలనీ ఉత్పన్నం చేసే వేళ, నిబద్ధీకృతమైన ప్రతిచర్యలు (రియాక్షన్స్), ప్రతి స్పందనల సంకెళ్ల నుంచి ఛేదించుకుని బయటపడవచ్చు.
శక్తిమంతమైన మనసును జాగరూక పరిస్తే ఆ సమయాన ఆ వాంఛను పుట్టనివ్వకుండా చేసే వీలుంది. ఏమరుపాటు ఉంటే ఈ శృంఖల ఉత్పన్నమై తీరుతుంది.
ఏదైనా చూడడం, వినడం వల్లే కోరిక కలుగుతుందనుకోవడం సరికాదు. కళ్లు, చెవులు, ముక్కు మూసుకుని మనుషులు మసలుకోవాలని అనుకుంటే జగమంతా అస్తవ్యస్తమవుతుంది. అందరూ సన్యాసులే అయిన సమాజాన్ని ఊహించలేం. సత్వరజస్తమో గుణాలు జగాన్ని పరిపాలిస్తూనే ఉండాలి. కంకణబద్ధులు, దీక్షాపరులైన వారు వాంఛను అతిక్రమించి వాంఛాతీతులై బతకనేర్వాలి. అలాంటి ‘స్వేచ్ఛాజీవుల’ వల్ల సంఘానికి నీతిమార్గం దర్శనమిస్తుంది.
సమాజం మొత్తాన్ని వాంఛాతీతులు కావాలని ఎవరూ అభిలషించరు. ఈ జగన్నాటకం సాగడానికి అన్ని వర్గాల వారూ కావాలి. వాంఛను మనసులో ఉదయించకుండా ఓం ప్రథమం నుంచే అణచివేయాలని చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయి.
కళ్లకు గంతలు కట్టుకోవడం, చెవి రంధ్రాలకు ఆటంకాలు కల్పించుకోవడం తదితర సాధనాల ద్వారా జ్ఞానేంద్రియాలను అణచి వేయడం- అన్నీ కూడా మూర్ఖపు, మొండి పద్ధతులుగా పరిగణించిన బౌద్ధులు కోరికను ఫీలింగ్ పుట్టుకొచ్చేటప్పుడు తుంచెయ్యమన్నారు.
కన్ను అందాన్ని చూచి ఆనందిస్తుంది. వస్తువును ముట్టుకోవాలనే వాంఛ అప్రయత్నంగా కలిగే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో మనసు చురుకుగా పనిచేయాలి.
ఈ క్షణాన మనసు తన గృహంలో గనక తాను లేకపోతే కోరిక మనిషిని వశపరుచుకుంటుంది. ఆ సమయాన మనిషి పూర్తిగా ఎరుకతో గనక ఉంటే ఆ కోరిక పట్టు బిగియదు. ఈ ఎరుకే మనిషిని పెద్ద గోతిలో పడకుండా నివారిస్తుంది. ఫీలింగ్స్ ద్వారా కోరిక జనించకుండా ఆపవచ్చు.
మనసులో అజ్ఞానం అమితంగా ఉంటే, గాఢంగా అనుకున్నదల్లా కోరికగా రూపొందుతుంది. కానీ మనసులో ప్రజ్ఞ, ఎరుక గనక ఉన్నట్టయితే ఫీలింగ్ అనుభవిస్తున్న సమయాన్నే అది చెప్పినట్టల్లా చేయకుండా ఆ వస్తువును పట్టుకు వేలాడకుండా అక్కడ పడేసి పారిపోతుండగా అనిష్టంగానైనా దానిని అసహ్యించుకోకుండా స్థిరమైన మనసుతో వ్యవహరిస్తారు.
జాగరూకత కలిగి ఉన్న మనసు మనిషిని ఎల్లవేళలా కాపాడుతుంటుంది. అజాగ్రత్త మనిషిని వాంఛలలో పడేస్తుంది. ఈ అవ్యక్తత సంభవించకుండా ఉంటే, మనిషి పొరపాటు పడకుండా నడుస్తాడు. ఇక తాను ‘అవాల్సింది’ అంటూ ఏదీ లేదు కాబట్టి జనన మరణ పరంపర గొలుసును తెగ్గొట్టుకొని బతకవచ్చు.
నీలంరాజు లక్ష్మీప్రసాద్