
పారిజాతం
జ్యోతిర్మయం
మా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఒక పారిజాతం చెట్టు ఉండేది. తెల్లారి లేచేసరికి చెట్టుకింద రాలిన తెల్లటి, నాజూకైన పూలు పరవశింపజేసేవి. కొన్నా ళ్లకు మా తెలుగు మేస్టారు ముక్కుతిమ్మనగారి పారి జాతాపహరణం కావ్యంలో భాగాలు పాఠం చెప్తుంటే అదీ మా ప్రాణానికి మహా మనోహరంగా ఉండేది.
ఒకసారి నారదుడు స్వర్గం నుంచి శ్రీకృష్ణుడిని చూసేందుకు ద్వారకా నగరానికి వెళ్తూ ఒక పారిజాత పుష్పాన్ని కానుకగా తీసుకొని వెళ్లాడు. ఈ పుష్పాన్ని లక్షి, పార్వతి, సరస్వతి, శచీదేవి మురిపెంగా రోజూ ధరిస్తారన్నాడు. పరిమళము చెడదు, వాడదు / పరు వము తప్పదు, పరాగభర భరితంబై/ నిరతము జగ దేక మనో / హరమగు ఈ కుసుమ రాజము! అన్నాడు. కృష్ణుడు దాన్ని రుక్మిణికి అందిం చాడు. రుక్మిణి దాన్ని తన కొప్పులో తురుముకోగానే, ఆమె సౌందర్యం ఇనుమడించింది. మరి అంత అరు దైన కానుక అష్టభార్యలలో ఒక్క రికే దక్కితే మిగతా భార్యలు ఎలా సహిస్తారు? ముఖ్యంగా సత్యభామకు ఎంత తలవం పు! ఆమె ఆగ్రహించటం, కృష్ణుడు అనునయించటం, ఇద్దరు కలసి నేరుగా స్వర్గానికి వెళ్లి, ఇంద్రుడి నంద నవనంలో నుంచి ఆ పారిజాత వృక్షాన్నే సమూలంగా పెకలించి తెచ్చి, సత్యాదేవి కేళీ వనంలో నాటేయటం ఇదంతా ముక్కు తిమ్మన్న కవిగారు ఎంతో ముద్దుగా చెప్పారు.
పద్యాలు పనస తొనలలా ఉండేవి, నిజమే. కానీ, రోజూ లెక్క లేకుండా నిర్లక్ష్యంగా రాల్చి పారేసే పారి జాతం చెట్టు పూలకోసం సాక్షాత్తూ ఇంద్రుడూ, ఉపేంద్రుడూ, అంతటి యుద్ధం ఎందుకు చేసుకొ న్నారో మొదట్లో అర్థం కాలేదు. తరవాత ఎప్పుడో బుర్రలో దీపం వెలిగింది. దేవేంద్రుడి తోటలో పారిజా తం, మా వాకిట్లో పారిజాతం వేరు వేరు జాతులని, దేవేంద్రుడి పారిజాతం దివ్య తరువు. మందార వృక్షం, పారిజాత వృక్షం, సంతాన వృక్షం, కల్పవృ క్షం, హరిచందన వృక్షం - ఈ అయిదూ దివ్య వృక్షాలు అని సంప్రదాయం. వీటిలో పారిజాతం సర్వోత్తమం అని ప్రతీతి. ఈ పారిజాతం సాగర మథనం చేసిన ప్పుడు పుట్టింది. ఐరావత గజాన్నీ, ఉచ్చైశ్రవ అశ్వాన్నీ తీసుకొన్నట్టే ఇంద్రుడు దీన్నీ ఉంచేసుకొన్నాడు. ఈ దేవ పారిజాతం అన్ని ఈప్సితార్థాలను తీరుస్తుంది. అప్టైశ్వర్యాలను ఇస్తుంది. వేసవి కాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంచుతుంది.
అలాంటి దివ్య పారిజాతాలు మనకు ఎటూ అలభ్యాలే. కానీ, కాలం గడిచేకొద్దీ, మనం మన యాంత్రిక జీవన విధానంతో, ఇటు ప్రకృతి మనకు అయాచితంగా నిత్యమూ అందించే పారిజాత కుసు మాల అందాలకూ, అటు మన మహాకవులు ప్రసా దించిన పద్య పారిజాతాల సౌరభాలకూ కూడా దూర మైపోతున్నాం. అన్నట్టు, పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.
ఎం. మారుతిశాస్త్రి