వివరం: రాక్ష‌స గ్ర‌హంలోకి మాన‌వ‌యానం! | a story about mars | Sakshi
Sakshi News home page

వివరం: రాక్ష‌స గ్ర‌హంలోకి మాన‌వ‌యానం!

Published Sun, Mar 9 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

వివరం: రాక్ష‌స గ్ర‌హంలోకి మాన‌వ‌యానం!

వివరం: రాక్ష‌స గ్ర‌హంలోకి మాన‌వ‌యానం!

 ఒకవే ళ తి-రి-గి-రా-క-పో-తే?
 వాలెంటీనా గర్యచేవాకు వచ్చిన సందేహం కాదు ఇది.  
 అమె భర్త యూరీ గగారిన్‌కు కలిగిన ఆలోచన!
 ‘‘నేనొక వేళ తిరిగిరాకపోతే, జీవితాంతం అలాగే ఉండిపోకు’’ అని భార్యకు
 ఉత్తరం రాసి, అమెకు ఇవ్వకుండా దాచిపెట్టాడు గగారిన్. అంతరిక్షం నుంచి భూమి మీదికి క్షేమంగా తిరిగి వచ్చాకే ఆ ఉత్తరాన్ని తీసి భార్య చేతికి ఇచ్చాడు.
 అంతకన్నా కానుక ఉంటుందా, భార్యకు భర్త ఇవ్వదగింది...
 ఈ భూమి మీదైనా, ఆకాశంలోనైనా?!
 వలవల ఏడ్చేసి భర్తను గట్టిగా కావలించుకుంది వాలెంటీనా.
 అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు యూరీ గగారిన్.
 ఈరోజు (మార్చి 9) ఆయన జయంతి. ఈ సందర్భంగా - అంగారక గ్రహంలో మానవ ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తూ ప్రపంచ పౌరులను ఊరిస్తున్న ‘మార్స్‌వన్’ సంకల్పబలానికీ, కొరుకుడు పడని అంగారకుడి స్వభావానికి మధ్య ఎలా లంకె కుదురుతుందని తర్కించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.


భార్య వాలెంటీనాతో యూరీ గగారిన్
 మొదట మనం బాస్ లాండ్స్‌డార్ప్ కృత నిశ్చయానికి తల వంచి నమస్కరించాలి. ఆ తర్వాత ఎంతకూ అంతుచిక్కని అతడి నిశ్చయంలోని హేతుబద్ధత  గురించి తలలు బద్దలు కొట్టుకోడానికి పదేళ్ల సుదీర్ఘ సమయం మనకు ఎలాగూ ఉంటుంది.
 భూమి నుంచి తక్కువలో తక్కువగా సుమారు 5 కోట్ల 45 లక్షల మైళ్ల ‘సమీపం’లో ఉన్న అంగారక గ్రహంలోకి అడుగు పెట్టి, అక్కడ మానవులు నివసించేందుకు అనువైన ఒక శాశ్వత ఆవాసప్రాంతాన్ని క్రమంగా నిర్మించుకుంటూ పోవాలన్న లాండ్స్‌డార్ప్ పథకం మనలో కొందరికి రాబర్ట్ ఎ హైన్‌లైన్ మాటను గుర్తుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు.
 
  ‘నెవర్ అండర్‌ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ స్టుపిడిటీ’ అంటాడు హైన్‌లైన్. (1949 నాటి ఆయన సైన్స్ ఫిక్షన్ నవల ‘రెడ్ ప్లానెట్’.. అంగారక గ్రహంలో ఉండే బోర్డింగ్ స్కూలు విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది). అయితే ‘మార్స్ వన్’ ప్రాజెక్టు రూపకర్త లాండ్స్‌డార్ప్ మరీ అంత బుద్ధిహీనుడు అయివుండే అవకాశం లేదు. అతడో వ్యాపారి. డచ్చి వ్యాపారి. (పచ్చి కాదు, డచ్చే. అంటే నెదర్లాండ్స్).

 ఇళ్లస్థలాలు కొని అమ్మడం అతడి అభిమతం కానే కాదు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ పట్టభద్రుడైన లాండ్స్‌డార్ప్.. అత్యంత ప్రతిభగల ఇంజినీర్లను, సూక్ష్మబుద్ధిగల  శాస్త్రపరిశోధకులను, ఖర్చులకు వెనుకాడని పారిశ్రామిక వేత్తలను ఇసుక, కంకర, సిమెంటుల్లా కలిపి ఉపయోగించుకుని అంగారక గ్రహంపై నివాస గృహాల సముదాయాన్ని నిర్మించి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని తపిస్తున్నాడు.  అంతా అతడు అనుకున్నట్లే గనక జరిగితే తొలివిడతగా 2024లో భూమి నుంచి బయల్దేరే ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పౌర వ్యోమగాములు ఎనిమిది నెలల పాటు ప్రయాణించి అంగారకుడిపై కాలుమోపుతారు.
 
  తమ వెంట తీసుకువెళ్లిన  విడి భాగాలను (మాడ్యూల్స్) క్రమపద్ధతిలో బిగించడం వల్ల రూపొందే ఆవాసాలలో  స్థిర నివాసం ఏర్పరచుకుని, తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు. అయితే ఊరికే అలా ఉండిపోరు. రెండేళ్లకొకసారి భూమి నుండి వచ్చి తమలో చేరుతుండే మానవుల కోసం సురక్షితమైన ఆవాసాలు నిర్మిస్తుంటారు. నీటి జాడలను కనిపెడుతుంటారు. ప్రాణవాయువును అందించే మొక్కల్ని పెంచుతుంటారు. ఆహారాన్ని ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవ మనుగడకు ఏం కావాలో వాటన్నిటి కోసం అంగార గ్రహంలో పరిశోధనలు చేస్తుంటారు.


 బాస్ లాండ్స్‌డార్ప్: మార్‌‌సవన్ ఇతడి  ఆలోచనే

బాస్ లాండ్స్‌డార్ప్: మార్‌‌సవన్ ఇతడి  ఆలోచనే అంతా స్పష్టంగానే ఉంది కదా. ఇక మనం ఎందుకు తల బద్దలు కొట్టుకోవాలి? ఎందుకంటే ఇదంతా సాధ్యమయ్యే పనేనా లేక పనిలేని పనా అని తేల్చుకోవడం కోసం. లాండ్స్‌డార్ప్‌ని ఈ ప్రశ్నలకు సమాధానాలు అడగడం భావ్యం కాదు. మరో పదేళ్ల  వరకు ఆయన  తీరిక లేని మనిషి. 2024లో గుర్రం ఎగరాలంటే ఇప్పటి నుంచే ప్రయాణ ఏర్పాట్లను దౌడు తీయించాలి కదా. కనుక ఆయన దీక్షకు భంగం కలిగించకుండా ఆయన కలల ప్రాజెక్టు ‘మార్స్ వన్’ గురించి కాస్త పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం. అన్నట్టు ఇంత పెద్ద ప్రాజెక్టుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? దీనికి కూడా లాండ్స్‌డార్ప్ ప్లాన్ గీసి పెట్టుకున్నాడు. ఏదైనా ఒక ఇరవై నాలుగు గంటల టీవీ ఛానెల్‌కు రియాలిటీ షో రైట్స్ ఇచ్చి, ఆ షోలో మార్స్ వన్ ప్రాజెక్టు పనులన్నీ ప్రసారం చేయించి, ఆఖర్న అంగారకుడి పైకి దిగిన ఆ నలుగురు భూలోకవాసులనూ చూపించి ఖర్చులకు సంపాదించుకుంటాడట! బెస్ట్ ఆఫ్ లక్ బాస్ లాండ్స్‌డార్ప్.
 
 నిజానికి ఇది అత్యంత ప్రమాదకరమైన సాహసం. పైకి వెళ్లడమే గానీ, తిరిగి రావడం అంటూ ఉండదని తెలిసీ తొందరపడుతున్న లక్షలాది మంది ఔత్సాహిక పౌరులు ఈ ప్రాజెక్టుకు ఆజ్యం పోస్తున్నారు. వీరి ఉత్సాహం చూస్తుంటే ఐరోపాను వదిలి పశ్చిమార్థగోళంలోని అమెరికాలో కాలనీలను ఏర్పరచుకోడానికి తొందరపడి వెళ్లి అష్టకష్టాలు పడినవారు గుర్తుకు వస్తారు. మార్స్ పైకి వలస మరీ ఎక్కువగా ప్రమాదాలకు అనువైనది. ఏ అంతరిక్ష వైపరీత్యం వల్లనో చిన్న ముప్పు వాటిల్లినా అక్కడ మానవులు నిర్మించుకున్న కాలనీలు  క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతాయి. వాటితో పాటు వాటిల్లో ఉండేవారు కూడా. వైపరీత్యాల వరకూ ఎందుకు..  ఆహారాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలలో చిన్న తేడా జరిగినా ‘భోజనం తయారు’ కాక ఆకలికి మలమల మాడిపోవలసిందే. నీటిని తయారు చేసుకునే విధానంలో, నీటి పునర్వినియోగ ప్రక్రియలో వైఫల్యం ఎదురయ్యిందా... తాగేందుకు చుక్క నీరు కూడా కరువైపోతుంది. అయితే ఇవన్నీ తర్వాతి సమస్యలు. బిక్కుబిక్కుమంటూ ఎనిమిది నెలలపాటు వ్యోమనౌకలో ప్రయాణించి అంగారకుడిని చేరుకున్నాక తక్షణం అక్కడి వాతావరణానికి తట్టుకోవడమన్నదే ప్రధాన సమస్య.  
 
 రేడియేషన్
 అంగారకుడిపై మనిషి ఎదుర్కొనే తొలి ప్రాణాంతక సమస్య రేడియేషన్. సౌరవ్యవస్థ లోపల గ్రహాల మధ్య రెండు విధాలైన రేడియేషన్ ఉంటుంది. సోలార్ రేడియేషన్, కాస్మిక్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ సూర్యుడి నుంచి వెలువడుతూ ప్రతి పదకొండేళ్లకొకసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. కాస్మిక్ రేడియేషన్ సౌరవ్యవస్థకు ఆవల సంభవిస్తుండే తారామండల విధ్వంసకర విపరిణామాల నుంచి, కృష్ణబిలాల నుంచి (బ్లాక్ హోల్స్) జనిస్తుంది. ఈ రెండు రేడియేషన్లు కూడా ప్రాణులకు హానిచేసేవే. ఒకసారి మార్స్‌లోకి వెళ్లి వస్తే వ్యోమగాములు ఒక ‘జీమెన్’ యూనిట్‌కు సమానమైన రేడియేషన్‌కు లోనవుతారని ‘నాసా’ అంటోంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో గురయ్యే రేడియేషన్‌కు సమానమైన మోతాదు ఇది! సముద్ర మట్టానికి సమంగా ఉన్న భూభాగంపై ఒక ఏడాది మొత్తం మీద బహిర్గతమయ్యే రేడియేషన్ మిల్లీ జీమెన్‌ల స్థాయిలో మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి ఒక ‘జీమెన్’ డోసును అర్థం చేసుకోవచ్చు.
 
  రేడియేషన్‌కు ఎక్కువగా గురైతే కంటిచూపు పోతుంది. లేదా మందగిస్తుంది. క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఉంటుంది. ఇంత ప్రాణాంతకమైన రేడియేషన్ అత్యధిక స్థాయిల్లో ఉండే మార్స్ గ్రహానికి వెళ్లి బతికిబట్టకట్టే అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్న. కవచాలు ఏవో ఉంటాయి. కానీ అవి ఎంతవరకు కాపాడతాయన్నది ఇంకో ప్రశ్న. ఒకవేళ అన్నీ సవ్యంగా ఉండి, అక్కడ  కాపురం పెట్టిన వారికి పిల్లలు పుట్టినా, వాళ్లు సక్రమంగా పుడతారనీ, ఆరోగ్యంగా ఎదుగుతారనీ భరోసా ఏమాత్రం లేదు. మానవ దేహంలో త్వరత్వరగా వృద్ధి చెందుతుండే కణాలపై రేడియేషన్ ఎంతో తేలిగ్గా తన దుష్ర్పభావాన్ని చూపిస్తుంది. పసి శరీరాలపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.
 
  రేడియేషన్ వల్ల సంభవించే ఈ దుష్పరిణామాలతో పాటు.. భౌతిక, మానసిక సమస్యలు కూడా ఉంటాయి.
 
 భౌతిక సమస్యలు
 మనిషి మనుగడకు గాలి, నీరు, ఆహారం, ఆవాసం కీలకమైనవి.  భూమి మీద లభ్యమయ్యే ఈ జీవితావసరాలలో కనీసం ఒక శాతం కూడా అంగారకుడిలో లేవు! అక్కడ 95 శాతం కార్బన్ డై ఆక్సైడే ఉంది. ఆక్సిజన్ ఒక జాడగా మాత్రమే అంగారకుని పొరల్లో కనిపిస్తుంది. దాన్ని ‘తేలిగ్గా పీల్చుకోగల ఆక్సిజన్’గా మార్చుకుని నిల్వ ఉంచుకోవడం అంత సులభం కాదు.  
 
 ఆహారం విషయానికి వస్తే ఆవాసంలో మొక్కలు పెంచడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పరిచే విడిభాగాలను మార్స్ వన్ అంగారకుడిలోకి పంపుతోంది. అయితే వాటిలో పెరిగే ఒకే రకమైన శాకాహారాన్నే పదే పదే  భుజిస్తుండాలి. జీవులకు బి12 అవసరం కనుక ఈస్టును, దానిని పోలిన ఇతర ఆహారప్రాణులను ఉత్పత్తి చేసుకోవాలి. అవి మొక్కల వల్ల సాధ్యం కావు. చేపల మాటే ఉండదు. పాలు, గుడ్లు మర్చిపోవాల్సిందే. ఆఖరికి చెట్ల నుంచి వచ్చే పప్పులు, పండ్లు కూడా పండవు. మిరియాలుండవు. గసాలు, దాల్చిన చెక్కలు, వెనీలా వంటివేవీ ఉండవు. సుగంధద్రవ్యాలు లేని జీవితంపై మొహం మొత్తదా మరి!
 
 మానసికమైన ఒత్తిడులు
 నీరు, గాలి, ఆహారం, ఆవాసం, విద్యుచ్ఛక్తి, నిర్మాణ సామగ్రి అన్నీ సమకూర్చుకున్నారనే అనుకుందాం. కాలనీ వాసుల  జీవితం హాయిగా గడిచిపోతుందనుకోడానికి లేదు. మానసిక ఒత్తిడితో, స్థిమితం తప్పి ఒక్కరు చేసే చిన్న పొరపాటు లేదా తప్పు... మిగతా అందరి ప్రాణాలనూ హరించే ప్రమాదం ఉంది. ఇలాంటి విపత్తు ఏదో ఒక రోజు జరగదని చెప్పలేం. అయితే మనసును ఆహ్లాదకరంగా ఉంచుకునేందుకు ఉన్న ఒక అవకాశం ఏమిటంటే... భూగోళం నుంచి అంగారకుడిలోకి  డిజిటల్ మెటీరియల్ క్రమం తప్పకుండా అందుతుంది. అంటే భూమి మీద ఏం జరుగుతున్నదీ ఇక్కడ వీరు వీడియోలో చూడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. అయితే కింద ఉన్న మన కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో గబగబా మాట్లాడ్డం మాత్రం కుదరదు. ఒకసారి ఒక మాట కిందికి వెళ్లాలన్నా, పైకి రావాలన్నా రేడియో తరంగాలు 6 నుంచి 40 నిమిషాల వ్యవధిలో ప్రయాణించవలసి ఉంటుంది. ఉదా: మనం అంగారకుడిలో ఉండి ‘హలో’ అంటే సగటున 20 నిమిషాల తర్వాత మనకు భూమి నుంచి రిప్లయ్ వస్తుంది.
 
 అసలు విషయం!

 ఒకసారి అంగారకుడిలోకి వెళ్లాక మనం మానవులం కాము. అంగారకవాసులం. అక్కడ మన తిండి తినలేం. అక్కడి నుంచి మన మనుషులతో మాట్లాడలేం. ఇరుకు ఆవాసాల్లో కిక్కిరిసిపోయి ఉండాలి. అడవులను చూడలేం. సముద్రాల్ని వీక్షించలేం. నీలాకాశం కనిపించదు. మేఘాలూ ఉండవు. జీవితమంతా (ఎంతవరకూ బతికి ఉంటే అంతవరకూ) చిన్న కలుగులాంటి ఆవాసంలోనో, లేదా దాని చుట్టూతానో తిరుగుతూ గడపాల్సిందే. అంటే నరకంలో! బతికుండగానే నరకం చూడాలనిపిస్తే ఇంతకు మించిన ఆఫర్ లేదు. వెళ్తావా అంగరక! అయితే చెయ్ రా సాహసం డింభకా!
 
     అంగారకుడి పైకి వెళ్లేందుకు ఒక ట్రిప్పుకు అయ్యే ఖర్చు: 600 కోట్ల అమెరికన్ డాలర్లు. (మనక్కాదు. నిర్వాహకులకు).
 
     భూమి నుంచి అంగారకుడికి చేరడానికి పట్టే సమయం కనీసం 240 రోజులు.
 
     అంగారకుడు భూమిలో సగం కంటే కాస్త పెద్దగా ఉంటాడు.
   
     అంగారకుడిలో అక్సిజన్ విడిగా లేదు. ఒకప్పుడు ఉండేదేమో కానీ అది నేలలో కలిసిపోయి ఉండాలి. అందుకే అంగారకుని నేల అయిదింట మూడు వంతులు ఎర్రగా తుప్పు పట్టినట్టు (ఆక్సీకరణ కారణంగా) ఉంటుంది. అందుకే అంగారకుడు ఎర్రగా కనిపిస్తాడు.  
 
     1969 మార్చిలో అమెరికా పంపిన రోదసీ నౌకలు మారినర్ 6, మారినర్ 7 అంగారకుని సమీపానికి వెళ్లి ఫొటోలు తీసి భూమి పైకి పంపించాయి. వాటి ఆధారంగా అంగారకునిపై వాతావరణం పల్చగా ఉందని తెలుస్తోంది. భూమి మీద లక్ష అడుగుల ఎత్తుగల పర్వతం మీద నించుంటే ఎంత పల్చటి వాతావరణం ఉంటుందో అంగారకుడిపై కూడా అలాంటి  వాతావరణమే ఉంది.  అంత పల్చగా ఉండడంవల్ల సూర్యుడి నుంచి ప్రసరించే అల్ట్రా వయెలెట్ కిరణాలు సరాసరి వచ్చి అంగారకుడి ఉపరితలాన్ని తాకుతాయి.
 
 
 కొన్ని సందేహాలు- సమాధానాలు


 ఎవరైనా అంగారకుడిపైకి వెళ్లొచ్చా?

 వెళ్లొచ్చు. కానీ మొదటి ట్రిప్ దరఖాస్తు గడువు 2013 ఆగస్టు 31తోనే ముగిసిపోయింది.


 మరి ఎలా వెళ్లడం?
 ‘మార్స్ వన్’ మళ్లీ ఆన్‌లైన్ బుకింగులు మొదలు పెడుతుంది.


 దరఖాస్తుకు ఎంత ఖర్చవుతుంది?
 దేశాన్ని బట్టి 5 నుంచి 75 డాలర్ల వరకు ఉంటుంది.
 (అంటే 300 రూ. నుంచి 5000 మధ్య)


 ఎంపిక విధానం ఏమిటి?
 నాలుగు రౌండ్లలో జరుగుతుంది. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది.


 దరఖాస్తుకు అర్హతలేమిటి?
 కనీసార్హత 18 సం॥నిండి ఉండడం. మిగతావి దేహదార్ఢ్యానికీ, మానసిక స్థితికీ సంబంధించినవి.


 పరీక్షా విధానం ఏమిటి?
 చాలా విధాలుగా ఉంటుంది. అవన్నీ కూడా వడపోతలో నిలబడిన వారికే. (పూర్తి వివరాలు www.marsone.comలో లభ్యమౌతాయి.)
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement