Yuri Gagarin
-
గగారిన్ మళ్లీ పుట్టాడు!
ఇరవై ఏడేళ్ల వయసుకు ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదుగుతారు? యూరీ గగారిన్ అంతరిక్షానికి ఎదిగాడు! రష్యన్ కాస్మోనాట్ ఆయన. స్పేస్ లోకి వెళ్లిన తొలి మానవుడు అతడే! 34లో పుట్టాడు. 34 ఏళ్లకే చనిపోయాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు. లవ్ మ్యారేజ్. క్వీన్ ఎలిజబెత్ ఈ మార్చి 10 న వర్చువల్ మీటింగ్ లో బ్రిటిష్ సైంటిస్టులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యూరీ గగారిన్ ప్రస్తావన వచ్చింది. యూరీ అంతరిక్షం నుంచి దిగి వచ్చాక రాణిగారిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసి.. ‘‘అప్పుడు మీకు అతన్ని చూస్తే ఏమనిపించింది హర్ మ్యాజెస్టీ..’’ అని ఒక మహిళా సైంటిస్టు క్వీన్ ఎలిజబెత్‌ను అడిగారు. ‘రష్యన్ లా అనిపించాడు‘ అని క్విప్ (హాస్యం) చేశారు క్వీన్. నవ్వులే నవ్వులు. బ్రిటిష్ సైన్స్ వీక్ నిన్నటితో ముగిసింది. యూరీపై మళ్లీ కొత్తగా ప్రపంచానికి ఆసక్తి మొదలైంది. మ్యాగీ అంతరిక్ష శాస్త్రవేత్త. సైన్స్ ప్రొఫెసర్. వయసు 53. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన యూరీ గగారిన్ జీవించి ఉంటే కనుక ఆయన ఇప్పుడు తన 87 ఏళ్ల వయసులో ఉండేవారు. మ్యాగీ బ్రిటన్ మహిళ. గగారిన్ రష్యన్ వ్యోమగామి. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఒకటే.. మ్యాగీకి గగారిన్ అంటే పిచ్చి అభిమానం. ఆయన స్ఫూర్తితోనే ఆమె స్పేస్ సైంటిస్ట్ అయ్యారు. 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేనాటికి మ్యాగీ పుట్టనే లేదు. అదీ విశేషం. ఈ బుధవారం మరొక విశేషానికి కూడా మ్యాగీ కారణం అయ్యారు. మార్చి 5 నుంచి 12 వరకు ‘బ్రిటన్ సైన్స్ వీక్’ జరిగింది. పదో తేదీన క్వీన్ ఎలిజబెత్ వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో కొంత మంది బ్రిటన్ సైంటిస్టులతో మాట్లాడారు. ఆ సైంటిస్టులలో మ్యాగీ కూడా ఉన్నారు. తననొక స్పేస్ సైంటిస్ట్‌గా పరిచయం చేసుకున్నాక రాణిగారు.. ‘‘స్పేస్ సైన్స్ మీద నీకెలా ఆసక్తి ఏర్పడింది’’ అని మ్యాగీని అడిగారు. ‘‘హర్ మ్యాజెస్టీ.. నేను రష్యన్ వ్యోమగామి గగారిన్ అభిమానిని. ఆయన కారణంగానే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి కలిగింది’’ అని చెబుతూ.. ‘హర్ మ్యాజెస్టీ.. అంతరిక్షం లోకి వెళ్లి వచ్చాక ఆయన మిమ్మల్ని కలిసేందుకు బకింగ్ హ్యామ్ పాలెస్కు వచ్చారు కదా. అప్పుడు ఆయన్ని చూస్తే మీకేమనిపించింది?!’’ అని అడిగారు. బ్రిటిష్ సైన్స్ వీక్ సందర్భంగా బుధవారం (మార్చి 10) సైంటిస్టుల వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో క్వీన్ ఎలిజబెత్. పచ్చరంగు దుస్తుల్లో ఉన్న మహిళే గగారిన్ అభిమాని మ్యాగీ. ‘‘రష్యన్’’ అనిపించింది అని క్వీన్ జోక్ వేశారు. రాణిగారి మాటకు ఒకటే నవ్వులు. ‘‘నా దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఆయన గాల్లో తేలుతూనే ఉన్నారు! స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తొలి మానవుడు కదా! ఆ విజయోత్సాహం ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాతో రష్యన్‌లోనే మాట్లాడారు’’ అన్నారు ఎలిజబెత్. ఆ ఏడాది ఆగస్టులో అంతరిక్షంలోకి, జూలైలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి వెళ్లారు గగారిన్. ఇప్పుడు మళ్లీ వార్తలోకి వచ్చారు. మ్యాగీనే ఆయన్ని మళ్లీ ఒకసారి మానవాళి మనోపథంలోకి తెచ్చారని చెప్పాలి. గగారిన్ అభిమానిని అనిపించుకున్నారు మ్యాగీ! అంతరిక్షంలో యూరీ గగారిన్ సాధించినది పెద్ద విజయమే అయినా భూమి మీద ఆయన జీవించింది అతి స్వల్పకాలం. కేవలం 34 ఏళ్లు. ఆ ముప్పై నాలుగేళ్ల కాలాన్ని భూకక్ష్యలో అతడు గడిపిన గంటా 48 నిముషాలతో పోల్చవచ్చు. కక్ష్యలో ప్రతి నిముషాన్నీ ఆయన ఎంత ఇష్టంగా గడిపారో, తన భార్య, ఇద్దరు కూతుళ్లతో అంతే ఇష్టంగా జీవితాన్ని గడిపారు. 1934 మార్చి 9న తల్లి కడుపులోంచి భూమి మీద పడి, 1961 ఏప్రిల్ 12న ఆకాశంలో భూమి చుట్టూ తిరిగి, 1968 మార్చి 27 న భువి నుంచి దివికేగారు గగారిన్. ‘మిగ్’లో రోజువారీ శిక్షణలో ఉన్నప్పుడు ఆ విమానం పేలిపోయి ఫ్లయిట్ ఇన్స్ట్రక్టర్ తో పాటు గగారిన్ కూడా చనిపోయారు. ఆయన భార్య వాలెంటీనా గగారినా గత ఏడాదే మార్చి 17 న తన 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పెద్ద కూతురు ఎలీనా ఆర్ట్ హిస్టారియన్. ‘మాస్కో క్రెమ్లిన్ మ్యూజియమ్స్’ జనరల్ డైరెక్టర్. చిన్న కూతురు గలీనా ఎకనమిక్స్ ప్రొఫెసర్. ప్లెఖనోవ రష్యన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనమిక్స్ డిపార్ట్మెంట్ హెడ్. గగారిన్, వాలెంటీనాలది ప్రేమ వివాహం. ఆమెను తొలిసారి ఆయన మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో మేడే మహోత్సవాలలో చూశారు. అప్పటికి ఆమె మెడికల్ టెక్నిషియన్. అతడు బాస్కెట్‌బాల్ కోచ్. 1957లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. వాలెంటీనా మెడికల్ టెక్నీషియన్‌గా, గృహిణిగా రెండు పడవల్ని నడిపిస్తే.. రష్యన్ పైలట్‌గా ఉన్న గగారిన్ ‘సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్’ కి అర్హత సంపాదించి స్పేస్‌లోకి తెడ్లు వేశారు! పదేళ్ల వైవాహిక జీవితంలో గగారిన్ తన భార్య, కూతుళ్లతో ప్రతి క్షణాన్నీ అత్యంత విలువైనదిగా గడిపారు. క్వీన్ ఎలిజబెత్‌ను కలవడం అయితే అదొక అపురూపమైన సందర్భం గగారిన్కి. తొలి కాస్మోనాట్‌గా బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు పిల్లలకు ఇవ్వమని ఎలిజబెత్ రాణి అందమైన బొమ్మల్ని కానుకగా ఇచ్చారు. తమ తండ్రి స్పేస్‌లోకి వెళ్లడం, తిరిగి రావడం అర్థం చేసుకునేంత వయసు కాదు అప్పటికి ఎలీనా, గలీనాలది! -
అంతరిక్షం వాణిజ్య గవాక్షం
యూరి గెగరిన్ రెక్కలు తొడుక్కుని అంతరిక్షం అంచుల్ని తాకింది ఈ రోజే. అంటే అంతరిక్షంలోకి మనిషి వెళ్లి నేటితో కచ్చితంగా 54 ఏళ్లు! ఈ కాలమంతా ఒక ఎత్తు... రానున్నది మరో ఎత్తు! యుగాలుగా ఊరిస్తూ, ఉడికిస్తూ, నడిపిస్తూ వస్తున్న చుక్కల్ని, గ్రహాలను అబ్బురంగా చూస్తూనే... అందిపుచ్చుకోవాలని, వాటి ఆనుపానూ తెలుసుకోవాలని తపనపడ్డ మానవుడు రూటు మార్చాడు! సిరిమంతుల విలాస ప్రయాణానికి మాత్రమే కాదు... అంతరిక్షాన్ని... రేపటి గూడుగా. కల్పవక్షంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు! నిన్నమొన్నటివరకూ అంతరిక్ష ప్రయోగమంటే... దేశాల స్థాయిలో జరిగే శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే. మరి నేడు... కొంచెం ఆసక్తితోపాటు... బోలెడంత డబ్బున్న ఎవరైనా కంపెనీ పెట్టేసి మనుషుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేయవచ్చు. లేదా... వేల కోట్లతో నాసా వంటి సంస్థలు జరుపుతున్న ప్రయోగాల్లో పాలుపంచుకోవచ్చు. బ్రిటన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ స్పేస్ ట్రావెల్ ద్వారా అంతరిక్షాన్ని వాణిజ్యానికి వాడుకునే ప్రయత్నం చేస్తూంటే... మాడ్రన్ ఐరన్ మ్యాన్‌గా కీర్తి గడించిన టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ పేరుతో రాకెట్లు తయారు చేస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకు రవాణా చేస్తున్నాడు. అంతరిక్షం నుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ముందుకురుకుతున్న కంపెనీల్లో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. మారుతున్న పరిస్థితులు.. అవసరాలు సాంకేతిక పరిజ్ఞానాలు అన్నీ కలిసి అంతరిక్షాన్ని... వ్యాపారానికి గవాక్షంగా మార్చేస్తున్నాయి! చిన్నింటి వేట... జనాభా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఉన్న వనరులేమో తక్కువ. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదమూ లేకపోలేదు. మరి తరుణోపాయం... పొరుగున ఉన్న చందమామనో... కొంచెం దూరంగా ఉన్న అంగారకుడినో చిన్నిల్లుగా మార్చేసుకోవడమే అన్నది చాలాకాలంగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్‌తో పాటు అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా ముందుగా అనుకున్నట్లే 2020 నాటికి చందమామపై స్థావరం ఏర్పాటు చేయడం, ఆ తరువాత మానవులతో కూడిన నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయడం పక్కా అనుకోవచ్చు. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్... చంద్రుడిపైకి పంపే రోవర్ ఎలా ఉండాలి? అన్న అంశంపై ఓ పోటీ పెట్టడం ప్రై వేట్ కంపెనీలు అంతరిక్ష రంగంపై చూపుతున్న ఆసక్తికి మచ్చుతునక. ఖనిజాల మూటలు... గ్రహశకలాలు, తోకచుక్కల వల్ల ఎదురయ్యే సమస్యనే ఓ మంచి అవకాశంగా మార్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మనిషి తెలివికి నిదర్శనం. మనిషి జీవించడానికి అతిముఖ్యమైన నీటితోపాటు.. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ తయారీ రంగాల్లో కీలకపాత్ర పోషించగల ప్లాటినమ్ వంటి ఖనిజాలను గ్రహశకలాల నుంచి కొల్లగొట్టేందుకు ప్లానెటరీ రిసోర్సస్ పేరుతో ఇటీవలే ఓ కంపెనీ ఏర్పాటైంది. గ్రహశకలాల్లోని నీటి ద్వారా భవిష్యత్తులో అంగారకుడు లేదా అంతకంటే దూరమైన గ్రహాలను కూడా అందుకునేందుకు అవసరమైన ఇంధనాన్ని అంతరిక్షంలోనే తయారు చేసుకోవచ్చునని, వ్యోమగాములకు అవసరమైన నీరు, గాలిని కూడా అక్కడికక్కడే తయారు చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయని ఈ కంపెనీ అంటోంది. అంతరిక్షంలో సువిశాలమైన సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకుని... మైక్రోవేవ్ తరంగాల ద్వారా భూమ్మీదకు విద్యుత్తు ప్రసారం చేసుకుని వాడుకోవాలన్న జపాన్ ఆశ, ఆశయం ఇప్పుడు పాతవార్తే! బీజమేసిన ఒబామా... అంతరిక్షాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం ఐదేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనతో మొదలైంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నాసాకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఒబామా చేసిన ప్రకటనతో అమెరికాలో సరికొత్త అంతరిక్ష విప్లవం మొదలైంది. బోయింగ్‌తోపాటు స్పేస్ ఎక్స్ ఈ మొత్తంలో సింహభాగాన్ని అందుకున్నాయి. 2017 నాటికల్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోమగాములను చేర్చే లక్ష్యంతో ఈ రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఆర్బిటల్ సైన్స్, మూన్ ఎక్స్‌ప్రెస్ వంటి కంపెనీలు జాబిల్లి పైకి సరుకు రవాణా చేసే ప్రయత్నాల్లో ఉంటే.. ఇంకొన్ని కంపెనీలు గ్రహశకలాల మైనింగ్ వరకూ అనేక అంతరిక్ష వాణిజ్య కలాపాలను చేపడుతున్నాయి. పోటీలతో మరుగైన టెక్నాలజీలు పీటర్ డెమండిస్ అనే బిలియనీర్ స్థాపించిన ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ అంతరిక్ష ప్రయోగాలను వాణిజ్య స్థాయికి చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. భారీ నగదు బహుమతితో పోటీలు పెట్టడం.. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయడం ఈ కంపెనీ లక్ష్యాలు. స్పేస్ ట్రావెల్‌ను సులభతరం చేసే లక్ష్యంతో కొత్త విమానం తయారీకి పెట్టిన పోటీలో కంపెనీలు, ఔత్సాహికులు కూడా పాల్గొన్నారు. ఈ పోటీలో నెగ్గిన విమానం డిజైన్‌ను ప్రైవేట్ కంపెనీ వాడుకుంటూండటం విశేషం. ఎక్స్ ప్రైజ్ పోటీలు అంతరిక్ష రంగంతో మొదలైనప్పటికీ ప్రస్తుతం వాటితోపాటు విద్యుత్తు, రవాణా, పర్యావరణం వంటి అనేక రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గూగుల్, నార్తరప్ గ్రమ్మన్ వంటి ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో చంద్రుడిపై రోవర్ నిర్మాణం వంటి పోటీలు ఇక్కడే జరుగుతున్నాయి. 546... ఇప్పటివరకూ అంతరిక్షంలోకి వెళ్లిన మానవుల సంఖ్య 437.749. రోజులు... రికార్డు స్థాయిలో వాలలీ పోల్యకోవ్ అనే వ్యోమగామి ఖగోళంలో గడిపిన కాలం. రూ. 3000000-10000000 నాసా వెబ్సైట్ ప్రకారం ఓ వ్యోమగామి వార్షిక ఆదాయమిది! రూ.12000000... అంతరిక్షంలో కొద్ది సమయం గడిపేందుకు వర్జిన్ గలాటిక్ సర్వీసెస్ వసూలు చేస్తున్న మొత్తం! ప్రభుత్వాలే అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలన్న భావనకు కాలం చెల్లిపోతోంది. యూవింగో వంటి సంస్థలు క్రౌడ్‌ఫండింగ్ (ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించడం) ద్వారా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గ్రహశకలాల్లో డబ్బే డబ్బు...! ప్లాటినమ్‌తో నిండినవి... భూమ్మీద ఇప్పటివరకూ తవ్వి తీసిన ప్లాటినమ్ కంటే ఎక్కువ మోతాదులో ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలుంటాయి. యుగాలకు సరిపడా వనరులు అపారమైన ఖనిజ వనరులకు నెలవులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశాం.. చేస్తున్నాం కూడా. తాజాగా మనిషి కన్ను అంతరిక్షంపై పడింది. నీటితోపాటు, అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్న గ్రహశకలాలను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్లానటరీ రిసోర్సెస్ వంటి కంపెనీల అంచనాల ప్రకారం... భూమి చుట్టూ ఎడాపెడా తిరుగుతున్న గ్రహశకలాలను సద్వినియోగం చేసుకోగలిగితే... అనంత ఐశ్వర్యాన్ని కళ్లజూడవచ్చు. ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాల ఉపయోగాలివి... ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. పెట్రోలు, డీజిళ్ల అవసరం లేకుండా విద్యుత్ వాహనాలు వాడుకోవచ్చు. పర్యావరణానికి మేలు చేయవచ్చు. 500 మీటర్ల ప్లాటినమ్ గ్రహశకలంలో... 2.9 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్లాటినమ్ గ్రూప్ ఖనిజాలు ఇవి భూమ్మీద ఏటా వెలికితీస్తున్న ప్లాటినమ్‌కు 174 రెట్లు.. ఔన్సు ప్లాటినమ్ ధర... 1500 డాలర్లు (రూ.75,000) జలసిరి గ్రహశకలాలు... ఒక్కో గ్రహశకలంలోని నీటితో ఇప్పటివరకూ ప్రయోగించిన అన్ని రాకెట్లకు కావల్సిన ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. 500 మీటర్ల సైజున్న జల గ్రహశకలం ద్వారా... లక్ష కోట్ల డాలర్ల విలువైన నీరు పొందవచ్చు. ప్రస్తుతం లీటర్ నీటిని అంతరిక్షంలోకి పంపేందుకు 20 వేల డాలర్లు ఖర్చు అవుతోంది. విశ్వంలో నీటితో ఉపయోగాలు సుదూర అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన ఇంధనం తయారు చేసుకోవచ్చు. వ్యోమగాములు పీల్చేందుకు గాలి... తాగేందుకు నీటిని సమకూర్చుకోవచ్చు. మన అవసరాల కోసం అంతరిక్షాన్ని వాడుకునే విషయంలో గ్రహశకలాల మైనింగ్ కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది. భూమ్మీద, అంతరిక్షంలోనూ మనిషి మరింత ఎదిగేందుకు అవసరమైన ప్లాటినమ్ ఖనిజం, నీరు వంటి వనరులను అందించనుంది. వేలకు వేలు... 1500: జాబిల్లికంటే దగ్గరగా ఉన్నవి 8800: ఇప్పటివరకూ గుర్తించినవి. 1000: ఏటా గుర్తిస్తున్న కొత్త గ్రహశకలాలు. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
వివరం: రాక్షస గ్రహంలోకి మానవయానం!
ఒకవే ళ తి-రి-గి-రా-క-పో-తే? వాలెంటీనా గర్యచేవాకు వచ్చిన సందేహం కాదు ఇది. అమె భర్త యూరీ గగారిన్‌కు కలిగిన ఆలోచన! ‘‘నేనొక వేళ తిరిగిరాకపోతే, జీవితాంతం అలాగే ఉండిపోకు’’ అని భార్యకు ఉత్తరం రాసి, అమెకు ఇవ్వకుండా దాచిపెట్టాడు గగారిన్. అంతరిక్షం నుంచి భూమి మీదికి క్షేమంగా తిరిగి వచ్చాకే ఆ ఉత్తరాన్ని తీసి భార్య చేతికి ఇచ్చాడు. అంతకన్నా కానుక ఉంటుందా, భార్యకు భర్త ఇవ్వదగింది... ఈ భూమి మీదైనా, ఆకాశంలోనైనా?! వలవల ఏడ్చేసి భర్తను గట్టిగా కావలించుకుంది వాలెంటీనా. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు యూరీ గగారిన్. ఈరోజు (మార్చి 9) ఆయన జయంతి. ఈ సందర్భంగా - అంగారక గ్రహంలో మానవ ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తూ ప్రపంచ పౌరులను ఊరిస్తున్న ‘మార్స్వన్’ సంకల్పబలానికీ, కొరుకుడు పడని అంగారకుడి స్వభావానికి మధ్య ఎలా లంకె కుదురుతుందని తర్కించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. భార్య వాలెంటీనాతో యూరీ గగారిన్ మొదట మనం బాస్ లాండ్స్‌డార్ప్ కృత నిశ్చయానికి తల వంచి నమస్కరించాలి. ఆ తర్వాత ఎంతకూ అంతుచిక్కని అతడి నిశ్చయంలోని హేతుబద్ధత గురించి తలలు బద్దలు కొట్టుకోడానికి పదేళ్ల సుదీర్ఘ సమయం మనకు ఎలాగూ ఉంటుంది. భూమి నుంచి తక్కువలో తక్కువగా సుమారు 5 కోట్ల 45 లక్షల మైళ్ల ‘సమీపం’లో ఉన్న అంగారక గ్రహంలోకి అడుగు పెట్టి, అక్కడ మానవులు నివసించేందుకు అనువైన ఒక శాశ్వత ఆవాసప్రాంతాన్ని క్రమంగా నిర్మించుకుంటూ పోవాలన్న లాండ్స్‌డార్ప్ పథకం మనలో కొందరికి రాబర్ట్ ఎ హైన్లైన్ మాటను గుర్తుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ‘నెవర్ అండర్‌ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ స్టుపిడిటీ’ అంటాడు హైన్లైన్. (1949 నాటి ఆయన సైన్స్ ఫిక్షన్ నవల ‘రెడ్ ప్లానెట్’.. అంగారక గ్రహంలో ఉండే బోర్డింగ్ స్కూలు విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది). అయితే ‘మార్స్ వన్’ ప్రాజెక్టు రూపకర్త లాండ్స్‌డార్ప్ మరీ అంత బుద్ధిహీనుడు అయివుండే అవకాశం లేదు. అతడో వ్యాపారి. డచ్చి వ్యాపారి. (పచ్చి కాదు, డచ్చే. అంటే నెదర్లాండ్స్). ఇళ్లస్థలాలు కొని అమ్మడం అతడి అభిమతం కానే కాదు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ పట్టభద్రుడైన లాండ్స్‌డార్ప్.. అత్యంత ప్రతిభగల ఇంజినీర్లను, సూక్ష్మబుద్ధిగల శాస్త్రపరిశోధకులను, ఖర్చులకు వెనుకాడని పారిశ్రామిక వేత్తలను ఇసుక, కంకర, సిమెంటుల్లా కలిపి ఉపయోగించుకుని అంగారక గ్రహంపై నివాస గృహాల సముదాయాన్ని నిర్మించి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని తపిస్తున్నాడు. అంతా అతడు అనుకున్నట్లే గనక జరిగితే తొలివిడతగా 2024లో భూమి నుంచి బయల్దేరే ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పౌర వ్యోమగాములు ఎనిమిది నెలల పాటు ప్రయాణించి అంగారకుడిపై కాలుమోపుతారు. తమ వెంట తీసుకువెళ్లిన విడి భాగాలను (మాడ్యూల్స్) క్రమపద్ధతిలో బిగించడం వల్ల రూపొందే ఆవాసాలలో స్థిర నివాసం ఏర్పరచుకుని, తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు. అయితే ఊరికే అలా ఉండిపోరు. రెండేళ్లకొకసారి భూమి నుండి వచ్చి తమలో చేరుతుండే మానవుల కోసం సురక్షితమైన ఆవాసాలు నిర్మిస్తుంటారు. నీటి జాడలను కనిపెడుతుంటారు. ప్రాణవాయువును అందించే మొక్కల్ని పెంచుతుంటారు. ఆహారాన్ని ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవ మనుగడకు ఏం కావాలో వాటన్నిటి కోసం అంగార గ్రహంలో పరిశోధనలు చేస్తుంటారు. బాస్ లాండ్స్‌డార్ప్: మార్సవన్ ఇతడి ఆలోచనే అంతా స్పష్టంగానే ఉంది కదా. ఇక మనం ఎందుకు తల బద్దలు కొట్టుకోవాలి? ఎందుకంటే ఇదంతా సాధ్యమయ్యే పనేనా లేక పనిలేని పనా అని తేల్చుకోవడం కోసం. లాండ్స్డార్ప్ని ఈ ప్రశ్నలకు సమాధానాలు అడగడం భావ్యం కాదు. మరో పదేళ్ల వరకు ఆయన తీరిక లేని మనిషి. 2024లో గుర్రం ఎగరాలంటే ఇప్పటి నుంచే ప్రయాణ ఏర్పాట్లను దౌడు తీయించాలి కదా. కనుక ఆయన దీక్షకు భంగం కలిగించకుండా ఆయన కలల ప్రాజెక్టు ‘మార్స్ వన్’ గురించి కాస్త పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం. అన్నట్టు ఇంత పెద్ద ప్రాజెక్టుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? దీనికి కూడా లాండ్స్‌డార్ప్ ప్లాన్ గీసి పెట్టుకున్నాడు. ఏదైనా ఒక ఇరవై నాలుగు గంటల టీవీ ఛానెల్‌కు రియాలిటీ షో రైట్స్ ఇచ్చి, ఆ షోలో మార్స్ వన్ ప్రాజెక్టు పనులన్నీ ప్రసారం చేయించి, ఆఖర్న అంగారకుడి పైకి దిగిన ఆ నలుగురు భూలోకవాసులనూ చూపించి ఖర్చులకు సంపాదించుకుంటాడట! బెస్ట్ ఆఫ్ లక్ బాస్ లాండ్స్‌డార్ప్. నిజానికి ఇది అత్యంత ప్రమాదకరమైన సాహసం. పైకి వెళ్లడమే గానీ, తిరిగి రావడం అంటూ ఉండదని తెలిసీ తొందరపడుతున్న లక్షలాది మంది ఔత్సాహిక పౌరులు ఈ ప్రాజెక్టుకు ఆజ్యం పోస్తున్నారు. వీరి ఉత్సాహం చూస్తుంటే ఐరోపాను వదిలి పశ్చిమార్థగోళంలోని అమెరికాలో కాలనీలను ఏర్పరచుకోడానికి తొందరపడి వెళ్లి అష్టకష్టాలు పడినవారు గుర్తుకు వస్తారు. మార్స్ పైకి వలస మరీ ఎక్కువగా ప్రమాదాలకు అనువైనది. ఏ అంతరిక్ష వైపరీత్యం వల్లనో చిన్న ముప్పు వాటిల్లినా అక్కడ మానవులు నిర్మించుకున్న కాలనీలు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతాయి. వాటితో పాటు వాటిల్లో ఉండేవారు కూడా. వైపరీత్యాల వరకూ ఎందుకు.. ఆహారాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలలో చిన్న తేడా జరిగినా ‘భోజనం తయారు’ కాక ఆకలికి మలమల మాడిపోవలసిందే. నీటిని తయారు చేసుకునే విధానంలో, నీటి పునర్వినియోగ ప్రక్రియలో వైఫల్యం ఎదురయ్యిందా... తాగేందుకు చుక్క నీరు కూడా కరువైపోతుంది. అయితే ఇవన్నీ తర్వాతి సమస్యలు. బిక్కుబిక్కుమంటూ ఎనిమిది నెలలపాటు వ్యోమనౌకలో ప్రయాణించి అంగారకుడిని చేరుకున్నాక తక్షణం అక్కడి వాతావరణానికి తట్టుకోవడమన్నదే ప్రధాన సమస్య. రేడియేషన్ అంగారకుడిపై మనిషి ఎదుర్కొనే తొలి ప్రాణాంతక సమస్య రేడియేషన్. సౌరవ్యవస్థ లోపల గ్రహాల మధ్య రెండు విధాలైన రేడియేషన్ ఉంటుంది. సోలార్ రేడియేషన్, కాస్మిక్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ సూర్యుడి నుంచి వెలువడుతూ ప్రతి పదకొండేళ్లకొకసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. కాస్మిక్ రేడియేషన్ సౌరవ్యవస్థకు ఆవల సంభవిస్తుండే తారామండల విధ్వంసకర విపరిణామాల నుంచి, కృష్ణబిలాల నుంచి (బ్లాక్ హోల్స్) జనిస్తుంది. ఈ రెండు రేడియేషన్లు కూడా ప్రాణులకు హానిచేసేవే. ఒకసారి మార్స్‌లోకి వెళ్లి వస్తే వ్యోమగాములు ఒక ‘జీమెన్’ యూనిట్‌కు సమానమైన రేడియేషన్‌కు లోనవుతారని ‘నాసా’ అంటోంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో గురయ్యే రేడియేషన్‌కు సమానమైన మోతాదు ఇది! సముద్ర మట్టానికి సమంగా ఉన్న భూభాగంపై ఒక ఏడాది మొత్తం మీద బహిర్గతమయ్యే రేడియేషన్ మిల్లీ జీమెన్ల స్థాయిలో మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి ఒక ‘జీమెన్’ డోసును అర్థం చేసుకోవచ్చు. రేడియేషన్‌కు ఎక్కువగా గురైతే కంటిచూపు పోతుంది. లేదా మందగిస్తుంది. క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఉంటుంది. ఇంత ప్రాణాంతకమైన రేడియేషన్ అత్యధిక స్థాయిల్లో ఉండే మార్స్ గ్రహానికి వెళ్లి బతికిబట్టకట్టే అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్న. కవచాలు ఏవో ఉంటాయి. కానీ అవి ఎంతవరకు కాపాడతాయన్నది ఇంకో ప్రశ్న. ఒకవేళ అన్నీ సవ్యంగా ఉండి, అక్కడ కాపురం పెట్టిన వారికి పిల్లలు పుట్టినా, వాళ్లు సక్రమంగా పుడతారనీ, ఆరోగ్యంగా ఎదుగుతారనీ భరోసా ఏమాత్రం లేదు. మానవ దేహంలో త్వరత్వరగా వృద్ధి చెందుతుండే కణాలపై రేడియేషన్ ఎంతో తేలిగ్గా తన దుష్ర్పభావాన్ని చూపిస్తుంది. పసి శరీరాలపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. రేడియేషన్ వల్ల సంభవించే ఈ దుష్పరిణామాలతో పాటు.. భౌతిక, మానసిక సమస్యలు కూడా ఉంటాయి. భౌతిక సమస్యలు మనిషి మనుగడకు గాలి, నీరు, ఆహారం, ఆవాసం కీలకమైనవి. భూమి మీద లభ్యమయ్యే ఈ జీవితావసరాలలో కనీసం ఒక శాతం కూడా అంగారకుడిలో లేవు! అక్కడ 95 శాతం కార్బన్ డై ఆక్సైడే ఉంది. ఆక్సిజన్ ఒక జాడగా మాత్రమే అంగారకుని పొరల్లో కనిపిస్తుంది. దాన్ని ‘తేలిగ్గా పీల్చుకోగల ఆక్సిజన్’గా మార్చుకుని నిల్వ ఉంచుకోవడం అంత సులభం కాదు. ఆహారం విషయానికి వస్తే ఆవాసంలో మొక్కలు పెంచడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పరిచే విడిభాగాలను మార్స్ వన్ అంగారకుడిలోకి పంపుతోంది. అయితే వాటిలో పెరిగే ఒకే రకమైన శాకాహారాన్నే పదే పదే భుజిస్తుండాలి. జీవులకు బి12 అవసరం కనుక ఈస్టును, దానిని పోలిన ఇతర ఆహారప్రాణులను ఉత్పత్తి చేసుకోవాలి. అవి మొక్కల వల్ల సాధ్యం కావు. చేపల మాటే ఉండదు. పాలు, గుడ్లు మర్చిపోవాల్సిందే. ఆఖరికి చెట్ల నుంచి వచ్చే పప్పులు, పండ్లు కూడా పండవు. మిరియాలుండవు. గసాలు, దాల్చిన చెక్కలు, వెనీలా వంటివేవీ ఉండవు. సుగంధద్రవ్యాలు లేని జీవితంపై మొహం మొత్తదా మరి! మానసికమైన ఒత్తిడులు నీరు, గాలి, ఆహారం, ఆవాసం, విద్యుచ్ఛక్తి, నిర్మాణ సామగ్రి అన్నీ సమకూర్చుకున్నారనే అనుకుందాం. కాలనీ వాసుల జీవితం హాయిగా గడిచిపోతుందనుకోడానికి లేదు. మానసిక ఒత్తిడితో, స్థిమితం తప్పి ఒక్కరు చేసే చిన్న పొరపాటు లేదా తప్పు... మిగతా అందరి ప్రాణాలనూ హరించే ప్రమాదం ఉంది. ఇలాంటి విపత్తు ఏదో ఒక రోజు జరగదని చెప్పలేం. అయితే మనసును ఆహ్లాదకరంగా ఉంచుకునేందుకు ఉన్న ఒక అవకాశం ఏమిటంటే... భూగోళం నుంచి అంగారకుడిలోకి డిజిటల్ మెటీరియల్ క్రమం తప్పకుండా అందుతుంది. అంటే భూమి మీద ఏం జరుగుతున్నదీ ఇక్కడ వీరు వీడియోలో చూడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. అయితే కింద ఉన్న మన కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో గబగబా మాట్లాడ్డం మాత్రం కుదరదు. ఒకసారి ఒక మాట కిందికి వెళ్లాలన్నా, పైకి రావాలన్నా రేడియో తరంగాలు 6 నుంచి 40 నిమిషాల వ్యవధిలో ప్రయాణించవలసి ఉంటుంది. ఉదా: మనం అంగారకుడిలో ఉండి ‘హలో’ అంటే సగటున 20 నిమిషాల తర్వాత మనకు భూమి నుంచి రిప్లయ్ వస్తుంది. అసలు విషయం! ఒకసారి అంగారకుడిలోకి వెళ్లాక మనం మానవులం కాము. అంగారకవాసులం. అక్కడ మన తిండి తినలేం. అక్కడి నుంచి మన మనుషులతో మాట్లాడలేం. ఇరుకు ఆవాసాల్లో కిక్కిరిసిపోయి ఉండాలి. అడవులను చూడలేం. సముద్రాల్ని వీక్షించలేం. నీలాకాశం కనిపించదు. మేఘాలూ ఉండవు. జీవితమంతా (ఎంతవరకూ బతికి ఉంటే అంతవరకూ) చిన్న కలుగులాంటి ఆవాసంలోనో, లేదా దాని చుట్టూతానో తిరుగుతూ గడపాల్సిందే. అంటే నరకంలో! బతికుండగానే నరకం చూడాలనిపిస్తే ఇంతకు మించిన ఆఫర్ లేదు. వెళ్తావా అంగరక! అయితే చెయ్ రా సాహసం డింభకా! అంగారకుడి పైకి వెళ్లేందుకు ఒక ట్రిప్పుకు అయ్యే ఖర్చు: 600 కోట్ల అమెరికన్ డాలర్లు. (మనక్కాదు. నిర్వాహకులకు). భూమి నుంచి అంగారకుడికి చేరడానికి పట్టే సమయం కనీసం 240 రోజులు. అంగారకుడు భూమిలో సగం కంటే కాస్త పెద్దగా ఉంటాడు. అంగారకుడిలో అక్సిజన్ విడిగా లేదు. ఒకప్పుడు ఉండేదేమో కానీ అది నేలలో కలిసిపోయి ఉండాలి. అందుకే అంగారకుని నేల అయిదింట మూడు వంతులు ఎర్రగా తుప్పు పట్టినట్టు (ఆక్సీకరణ కారణంగా) ఉంటుంది. అందుకే అంగారకుడు ఎర్రగా కనిపిస్తాడు. 1969 మార్చిలో అమెరికా పంపిన రోదసీ నౌకలు మారినర్ 6, మారినర్ 7 అంగారకుని సమీపానికి వెళ్లి ఫొటోలు తీసి భూమి పైకి పంపించాయి. వాటి ఆధారంగా అంగారకునిపై వాతావరణం పల్చగా ఉందని తెలుస్తోంది. భూమి మీద లక్ష అడుగుల ఎత్తుగల పర్వతం మీద నించుంటే ఎంత పల్చటి వాతావరణం ఉంటుందో అంగారకుడిపై కూడా అలాంటి వాతావరణమే ఉంది. అంత పల్చగా ఉండడంవల్ల సూర్యుడి నుంచి ప్రసరించే అల్ట్రా వయెలెట్ కిరణాలు సరాసరి వచ్చి అంగారకుడి ఉపరితలాన్ని తాకుతాయి. కొన్ని సందేహాలు- సమాధానాలు ఎవరైనా అంగారకుడిపైకి వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. కానీ మొదటి ట్రిప్ దరఖాస్తు గడువు 2013 ఆగస్టు 31తోనే ముగిసిపోయింది. మరి ఎలా వెళ్లడం? ‘మార్స్ వన్’ మళ్లీ ఆన్లైన్ బుకింగులు మొదలు పెడుతుంది. దరఖాస్తుకు ఎంత ఖర్చవుతుంది? దేశాన్ని బట్టి 5 నుంచి 75 డాలర్ల వరకు ఉంటుంది. (అంటే 300 రూ. నుంచి 5000 మధ్య) ఎంపిక విధానం ఏమిటి? నాలుగు రౌండ్లలో జరుగుతుంది. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుకు అర్హతలేమిటి? కనీసార్హత 18 సం॥నిండి ఉండడం. మిగతావి దేహదార్ఢ్యానికీ, మానసిక స్థితికీ సంబంధించినవి. పరీక్షా విధానం ఏమిటి? చాలా విధాలుగా ఉంటుంది. అవన్నీ కూడా వడపోతలో నిలబడిన వారికే. (పూర్తి వివరాలు www.marsone.comలో లభ్యమౌతాయి.)