మీ కంప్యూటరే షాపింగ్‌మాల్! | computer is like a shopping mall | Sakshi
Sakshi News home page

మీ కంప్యూటరే షాపింగ్‌మాల్!

Published Sun, Oct 20 2013 1:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

మీ కంప్యూటరే షాపింగ్‌మాల్!

మీ కంప్యూటరే షాపింగ్‌మాల్!

 వివరం
  రిటైల్ మార్కెట్ల హవా ఇదివరకటి మాట! ‘ఈ’టైల్ మార్కెట్ల హవా లేటెస్ట్ ట్రెండ్!! ఉప్పు నుంచి పప్పుదాకా...
 పెన్‌డ్రైవ్ నుంచి కెమెరాల దాకా..  గృహోపకరణాల దగ్గర్నుంచీ  వ్యాయామ పరికరాల దాకా.. బోలెడన్ని ఆప్షన్లు ఒక్క క్లిక్కు
 దూరంలో! బయటకు వెళ్లాల్సిన పని లేదు. షాపులన్నీ తిరిగి ఎక్కడ తక్కువకు ఇస్తున్నారోనని లెక్కలు తేల్చుకోవాల్సిన
 కష్టం లేదు. అన్నిటికీ ఆన్‌లైన్ మంత్రమే. ఆర్డరిస్తే చాలు.. ఇంటిముందుకు వస్తువు రెక్కలు కట్టుకు వచ్చి వాలుతుండటంతో
 దేశంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ విలువ ఏటికేడాదీ పెరిగిపోతోంది. 2017 నాటికి భారత ఇ-కామర్స్ మార్కెట్ విలువ
 రూ.లక్ష కోట్ల మార్కు దాటుతుందని అంచనా. ఏ వస్తువునైనా కంటితో చూసి.. చేతితో తాకి తృప్తిచెందాకగానీ
 కొనని భారతీయుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా ఎక్కువ కిందే లెక్క!
 
 ఇ-టెయిలింగ్ ఇండియా ఎక్స్‌పో.. అనే మాట ఎప్పుడైనా విన్నారా! ఈ ఏడాది మొదట్లో ఈ ఎక్స్‌పో (ప్రదర్శన) ముంబైలో జరిగింది. తర్వాత జైపూర్‌లో, బెంగళూరులలోనూ నిర్వహించారు. సెప్టెంబర్‌లో చెన్నైలో, నవంబర్‌లో ఢిల్లీలోనూ మరో రెండు కాన్ఫరెన్స్‌లు జరగనున్నాయి! ఇవే కాదు.. అంతా ఆన్‌లైన్‌మయం అయిన ఈ రోజుల్లో నెట్ ప్రపంచంలో మనకు తెలియకుండా చాలానే జరిగిపోతున్నాయి. గణాంకాలు కావాలా.. ముంబైలో జరిగిన ఎక్స్‌పో కాన్ఫరెన్స్ లెక్కల ప్రకారమైతే మనదేశంలో ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య ప్రస్తుతానికి రెండు కోట్లు. కానీ.. మరో పదేళ్లలో ఈ సంఖ్య 30 కోట్లకు చేరుతుందని ఇ-కామర్స్ నిపుణుల అంచనా. 2000 సంవత్సరం నుంచే మనదేశంలో ఇ-కామర్స్ ఉనికి ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో మాత్రమే అది ఊపందుకుంది. 2008-09 దాకా కూడా ‘ఈ’ట్రెండ్ అంతగా జోరందుకోలేదు. దీనికి కారణం భారతీయుల మనస్తత్వమే. సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొనాలంటే నాలుగైదు షాపులు తిరుగుతాం. అదే వస్తువును వివిధ కంపెనీలు ఏ ధరకు ఇస్తున్నాయో లెక్కలు వేస్తాం. వాటిని కళ్లారా చూసి, తాకిన తర్వాతే డబ్బు కట్టి ఇంటికి తీసుకెళతాం. దీనికి భిన్నంగా ఆన్‌లైన్‌లో వస్తువులను కంప్యూటర్ తెరమీదే చూడాలి. ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వాలి. డబ్బులు డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలి. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉన్నప్పటికీ.. ఇంటికి వచ్చిన వస్తువును విప్పి చూసుకోకముందే డబ్బులు కట్టాలి. మొత్తమ్మీద ఇదంతా రిస్కుతో కూడిన వ్యవహారంలా కనిపించడంతో చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపేవారు కాదు. కానీ, 2010 తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ మరీ అంత ప్రమాదకరమైనదేమీ కాదన్న నమ్మకం చాలామందిలో కుదిరింది. దీనికితోడు, ఉద్యోగ రీత్యా ప్రత్యేకంగా షాపింగ్ చేయలేనంత బిజీ జీవితం.. ఒకవేళ తీరిక కుదిరినా నానా ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో ‘ఇ-ట్రేడింగ్ ’ ఊపందుకుంది. ఇంతకంటే ఓ బలమైన కారణం కూడా ఉంది. మన సహోద్యోగులో, పొరుగువాళ్లో ఆన్‌లైన్లో సక్సెస్‌ఫుల్‌గా షాపింగ్ చేశాక... పర్వాలేదు మనమూ చేయొచ్చు అని ఇన్‌స్పైర్ అయిన వారు కూడా ఉన్నారు. వీటన్నిటికీ మించి.. అంతకుముందు భారతీయ పట్టణ యువతకు మాత్రమే క్రెడిట్/డెబిట్ కార్డులు, కంప్యూటర్లు ఇంటర్‌నెట్ వంటివి అందుబాటులో ఉండేవి. ఇటీవలికాలంలో స్మార్ట్‌ఫోన్ల విప్లవం పుణ్యమా అని పల్లెప్రాంతాలకు సైతం ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తోంది. ఇది కూడా ఆన్‌లైన్ ట్రేడింగ్ పెరగడానికి దోహదం చేసింది. అదీకాక.. ఈ స్మార్ట్‌ఫోన్లను వాడే వారంతా యువత కావడం ఆన్‌లైన్ ట్రేడింగ్ ట్రెండ్‌కు మరింత ఊతమిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వందలకొద్దీ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లున్నాయి. కానీ, వాటిలో.. ఏటా 100 మిలియన్ డాలర్లకు పైగా విక్రయాలు జరిపే ఫ్లిప్‌కార్ట్ లాంటి నమ్మకమైన సైట్లు దాదాపు 80 మాత్రమే. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డవారు సగటున నెలకు రెండు నుంచి మూడుసార్లు కొనుగోళ్లు జరుపుతున్నట్టు ఒక అధ్యయనం. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుత ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య రెండుకోట్లు అనుకున్నా.. ఆరు కోట్ల కొనుగోళ్లు అధికంగా నమోదవుతాయన్నమాటే.
 టిక్కెట్లూ...
 వస్తువులే కాదు.. టిక్కెట్లు కొనడమూ ఆన్‌లైన్ ట్రేడింగ్ కిందకే వస్తుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడానికి సందేహించేవారు సైతం.. బస్సు, రైలు, సినిమా టిక్కెట్లను అలవోకగా ఆన్‌లైన్‌లో బుక్ చేసేస్తారు. మొబైల్ రీచార్జ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కిందికే వస్తాయి. వీటిలో ఏమైనా మోసం జరుగుతుందేమోనన్న భయం వారికి అస్సలు ఉండదు. కారణం.. ఐఆర్‌సీటీసీ, ఆర్టీసీ వంటి నమ్మకమైన వెబ్‌సైట్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేస్తారు కాబట్టి. అదే వస్తువుల విషయానికి వచ్చేసరికి ‘‘ఆన్‌లైన్‌లో కొంటే సెకండ్ హ్యాండ్‌వి, పాడైపోయినవి, పనికిరానివి అంటగడతారేమో’’ అనే ఆందోళన చాలా మందికి ఉంటుంది. అలాగే.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు డెబిట్/క్రెడిట్ కార్డు నెంబర్ వంటివి ఎంటర్ చేయడానికి భయపడి కూడా కొందరు ‘ఇ-కొనుగోళ్ల’ పట్ల అంత ఆసక్తి చూపరు.
 
 కానీ, అలాంటి భయాలు అనవసరం. నమ్మకమైన సైట్లలో కొనుగోలు చేస్తే ఎలాంటి భయాలకూ తావుండదు. వారంటీతో సహా, చక్కటి ప్యాకింగ్‌లో తక్కువ సమయంలో మనం ఆర్డర్ చేసిన వస్తువులు చేతికందుతాయి. సైట్‌లో చూసినట్టుగా లేకపోయినా, పనితీరులో ఏవైనా లోపాలున్నా మామూలు దుకాణాల్లోలాగానే పదిహేను రోజుల్లోగా తిరిగిచ్చే (కొన్నిరకాల వస్తువులైతే వాడకుండా) సదుపాయం ఆన్‌లైన్‌లో కూడా ఉంది. అంతేకాదు.. చాలా ఇ-షాపింగ్ సైట్లలో క్యాష్ బ్యాక్ గ్యారంటీ లబ్ధి కూడా లభిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన వస్తువును వీలైనంత వేగంగా వారికి అందేలా చేయడం, దుకాణం-దుకాణ నిర్వహణ వంటి ఖర్చులు లేకపోవడం వల్ల షాపులతో పోలిస్తే భారీ డిస్కౌంట్లతో.. మరింత తక్కువ ధరలకే ఇవ్వడం వంటి పథకాలతో ఈ సైట్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
 
 చూసేవి గాడ్జెట్స్.. కొనేవి దుస్తులు
 మన దేశంలో ఆన్‌లైన్ షాపర్లు ఎక్కువ ఆసక్తితో సెర్చ్ చేసే వస్తువులు.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు. కానీ ఎక్కువగా కొనేది మాత్రం దుస్తులు. 2012 నవంబర్‌లో టీఎన్‌ఎస్ ఆస్ట్రేలియా గూగుల్ ఇండియా తరఫున ఈ సర్వే నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో నమూనాగా యువత ఆన్‌లైన్ లావాదేవీల తీరుతెన్నులను విశ్లేషించింది.
     ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎక్కువగా కొనుగోలు చేసే వస్తువులు.. దుస్తులు (84%), ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు (71%), సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు(64%), పుస్తకాలు(62%), గృహోపకరణాలు (61%). పిల్లల ఆటబొమ్మలు, అలంకరణ సామగ్రి, ఆరోగ్య ఉపకరణాలు.. ఇటీవల నెలవారీ సరుకులు కూడా ఆన్‌లైన్ ద్వారా ఆర్డరిచ్చి తెప్పించుకుంటున్నారు.
 
     ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నవారిలో 30% తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఈ కొనుగోళ్లు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం అంటే ఇదేనేమో!!
 
     ఆన్‌లైన్ ద్వారా వస్తువుల్ని కొనుగోలు చేసేవారిలో 74% క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతికే మొగ్గు చూపుతుండగా.. 18% డెబిట్‌కార్డు, 5% క్రెడిట్‌కార్డు వాడుతున్నారు.
 
 ఇవీ లాభాలు...
 సంప్రదాయ షాపింగ్‌తో పోలిస్తే.. ఆన్‌లైన్ షాపింగ్‌కి బోలెడు సౌలభ్యాలున్నాయి. మచ్చుకి కొన్ని..
 
 సౌకర్యం: ఎండా, వానా, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.. ఈ గొడవలేవీ ఉండవు. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆర్డరిస్తే కోరిన వస్తువు గుమ్మం వద్దకే వస్తుంది.
 
 వెరైటీ: ఒకే ఉత్పత్తి ఎన్నిరకాల రంగుల్లో, సైజుల్లో లభ్యమవుతోందో వివరంగా చూడొచ్చు. షాపులో అయితే అన్నిరకాలు ఉండవు, ఉన్నా సేల్స్‌మెన్ అన్నీ మనకు చూపించొచ్చు. చూపించకపోనూ వచ్చు. అదే ఆన్‌లైన్‌లో అయితే.. కంప్యూటర్ మనది, మౌస్ మనది.
 
 ధర: ఒకే వస్తువు ధర వివిధ సైట్లలో ఎలా ఉందో పోల్చిచూసుకోవచ్చు. చాలావరకూ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే దృష్ట్యా చెప్పుకోదగిన తక్కువ రేట్లకే వస్తువులను విక్రయిస్తారు.
 
 రివ్యూ: ఇది అన్నిటి కన్నా ముఖ్యమైనది. ఏదైనా వస్తువు కొనడానికి ముందు చాలా మంది చేసేపని.. గతంలో అదే వస్తువును కొని, వాడినవారు ఎవరైనా ఉన్నారా అని. వారి అనుభవాల ఆధారంగా సదరు వస్తువుపై ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అలా తెలుసుకోవడమే లక్ష్యమైతే.. అందుకు ఆన్‌లైన్‌ను మించిన సాధనం లేదు. నెట్లో రకరకాల వస్తువులపై నిత్యం వేలాదిగా రివ్యూలు వస్తూనే ఉంటాయి. వాటిని చదివి మనకు ఏది కావాలో నిర్ణయించుకోవడం తేలికవుతుంది. వస్తువు పనితీరుపైనే కాదు, మీరు షాపింగ్ చేస్తున్న వెబ్‌సైట్  క్రెడిబిలిటీ రివ్యూలు కూడా ఉంటాయి. దాన్నిబట్టి అందులో షాపింగ్ చేయాలా వద్దా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒక విలువైన మాట... ఆన్‌లైన్లో ఏమేం దొరుకుతాయో చెప్పడం ఈజీయే గానీ ఏం దొరకవో చెప్పడం కష్టం. ఎందుకంటే కూరగాయలతో సహా అన్నీ అమ్మేస్తున్నారు.
 
 స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి...
 లను పెంచుకుంటున్నాయి. ఉదాహరణకు కండోమ్‌లు, లోదుస్తులు, కామసూత్ర వంటి పుస్తకాలు ఆన్‌లైన్లో బాగా కొంటున్నారు. ఈమధ్యనే ఇలాంటి వాటికోసమే షైకార్ట్.కామ్ పుట్టింది! కొన్ని వస్తువులు ఆఫ్‌లైన్లో కొనాలంటే ఇబ్బంది. అందుకే అవి ఆన్‌లైన్లో అమ్మకాచెప్పులు, కళ్ల జోళ్లు సైజు చెక్ చేసుకునేవి కదా అని కొందరికి అనుమానం. వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. చెప్పులైతే పర్మనెంట్ సైజు కాబట్టి తేడారాదు. కళ్లజోళ్లకు మన ఆకారంలోని ముఖాలతో ఆన్‌లైన్లో చెక్ చేయొచ్చు.
 
     వస్తువులు చాలా జూమ్‌లో చూసే అవకాశం ఉండటం వల్ల షాపులో కంటే క్లియర్‌గా ఉంటుంది. దుస్తులు వంటివైతే మోడల్స్‌కి వేసి ఫొటోలు పెడతారు కాబట్టి అవి ధరిస్తే ఎలా ఉంటాయో కూడా తెలిసిపోతుంది.
 
     పిల్లల వస్తువులు, దుస్తుల కోసమే పెద్ద సైట్లున్నాయి.  బొమ్మలు వాటిలో కొనడమే కరెక్టు. అమ్మాయిలకు ఏం కొనాలి, అబ్బాయిలకు ఏం కొనాలి... ఏ వయసు వారికి ఏది కొనాలఉంటారు. న్నది శాస్త్రీయంగా నిర్ణయించి
 
 బెస్ట్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు...
 ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులు నెట్‌లో డెబిట్/క్రెడిట్ కార్డులు ఉపయోగించి వస్తువులు కొనే సంఖ్య తక్కువ. దానికి కారణం నమ్మకం లేకపోవడం. ఒకసారి ఆ నమ్మకం చిక్కాక మాత్రం మనవాళ్లు కూడా విదేశీయులకు ఏమాత్రం తీసిపోకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లు జరుపుతారు. అలాంటి నమ్మకమైన టాప్-5 సైట్లు..
 
 ఫ్లిప్‌కార్ట్ (www.flipkart.com)
  ఈ-బే (www.ebay.in)
  హోమ్‌షాప్-18 (www.homeshop18.com)
  యెభి (www.yebhi.com)
 జబాంగ్ (www.jabong.com)
 
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
 
 ప్రముఖ వెబ్‌సైట్లలో కొనేటప్పుడు పెద్దగా ఇబ్బందులు ఎదురవవుగానీ.. మనకు నచ్చిన వస్తువు, నచ్చిన ధరలో ఇతర వెబ్‌సైట్‌లో కనిపించినప్పుడు తొందరపడి కొనుగోలు చేయకూడదు. ఆ సైట్ వివరాలను  పరిశీలించాలి. ‘అబౌట్ అజ్’ విభాగంలో పూర్తి అడ్రస్, ఈమెయిల్, 1800తో మొదలయ్యే (లేదా) మరో స్పష్టమైన ఫోన్ నెంబర్ ఉంటేనే ఆసైట్ ద్వారా కొనుగోలు చేయండి. కొనే ముందు వారికి ఓ ఫోన్ కాల్ చేసి ఎన్ని రోజుల్లో ఇస్తారు, నచ్చకపోతే ఎలా తిరిగి పంపాలి వంటి వివరాలు తెలుసుకునే కొనాలి.
 
     ఒకే వస్తువు రేటు వివిధ సైట్లలో ఎలా ఉందో పరిశీలించాలి. వస్తువు సరఫరా ఏ సైట్‌వారు వేగంగా చేస్తారో నిర్ధారించుకోవాలి. ఆయా సైట్లలో ఉన్న యూజర్ రివ్యూల ద్వారా ఆ విషయం తెలుసుకోవచ్చు.
 
     కొనుగోలు చేసిన వస్తువు నచ్చకుంటే, వెనక్కి తిరిగిచ్చే వీలుందా? ఉంటే అందుకు ఏయే షరతులున్నాయో ‘రిటర్న్ పాలసీ’ ద్వారా తెలుసుకోవాలి.
 
     కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్‌లైన్‌లో కంటే బయటి మార్కెట్లోనే తక్కువకు దొరుకుతాయి. మార్కెట్లో అదే వస్తువు ఎంతకు దొరుకుతుందో వాకబు చేయాలి. ఒకవేళ తక్కువగా ఉందనిపిస్తే బయటే కొనుక్కోవడం మేలు.
 
     10 % డిస్కౌంటు.. 20% డిస్కౌంటు అని ఆయా సైట్లు చెప్పే కబుర్లను నమ్మక్కర్లేదు. ఎందుకంటే ఆ డిస్కౌంట్లన్నీ ఆయా వస్తువుల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) మీద మాత్రమే ఇస్తారు. ఆమాత్రం తక్కువ ధరకు బయటకూడా దొరికితే బయటే కొనుక్కోవడం మంచిది.
 
     డెబిట్/క్రెడిట్ కార్డులపై ముందే చెల్లింపులు జరిపే కన్నా.. వీలైనంతవరకూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కొన్ని సైట్లు ఈ విధానంలోనూ ఇంటి వద్ద డెబిట్/క్రెడిట్ కార్డులపై చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి.
 
 -పకాష్ చిమ్మల

Advertisement
Advertisement