కృష్ణుడి శిరోవేదన! | funday special story | Sakshi
Sakshi News home page

కృష్ణుడి శిరోవేదన!

Published Sat, Jun 3 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

కృష్ణుడి శిరోవేదన!

కృష్ణుడి శిరోవేదన!

అది ద్వారకలోని శ్రీకృష్ణమందిరం. రుక్మిణీ సత్యభామలు ఎందుకో తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నారదులవారు కృష్ణభగవానుడిని చూడటానికని వచ్చారు. రుక్మిణీ సత్యభామలు ఏడుస్తూ వెళ్లి ఆయన పాదాలముందు ప్రణమిల్లారు. ‘‘లెండమ్మ! లెండి... ఎందుకిలా ఉన్నారో చెప్పండి. మీకేం భయం లేదు. నేనున్నానుగా’’ అంటూ అనునయంగా అడిగారు.

‘‘ఏం చెప్పమంటారు స్వామీ! మా నాథుడు భరించలేనంతటి శిరోవేదనతో బాధపడుతున్నారు. దయచేసి తరుణోపాయం సెలవివ్వండి’’ అన్నారు.  ‘‘నారాయణ నారాయణ! అది మామూలు తలనొప్పి కాదు. బహుశా శత్రువులెవరో చేయించిన ప్రయోగం అయి ఉంటుంది.   నిజమైన భక్తులు ఎవరైనా, తమ పాదధూళిని మంచి నీటితో కలిపి ఆయనతో తాగిస్తే సరి.’’ అన్నాడు నారదుడు.

ఆ మాటలు వింటూనే, ‘‘రామ రామ! జగాలనేలే ఆ స్వామికి మా పాదధూళి కలిపిన నీటిని ఇవ్వడమా... సర్వపాపాలూ మమ్మల్ని చుట్టుకోవూ?’’’అంటూ గట్టిగా చెవులు మూసుకున్నారు.
కృష్ణుడు మూలుగుతూనే, ‘‘పోనీ, రేపల్లెకు వెళ్లి గోపికలకు విషయం తెలియజెప్పి రండి’’అంటూ మూలుగులు అధికం చేశాడు. నారదుడు వెంటనే రేపల్లె వెళ్లాడు. ఆయన్ని చూస్తూనే గోపికలందరూ ‘‘స్వామీ! మా కృష్ణయ్య కుశలమేనా’’ అంటూ అడిగారు,

నారదుడు విచారంగా ముఖం పెట్టి, ‘‘ఏం చెప్పమంటారమ్మా! కృష్ణుడు అమితమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. అది తగ్గాలంటే ఎవరైనా భక్తులు తమ పాదధూళిని మంచినీటిలో కలిపి, దానిని కృష్ణుడిచేత తాగించాలి’’ అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే ఓ గోపిక తన పాదధూళిని తీసి దానిని అక్కడ ఉంచింది. తక్కిన గోపికలందరూ కూడా తమ పాదధూళిని తీసి అక్కడ వేశారు. అంతా కలిపి ఒక గుట్టలా తయారైంది. దానిని జాగ్రత్తగా తీసి మూటగట్టుకున్నాడు నారదుడు.  ‘‘దీనితో కృష్ణుడి శిరోవేదన తగ్గిపోతుంది.

కానీ మీరందరికీ రౌరవాది నరక బాధలు తప్పవు మరి’’ అన్నాడు నారదుడు. ‘‘మా కన్నయ్య తలనొప్పి తగ్గిపోతే మాకదే చాలు స్వామీ!’’ అన్నారు అందరూ ముక్తకంఠంతో. మెచ్చుకోలుగా వారివైపు చూస్తూ నారదుడు ఆకాశమార్గాన వెళ్లి జరిగినదంతా చెబుతూ కృష్ణుడిముందు ఆ మూటను ఉంచాడు. కృష్ణుడు మూటవిప్పి ఎంతో ప్రియంగా ఆ ధూళిని తలకు రాసుకుని నొప్పి తగ్గిపోయిందంటూ ఆనందంగా లేచి కూర్చున్నాడు. అప్పటివరకూ తమకన్నా ఎక్కువ ఏముందని కృష్ణుడు ఆ గొల్లపడుచుల వెంటపడుతున్నాడు అనుకుంటున్న రుక్మిణీ సత్యభామా సిగ్గుతో తలలు వంచుకున్నారు.

Advertisement
Advertisement