
అందాల చందనపు బొమ్మ
న్యూ కాలెడోనియా
కెప్టెన్ జేమ్స్ కుక్ 1774లో తొలిసారిగా ఈ భూభాగాన్ని కనుగొన్నాడు. పెద్దగా బయటి ప్రపంచానికి తెలియని కాలెడోనియా... గంధపు చెట్ల వలన ప్రాచుర్యంలోకి వచ్చింది. కొంతకాలానికి గంధపు చెట్ల వ్యాపారం తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత ఇక్కడ బానిసల వ్యాపారం ఎక్కువగా జరిగింది. క్వీన్‌లాండ్, ఫిజీలలో చెరకు తోటల్లో పని చేయడానికి ఇక్కడి నుంచి శ్రామికులు, బానిసలను తీసుకువెళ్లేవారు. ఈ బానిసలను ‘కనక్’ అని పిలిచేవారు. 20శతాబ్దపు ప్రారంభంలో బానిసల వ్యాపారాన్ని నిషేధించారు.
న్యూ కాలెడోనియా 1853లో ఫ్రెంచ్ వలస రాజ్యాంగా మారింది. చాలా కాలం పాటు ఫ్రెంచ్‌వారి పీనల్ కాలనీగా ఉండి పోయింది. నేరగాళ్లతో పాటు రాజకీయ ఖైదీలను... మొత్తం ఇరవై రెండు వేల మందిని కాలెడోనియాలో బంధించింది ఫ్రెంచ్ ప్రభుత్వం. 1864లో డిహాట్ నది ఒడ్డున నికెల్ నిల్వలను కనుగొన్నారు.
నికెల్ గనులలో పని చేయించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం ఇరుగు పొరుగు దీవులు, జపాన్ నుంచి శ్రామికులను తీసుకొచ్చింది. యురోపియన్ల వలసలకు ప్రోత్సాహం ఇచ్చింది. యురోపియన్లు తమతో పాటు రకరకాల వ్యాధులను కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ వ్యాధుల ప్రభావంతో వేలాది మంది కనక్‌లు చనిపోయారు. వారి జనాభా చాలా తగ్గిపోయింది. 1930 నాటికిగాని జనాభా పెరుగుదలలో వృద్ధి కనిపించలేదు.
కాలెడోనియా చరిత్రలో ‘భూమి’ కీలక పాత్ర పోషించింది. వలస వచ్చిన వారికి, స్థానికుల మధ్య ఘర్షణలు జరగడానికి భూమి సమస్య కారణమైంది.
‘పీనల్ కాలనీ’ని మూసి వేసిన ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆ తరువాత ఇక్కడికి వలసలను ప్రోత్సహించడానికి ఉచితంగా భూమి ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది స్థానికులకు, వలస వచ్చిన వారికి మధ్య ఘర్షణలు పెంచింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కనక్‌లకు స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది. ఓటు హక్కు వచ్చింది. ఈ మార్పుతో రాజకీయాలలో కీలక మార్పులు సంభవించాయి.
కనక్‌లు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం మొదలైంది. ప్రత్యేక హక్కుల కోసం నినదించడం మొదలైంది. ‘యునెటైడ్ నేషన్స్ లీస్ట్ ఆఫ్ నాన్-సెల్ఫ్-గవర్నింగ్ టెరిటరీస్’లో 1986లో న్యూ కాలెడోనియా పేరు చోటు చేసుకుంది. 1987లో న్యూ కాలెడోనియాలో ‘ఇండిపెండెన్స్ రెఫరెండం’ నిర్వహించారు. ‘ఫ్రాన్సులో భాగంగా ఉంటారా?’ ‘స్వాతంత్య్రం కావాలా?’ అంటూ రెండు అవకాశాలు ఇచ్చారు. 1.7 శాతం మాత్రమే స్వాతంత్య్రానికి అనుకూలంగా ఓటు వేశారు.
అంతమాత్రాన... స్వాతంత్య్రభావాలకు కాలం చెల్లలేదు. మరోసారి రెఫరెండం నిర్వహించమంటూ డిమాండ్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఫ్రెంచ్ రిపబ్లిక్‌కు సామంత రాజ్యంగా ఉన్న న్యూ కాలెడోనియాలో 2018లో మరోసారి రెఫరెండం జరగనుంది. ఈసారి స్వాతంత్య్రానికి అనుకూలంగా మొగ్గు చూపేవారు అత్యధికంగా ఉంటే... న్యూ కాలెడోనియాలో కొత్త చరిత్ర మొదలవుతుంది.
టాప్ 10
1. {ఫెంచ్, ఇంగ్లిష్‌లతో సహా ముప్పై వరకు ప్రాంతీయ భాషలు న్యూ కాలెడోనియాలో మాట్లాడతారు.
2. ప్రతి సంవత్సరం లక్షమంది వరకు విదేశీ పర్యాటకులు వస్తారు.
3. ప్రధాన ఎగుమతులు... నికెల్, రొయ్యలు
4. న్యూ కాలెడోనియాలో 88 రకాల పక్షుల జాతులు ఉన్నాయి.
5. న్యూ కాలెడోనియా జాతీయ పక్షి: కాగు
6. ఆస్ట్రేలియాకు 700ల మైళ్ల దూరంలో ఉంటుంది న్యూ కాలెడోనియా.
7. మౌఖికంగా కథలు చెప్పే సంప్రదాయం ఇప్పటికీ బలంగా ఉంది.
8. న్యూ కాలెడోనియా దారు శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
9. కనక్, ఫ్రెంచ్... న్యూ కాలెడోనియాకు రెండు అధికార పతాకాలు ఉన్నాయి.
10. న్యూ కాలెడోనియాను పరిపాలన పరంగా మూడు ప్రావిన్సులుగా విభజించారు.