
పచ్చని కల!
ఆదర్శం
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. రికిన్ గాంధీ విషయంలో అది నిజమని తేలింది. న్యూజెర్సీలో పుట్టి పెరిగిన రికిన్... ఎప్పుడూ ఆకాశం వైపు చూసేవాడు. ఎందుకంటే పైలట్ కావాలనేది కల. కానీ దైవం మరొకటి తలచినట్లుంది. అందుకే పెద్దయ్యాక అతను భూమి వైపు చూశాడు. ఎండి పోయిన పంట పొలాల వైపు చూశాడు. రైతు కళ్లల్లోని నీళ్ల వైపు చూశాడు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్ కుమారుడైన గాంధీకి చిన్నప్పట్నుంచీ అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై మక్కువ ఎక్కువ. వాటి గురించి ఏ చిన్న సమా చారం పేపర్లో వచ్చినా కట్ చేసుకొని భద్రపరుచుకునేవాడు. ఆస్ట్రోనాట్స్ జీవిత చరిత్రలను శ్రద్ధగా చదివేవాడు. వారిలాగా తనూ ఆకాశంలో ఎగరాలని తపించేవాడు. కానీ ఓ చిన్న కంటి సమస్య అతని కలకు అడ్డుపడింది. లేజర్ సర్జరీ చేయించుకుని తన చిరకాల లక్ష్యాన్ని అందుకోవాలను కున్నాడు. ఈలోపు బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్‌చ ల్యాబ్‌లో కొన్నాళ్లు పనిచేయడానికని ఇండియా వచ్చాడు. ఆ క్రమంలో తన మిత్రుడితో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగాడు. అది అతడి లక్ష్యాన్ని అమాంతం మార్చేసింది.
గ్రామాలను చూడడం రికిన్‌కి అదే మొదటిసారి. వెళ్లిన చోటల్లా రైతులు తారసపడేవారు. భూములు ఎండి, పంటలు పండక తాము పడుతున్న కష్టాల గురించి చెబుతుండేవారు. వారి దీనస్థితి రికిన్ మనసును కదిలించింది. ‘వీరి కోసం నేనేమీ చేయలేనా?’ అని ఎంతో ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘డిజిటల్ గ్రీన్’ స్వచ్ఛంద సంస్థ.
ఏదో ఒకటి చేసి రైతుల సమస్యలు తీర్చే తీరాలనుకున్న రికిన్, అందుకు తగ్గ ప్రణాళికల్ని పక్కాగా వేసుకున్నాడు. డిజిటల్ గ్రీన్ సంస్థకు పునాది వేశాడు. వీడియోల ద్వారా రైతుల సమస్యలను రికార్డ్ చేయడం, పరిష్కారాలను వీడియోల ద్వారానే రైతులకు చేర్చడం, సక్సెస్ స్టోరీలను హైలెట్ చేయడం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా ప్రశ్న-జవాబుల కార్యక్రమం నిర్వహించి నిపుణుల ద్వారా రైతులకు సలహాలు అందించడం ‘డిజిటల్ గ్రీన్’ లక్ష్యం.
ఇప్పటివరకు 2,600 వీడియోలను 7 రాష్ట్రాల్లో, రెండు వేలకు పైగా గ్రామాల్లో,1,50,000 మందికి పైగా రైతులు చూశారు. ఎనిమిది నుంచి పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలు... పంటలను ఎలా పండించాలి, ఉత్పత్తి పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి వంటి పలు అంశాలను వివరిస్తాయి. అది మాత్రమే కాదు. పంటలు పండక, నిరాశ పెరిగి, ఇక వ్యవ సాయం చేయడమే దండగ అనిపించి నప్పుడు ఆ నిస్పృహను ఎలా మనసు నుంచి పారద్రోలాలో చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలూ ఉంటాయి. వీటితో పాటు రైతుల విజయగాథలు మిగతా రైతులకు ఆత్మస్థైర్యాన్నిస్తున్నాయి.
‘‘ఈ వీడియోల పుణ్యమా అని పంట ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది’’ అని ఎవరైనా రైతు చెబితే... తాను చేస్తోన్న పని మీద మరింత గౌరవం కలుగుతుందంటాడు గాంధీ. ఈ ఆనందంలో పైలట్ కావాలన్న లక్ష్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. రైతుల కంట తడి కాకుండా సంతోషం చూడటమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నాడు. ఢిల్లీలోని తన ఆఫీసులో రైతులతో సంభాషించడం, వ్యవసాయంపై వచ్చిన తాజా పుస్తకాలను చదవడం ఇప్పుడు గాంధీకి ఇష్టమైన పని.
‘‘కొందరు రైతులు వ్యవసాయం చేస్తూ, మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కొందరు రైతులు లాభాలు గడించకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏమిటీ వైరుధ్యం అనిపించింది. సమస్య ఇక్కడే ఉంది. సమాధానం ఇక్కడే ఉంది. ఆ సందేహాన్ని, సమాధానాన్ని ఒక్కచోట చేరిస్తే ఎంతోమంది రైతులకు ప్రయోజనం ఉందనిపించింది. అదే లక్ష్యమైంది. అదే నా జీవితమైంది’’ అంటాడు గాంధీ.
వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడి ఉన్న ఇండియాని ఆ దిశగా ముందుకు నడిపించ డమే ప్రస్తుతం రికిన్ కంటోన్న పచ్చటి కల. ఆ కల నిజమవ్వడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!
ఆ స్ఫూర్తితో...
అంతరిక్షయానం చేసిన కొందరు పై నుంచి భూమిని చూసి... ఇంత అందమైన, అద్భుతమైన గ్రహంపై యుద్ధాలు, పేదరికం ఉండడం దురదృష్టం అనుకున్నారట. భూమి మీదికి వచ్చిన తరువాత సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపాధ్యాయులుగా మారారట. కొందరయితే వ్యవసాయం కూడా చేశారట. ఇలాంటివన్నీ చదివిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని, అదే ‘గ్రీన్ డిజిటల్’ స్థాపనకు దారితీసిందని చెబుతుంటాడు రికిన్. ఎవరినో చూసి అతడు స్ఫూర్తిని పొందాడు. ఇప్పుడు తనే ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడు!