గౌతమ్‌కి ఫ్యాన్ అయిపోయా...
గౌతమ్‌కి ఫ్యాన్ అయిపోయా...
Published Mon, Jun 5 2017 1:06 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
అనాథలకు ‘స్టార్’ వంటకాలు
రుచి చూపిస్తున్న ఉలవచారు రెస్టారెంట్
సామాజిక సేవలో మేము సైతం అంటున్న నిర్వాహకులు
మహానగరంలో అనాథలు ఎందరో. ఎక్కడో పుట్టి.. ఇక్కడ అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులెందరో. అందరిలా వారికీ పసందైన రుచులను ఆస్వాదించాలని ఉంటుంది. కానీ వారికిది సాధ్యమేనా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ... ‘స్టార్’ వంటకాలను వారి చెంతకు చేరుస్తూ... సేవా రుచిని చాటుకుంటోంది జూబ్లీహిల్స్‌లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్.
హైదరాబాద్: సామాజిక సేవలో తాము సైతమంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు వినయ్, విజయ్. నగరంలోని అనాథాశ్రమాల్లో నెలకు ఒక ఆశ్రమాన్ని ఎంచుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడీ’ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి చిన్నారులతో రోజంతా సరదాగా గడిపారు. రెస్టారెంట్‌లో స్పెషల్‌గా చేయించిన బిర్యానీ, కోడి వేపుడు, చికెన్ కర్రీ, పచ్చి పులుసు, గుత్తి వంకాయ కర్రీ, ఆలు కుర్మా, వెనిలా మిల్క్‌షేక్, చాకొలెట్ ఐస్‌క్రీం, బాదుషా స్వీట్... తదితర పసందైన వంటకాలను చిన్నారులకు రుచి చూపించారు. వినయ్, విజయ్ నేరుగా పిల్లలకు వడ్డించి వారి సేవా దృక్పథాన్ని చాటారు. వీరితో పాటు సినీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించారు. సేవ చేయడమంటే తనకెంతో ఇష్టమని, అందుకే వీరితో కలిసి వచ్చానని సురేందర్‌రెడ్డి చెప్పారు. అనాథాలను అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సర్వ్ నీడీ’ అనాథాశ్రమ నిర్వాహకులు గౌతమ్‌కుమార్‌ను ఈ సందర్భంగా అభినందించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సామాజిక సేవ.. మన బాధ్యత
సామాజిక సేవ అందరి బాధ్యత అంటారు వినయ్, విజయ్. సందర్భానుసారంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వీరు సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ఆహారం అందజేశారు. హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించే పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
గౌతమ్‌కి ఫ్యాన్ అయిపోయా...
ఎప్పుడూ షూటింగ్‌తో బిజీగా ఉండే నేను.. తీరిక చూసుకొని అనాథాశ్రమాలకు వెళ్తుంటాను. నా భార్య దీపకు కూడా సేవా కార్యక్రమాలంటే ఇష్టం. అందుకే ఇద్దరం కలిసి వెళ్తుంటాం.. చేస్తుంటాం. అనాథల కోసం ఇంత చేస్తున్న గౌతమ్‌ని చూశాక.. ఆయనకు నేను ఫ్యాన్ అయిపోయాను. తమ బాధ్యతగా ‘ఉలవచారు’ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. ప్రతి సంస్థ ఇలాగే ముందకురావాలి. సమాజ సేవ చేయాలి.
– సురేందర్‌రెడ్డి, సినీ దర్శకుడు
Advertisement
Advertisement