
సురక్షిత బాల్యంతోనే సురక్షిత భారత్..
నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి.. నగరంలో ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: సురక్షిత బాల్యం అందించగలిగితే సురక్షిత భారత్ సుసాధ్యమేనని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. ఏ దేశానికైనా బాలలే పునాదిరాళ్లని, భావిభారత పౌరుల పరిరక్షణ సమాజ బాధ్యత అని అన్నారు. హింసకు తావులేని బాల్యాన్ని అందివ్వడం మనందరి కర్తవ్యం అని తెలిపారు. ‘‘సురక్షిత్ బచ్‌పన్, సురక్షిత్ భారత్’’ పేరుతో సెప్టెంబర్ 11న కైలాశ్ సత్యార్థి కన్యాకుమారిలో ప్రారంభించిన భారత్‌యాత్ర బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది.
11 వేల కిలో మీటర్ల ఈ యాత్ర అక్టోబర్ 16న రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటుంది. రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో కైలాశ్ యాత్రకు ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునితా కృష్ణన్, బ్రదర్ వర్గీస్, పలువురు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఘన స్వాగతం పలికారు. 1,000 మంది విద్యార్థులు, నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న 50 మంది ఆరాంఘర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడ్డారు. యాత్రలో సత్యార్థితోపాటు ఆయన సహచరి సుమేధ ఉన్నారు.
అక్కడి నుంచి శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు వందలాది మంది బాలబాలికలు కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో కైలాశ్ మాట్లాడుతూ అత్యాచారాలకు, అక్రమ రవాణాకు గురైన పిల్లలందరూ తన సొంత బిడ్డలతో సమానమని, వారి రక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని అన్నారు. అత్యాచారానికి గురైన హేమలత, దివ్య, రేష్మాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని చెప్పారు. కొవ్వొత్తులు, కాగడాల వెలుగు మాత్రమే కాకుండా సూర్యుడిలా నిప్పులు చిమ్మే కాంతి మనందరి హృదయాల్లో రగిలిననాడే బాధితుల జీవితాల్లో వెలుతురు నిండుతుందని అన్నారు.
అన్ని రకాల హింసల నుంచి చిన్నారులను కాపాడుకొనేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ముగ్గురు బాధిత బాలికల అనుభవాలను వారి చేతే సభలో చెప్పించడం ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసింది. సునితా కృష్ణన్ మాట్లాడుతూ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది చిన్నారులపై పరిచయస్తులే అత్యాచారాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, కోవా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మజర్ హుస్సేన్, దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, వందలాది మంది ప్రజ్వల సంస్థ చిన్నారులు పాల్గొన్నారు.