ఉగ్రవాద అనుమానితుడు ఆదిల్ అఫ్రోజ్ డిపోర్ట్ | Terror suspect Adil aphroj diport | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద అనుమానితుడు ఆదిల్ అఫ్రోజ్ డిపోర్ట్

Published Tue, Feb 23 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

Terror suspect Adil aphroj diport

సౌదీ నుంచి రప్పించి నగరంలో అరెస్టు
సిట్‌లో నమోదైన  ఓ కేసులో మోస్ట్ వాంటెడ్
రిమాండ్‌కు తరలించిన నగర సిట్ అధికారులు


సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద అనుమానితుడు ఆదిల్ అఫ్రోజ్ చిక్కాడు. సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ఇతడిని సోమవారం దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై(బలవంతంగా తిప్పిపంపడం) హైదరాబాద్‌కు రప్పించారు. సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ‘సిట్’ సన్నాహాలు చేస్తోంది. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అఫ్రోజ్ దాదాపు 13 ఏళ్లుగా సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇతడి ఆచూకీ కనిపెట్టిన నిఘా వర్గాలు సంబంధిత ఏజెన్సీలకు ఆధారాలను సమర్పించడం ద్వారా డిపోర్టేషన్ చేయించగలిగాయి.

 పాస్‌పోర్ట్ ఏజెంట్ అరెస్టుతో...
నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2003 ఏప్రిల్ 19 కూర్మగూడ ప్రాంతంలో పాస్‌పోర్ట్ ఏజెంట్ జుబేర్ షరీఫ్‌ను అరెస్టు చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీకి సంబంధించిన ఈ కేసు దర్యాప్తులోనే ఉగ్రవాద కోణం వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడకు చెందిన ఎజాజ్ అలి యాస్ మాము ప్రోద్బలంతో ఇతడు ఉగ్రవాద బాటపట్టాడు. 2002 అక్టోబర్ 6న జుబేర్, ఎజాజ్ తదితరులతో పాటు ఆదిల్ అఫ్రోజ్ సైతం పాకిస్థాన్‌కు పయనమయ్యాడు. కోల్‌కతా వరకు రైల్లో వెళ్లిన ఈ బృందం అక్కడ నుంచి అక్రమ మార్గంలో బ్యాంకాక్ చేరుకుంది. అక్కడ ఇక్బాల్ వీరిని రిసీవ్ చేసుకుని ఓ హోటల్‌కు తీసుకువెళ్లాడు. రెచ్చగొట్టే దృశ్యాలున్న సీడీలు చూపించడం ద్వారా వీరిలో విద్వేషాన్ని పెంచాడు. తరువాత ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఈ బృందం అటవీ ప్రాంతం లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని.. హైదరాబాద్ వచ్చి ‘కార్యాచరణ ప్రణాళిక’ సిద్ధం చేసుకుంది.

కాలిఖబర్‌లో కీలక సమావేశం...
విద్రోహ కార్యకలాపాలు చేపట్టాలని పథక రచన చేసిన ఎజాజ్, అస్లం, ఆదిల్ తదితరులు నగరంలోని కాలిఖబర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో కలిశారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2003 అక్టోబర్ 8న ఎజాజ్‌తో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేసింది. విషయం తెలుసుకున్న అస్లం ఖాన్, ఆదిల్ తదితరులు నగరం నుంచి పరారయ్యారు. ఆదిల్ కొన్ని రోజుల తర్వాత సింగపూర్ మీదగా సౌదీ అరేబియా పారిపోయాడు. అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేసిన నిఘా వర్గాలు ఎట్టకేలకు ఆదిల్ అఫ్రోజ్‌ను సోమవారం డిపోర్టేషన్‌పై తీసుకురావడంతో సఫలీకృతులయ్యారు. సిట్‌లో నమోదై ఉన్న కేసులో (ఎఫ్‌ఐఆర్ నెం.169/2003) ఆదిల్‌ను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement