పడవ మునక: 30 మంది గల్లంతు
బొగొటా: కొలంబియాలో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా 30 మంది గల్లంతయ్యారు. గ్వాటపే పట్టణం సమీపంలోని ఎల్ పెనాల్ రిజర్వాయర్‌లో ఆదివారం 150 మంది పర్యాటకులతో కూడిన పడవ బయలు దేరింది. పడవ జలాశయం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా నీట మునిగిపోయింది. పర్యాటకుల కేకలతో ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు.
100 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే, ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు వెలికి తీశామని, సుమారు 30 మంది జాడ తెలియకుండా పోయిందని పోలీసు అధికారులు తెలిపారు. కనిపించకుండాపోయిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.