పొగపెట్టు... నిలబెట్టు!
మన్నికైన చుట్టలకు ప్రసిద్ధిచెందిన క్యూబాలో సిగార్ ఫెస్టివల్(చుట్టల ఉత్సవం) ఘనంగా ప్రారంభమైంది. దీనికి వివిధ దేశాల నుంచి పొగరాయుళ్లు భారీగా హాజరయ్యారు. నిర్వాహకులు ఈ సందర్భంగా ఓ పోటీని కూడా పెట్టారు. ఏడు అంగుళాలుండే హవానా చుట్టలను తాగుతూ... ఎవరైతే ఎక్కువ ఎత్తులో నుసి(సిగరెట్ బూడిద)ని ఉంచుతారో...వారే పోటీలో విజేతలని ప్రకటించారు. ఇంకేముంది ఆడామగా తేడా లేకుండా నికార్సైన హవానా చుట్టలను పీల్చడానికి పొగరాయుళ్లందరూ రెడీ అయిపోయారు.
ఒక్కరా... ఇద్దరా... ఏకంగా 450 మంది... ఒకే గదిలో... పోటీపడి మరీ ఒక్కో చుట్ట పనిపడుతూ... బూడిద కింద పడకుండా జాగ్రత్త పడుతూ... గది నిండా పొగబెట్టారు... ఓ పొగరాయుడు అయితే అరగంటలో 6.2 అంగుళాల ఎత్తు వరకు సిగరెట్టు నుసిని ఉంచి ఔరా అనిపించాడు... పోటీలో పాల్గొన్న మహిళలు కూడా తక్కువేం పీల్చలేదులెండి...!