పొగ తాగితే పగబడతది
సాక్షి, హైదరాబాద్: ధూమపానం అలవాటున్న వారికి కరోనా వైరస్ సోకితే నాలుగు రెట్లు ఎక్కువ ప్రమాదమని జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. పొగతాగే వారితో పాటు ఆ పొగ పీల్చే వారి (పాసింగ్ స్మోకర్) పరిస్థితి సైతం కాస్త ఆందోళనకరమేనని చెబుతోంది. ధూమపానం చేసేవారిలో శ్వాసకోశ నాళాలు బలహీనమవుతాయి. ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్–19 వ్యాప్తి చెంది తీవ్రమైతే సంకటస్థితిలో పడినట్టే. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధ లక్షణాలు తీవ్రమై మరణిస్తున్న వారిలో 63శాతం మంది స్మోకర్స్ ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన గణితాత్మక విశ్లేషణలో తేలింది. ఈ క్రమంలో ధూమపానం, హుక్కా పీల్చే అలవాటును మానుకోవా లని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.పొగాకు అలవాటున్న వారు వైరస్ సంక్రమిత వ్యాధుల బారినపడితే వేగంగా నీరసించిపోతారని వైద్యులు చెబుతున్నారు.
నీరసం నుంచి ఉత్తేజితమయ్యేందుకు ఎక్కువసార్లు పొగ తాగేందుకు ఇష్టం చూపే అవకాశాలున్నా యి. ఇలా పొగతాగే అలవాటింకా పెరిగి కార్డియోవాస్క్యులర్, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులు దాడిచేస్తాయి. వీరిలో క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ దశకు చేరుకున్న వారికి కోవిడ్–19 సోకితే ఒక్కసారిగా శరీరం కుప్పకూలి పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులున్న వారు కోవిడ్ బారినపడితే.. జాతీయ స్థాయిలో దాదాపు 10శాతం మంది హైరిస్క్ లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. తక్షణమే ధూమపానాన్ని మానేసిన 24 గంటల్లోనే వారి రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ తీవ్రత భారీగా తగ్గుతుంది. అలాగే, 2 నుంచి 12 వారాల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడతాయని, 9 నెలల తర్వాత శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని కేంద్ర వైద, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, పాన్, జర్దా తినే వారు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని, వీరంతా కోవిడ్–19 వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అలాంటి అలవాట్లకు చెక్పెడితే వారిలో అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయని సూచిస్తోంది.