ఈ భార్యాభర్తల కథ తీవ్ర విషాదాంతం | Heart Transplant Gave Her Chance To Live But After Giving Birth she Died | Sakshi
Sakshi News home page

ఈ భార్యాభర్తల కథ తీవ్ర విషాదాంతం

Published Sat, Jul 1 2017 10:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

ఈ భార్యాభర్తల కథ తీవ్ర విషాదాంతం

న్యూయార్క్‌: పుట్టుకతోనే ఆమెకు గుండె సమస్య. చికిత్స చేసినా నయం కానీ పరిస్థితి. దీంతో గుండె మార్పిడి చేశారు. మళ్లీ ఊపిరిపోసుకుంది. ఇక తనకు ఎలాంటి సమస్య ఉండబోదని భావించింది. ఇటీవలె గర్భం దాల్చిన ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అసలు తానే బ్రతకనని అనుకున్న ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వడం చూసి మురిసిపోయింది. ఆమె భర్త సంతోషానికైతే అవధులే లేవు. మృత్యుంజయురాలిగా మారిన తన భార్య ఇప్పుడు తమ ప్రతిరూపాన్ని చేతుల్లో పెట్టడంతో రాత్రంతా అతడు నిద్రపోలేదు. రాత్రి 2.40గంటల ప్రాంతంలో ఆమె బిడ్డకు జన్మనివ్వగా అప్పటి నుంచి దాదాపు ఆరుగంటలపాటు అతడు తన చంటి బిడ్డను చేతుల్లోకి తీసుకొని భార్యతో కబుర్లు చెప్పుకుంటూ తెగ మురిసిపోయాడు.

బంధువులతో ఈ విషయాన్ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేస్తూ తెగ ఆనందపడ్డాడు. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా ఉదయం 11గంటల ప్రాంతంలో తిరిగి గుండె సమస్యే వచ్చి ఆమె చనిపోయింది. దీంతో ఎలాంటి స్పందన లేకుండా ఆ భర్త గుండెపగిలి స్తంభించిపోయాడు. ఉలుకుపలుకూ లేకుండా చనిపోయి ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన భార్యను అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు. ఇది చూసిన అక్కడి వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లోగల బార్న్స్‌ జెవిష్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేగన్‌ జాన్సన్‌, నతన్‌ జాన్సన్‌ ఇద్దరు భార్యాభర్తలు. మేగన్‌కు గుండె సమస్య కావడంతో గుండె మార్పిడి చేయించారు.

ప్రాణగండం నుంచి బయటపడిన ఆమె ఇటీవలె గర్భం దాల్చింది. దీంతో ప్రత్యేకంగా వైద్యుల సంరక్షణలో ఆమెకు పురుడు పోశారు. అయితే, తొలుత వారు ముందు భయపడినట్లుగా బిడ్డకు జన్మనిచ్చాక మేగన్‌కు ఏం కాలేదు. దీంతో ప్రాణగండం తప్పినట్లేనని అంతా భావించారు. కానీ, వారి అంచనాలన్నీ తప్పి బిడ్డను ప్రసవించిన ఎనిమిది గంటల్లోనే ఆమె గుండె నరాలకు సంబంధించిన సమస్య ఏర్పడి చనిపోయింది. ఈ విషయాన్ని నతన్‌ జాన్సన్‌ స్నేహితుడు విల్సన్‌ తెలిపాడు. తమ బిడ్డకు మేగన్‌, నతన్‌ ఐలీ కేట్‌ అని పేరు కూడా పెట్టుకున్నారని అతడు చెప్పాడు. నతన్‌ ఓ మంచి తండ్రి అని, మేఘన్‌ అతడికి ఓ అద్భుతమైన భార్య అని భావోద్వేగానికి లోనయ్యాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement