'పోలీసులూ.. ఆ ఫొటో బాలేదు, ఈ సెల్ఫీ పెట్టండి'
వాషింగ్టన్: ఓ నిందితుడు సోషల్ మీడియాలో పోలీసుల వాంటెడ్ జాబితాలో తన ఫోటోను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫోటో భయంకరంగా ఉందని, దాని బదులు మరో ఫొటో ఉంచండి.. అంటూ సెల్ఫీ తీసి పోలీసులకు పంపాడు. పోలీసులు నిందితుడి పాత ఫొటోతో పాటు అతను పంపిన సెల్ఫీని కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అమెరికాలోని లిమా పోలీస్ డిపార్ట్మెంట్కు డొనాల్డ్ ఏ చిప్ పుగ్ (45) అనే నిందితుడు సెల్ఫీ పంపగా, పోలీసులు అతనికి ధన్యవాదాలు తెలిపారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న డొనాల్డ్ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, అతని అచూకీ తెలిస్తే తెలిపాలని లిమా పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్లో ఉన్న డొనాల్డ్ కొత్త ఫొటోను అతనే సెల్పీ తీసి పంపాడిని వెల్లడించారు. తమకు సాయపడినందుకు డొనాల్డ్కు ధన్యవాదాలు తెలుపుతూ, అతను తమ దగ్గరకు వచ్చి, నేరాల గురించి చెబితే అభినందిస్తామని కామెంట్ పోస్ట్ చేశారు.