త్రీ డీ సినిమాలతో మెదడుకు పదును
లండన్: మనిషికి మేధోశక్తి ఎంతో అవసరం. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో చాలా ముఖ్యం. పిల్లల్లో మేధోశక్తి పెరగడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. యువత కూడా తగిన సలహాలు పాటిస్తారు. బ్రెయిన్ పవర్ మెరుగుపరచుకోవడానికి సులభమైన పద్ధతి ఉంది. త్రీ డీ సినిమాలు చూస్తే మేధో శక్తి అపారంగా పెరుగుతుందట. త్రీ డీ సినిమా చూసిన తర్వాత మేధోవికాస సామర్థ్యం 23 శాతం మేర వృద్దిచెందినట్టు 23 కొత్త అధ్యయనంలో తేలింది. ఇంగ్లండ్లోని గోల్డ్స్మిత్స్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్ ప్యాట్రిక్ ఫాగన్ నాయకత్వంలోని బృందం ఈ అంశంపై పరిశోధన చేసింది.
త్రీ డీ సినిమా చూసిన తర్వాత ఉత్తేజం పొందుతారని, మెదడుకు బూస్ట్లా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల ఇతర సమయాల్లో కంటే మరింత చురుకుగా ఉంటారని వెల్లడించారు. వృద్ధాప్యంలో కూడా జ్ఞాపకశక్తి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. బాక్సర్లు, టెన్నిస్ క్రీడాకారులు మ్యాచ్లు ఆడే ముందు త్రీ డీ సినిమాలు చూస్తే ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. టూ డీ కంటే త్రీ డీ సినిమాలు చూసిన అనుభూతి వీక్షకులలో ఎక్కువ పనిచేస్తుందని పరిశోధకులు చెప్పారు.