కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరకదృఢత్వానికి మాత్రమే కాదు, మేధాశక్తి, ఆత్మశక్తి పెంపులో కూడా సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుండలిని యోగాతో మెదడుకు చాలా మంచిదని ఇది వెల్లడించింది. అల్జీమర్స్‌లాంటి భయంకరమైన వ్యాధికి చెక్ చెప్పవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రాథమికంగా కనుగొంది. ఆ వివరాలు..
మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక ఆయుర్దాయం, జీన్స్ తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. అందుకే అల్జీమర్స్ ముప్పున్న 50 అంతకంటే ఎక్కువ వయస్సున్న 79 మహిళలపై కుండలిని యోగా, జ్ఞాపకశక్తికి సంబంధించి అధ్యయనం చేశారు. వీరంతా జ్ఞాపకశక్తి క్షీణత (మునుపటి సంవత్సరం పనితీరుతో పోలిస్తే), గుండెపోటు చరిత్ర, చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటుకు, గుండెలోని రక్తనాళాల సమస్య, అధిక కొలెస్ట్రాల్ కోసం ప్రస్తుత మందులు తీసుకుంటున్నవారే.
12 వారాల పాటు యోగా శిక్షణ, మెమరీ ట్రైనింగ్ రెండు గ్రూపులుగా వీరిపై పరిశోధన సాగింది. వీరిలో 40 మందికి యోగా, 39 మందికి మెమరీ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా టీంలో వారానికి 60 నిమిషాలు చొప్పున 12 వారాలు కుండలిని యోగాను నిష్ణాతుడి ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ ఇప్పించారు. 39 మందికి మెమరీ శిక్షణ నిచ్చారు. మెమరీ ట్రైనింగ్‌లో కొన్నిపేర్లను, ముఖాలను గుర్తించుకోవడం, తలుపులు తాళం వేయడం లాంటి రోజవారీ కార్యక్రమాలను గుర్తుంచుకొనే పద్దతులపై శిక్షణనిచ్చారు. తరువాత మరో 24 వారాలు వీరి మెమరీ బేస్‌లైన్ కూడా పరీక్షించారు. అలాగే వారి రక్తంలోని సైటోకిన్లనూ విశ్లేషించారు. రోగ నిరోధక వ్యవస్తలోని కీలకమైన, ప్రోటీన్లు , జన్యు వ్యక్తీకరణలో మార్పులను గమనించారు.
అయితే కుండలిని యోగా టీంలో మాత్రమే ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాపకశక్తి శిక్షణతో పోలిస్తే, యోగాద్వారా హిప్పోకాంపస్ వాల్యూమ్‌లో పెరుగుదల గమనించామనీ, ఫంక్షనల్ కనెక్టివిటీ, స్వల్పకాలిక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని వాటిని మెదడులోని దీర్ఘకాలిక నిల్వకు బదిలీ అనేది బాగా మెరుగుపడిందని గుర్తించారు.
ఇంకా కుండలిని యోగా ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో సహా మెదడుకు సంబంధించి అనేక ప్రయోజనాలను గమనించారు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది.
"ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యం, ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తి పనితీరును మెరుగు పర్చేందుకు, ఇన్ఫ్లమేషను, న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరచడానికి" యోగా చాలా మంచిదని దీని రచయిత హెలెన్ లావ్రెట్స్కీ చెప్పారు. మెమరీ ట్రైనింగ్‌లో దీర్థకాలిక జ్ఞాపకశక్తిలోనూ మెరుగుదల కనిపించిందట.
అయితే కుండలిని యోగాతో అల్జీమర్స్ వ్యాధిని నివారణ, వాయిదా వేయడం లేదా దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుందో లేదో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వ్యాఖ్యానించారు.
కుండలిని యోగ
కుండలిని అనేది మానవ శరీరంలో వెన్నుపాములో ఉంటుంది. దీంట్లో దాగివున్న శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ అంటారు. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడని యోగ నిపుణులు, గురువులు చెబుతారు. ఇతర యోగాలా కాకుండా,ఇదొక శక్తివంతమైన అభ్యాసం.
మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం, దాని పరివర్తన శక్తిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇతర రకాల యోగాల మాదిరిగా కాకుండా, కుండలిని యోగా అనేది శరీరంలోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, కుండలిని శక్తి ప్రవాహాన్ని ప్రేరేపించే నిర్దిష్ట భంగిమలను కుండలిని యోగా భంగిమలు అని పిలుస్తారు శ్వాసమీద, ఉచ్ఛరణ, గానం, శారీరక భంగిమలపై దృష్టి పెడుతుంది.