హైబ్రిడ్ బై సైకిల్ భలే!
* గంటకు 25 కిలోమీటర్లు తొక్కకుండా నడపొచ్చు
* సెంచూరియన్ వర్సిటీ మెకానికల్ విద్యార్థుల రూపకల్పన
పర్లాఖిమిడి(ఒడిశా): ఇక్కడి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బీటెక్ మెకానికల్ నాలుగో సంవత్సరంవిద్యార్థులు తయారుచేసిన ‘హైబ్రిడ్ బై సైకిల్’విశేషంగా ఆకట్టుకుంటోంది.
దీన్ని ఫైనల్ ప్రాజెక్టుగా శుక్రవారం ఆ విద్యాలయానికి అందజేశారు.
ఇవీ ప్రత్యేకతలు
ఈ సైకిల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి బ్యాక్ టైర్‌కు మోటార్‌ను అమర్చమేకాకుండా ఫ్రంట్ గేర్ సిస్టమ్, యాక్సిలేటర్, పవర్ ఇండికేటర్‌ను అమర్చారు. రెండు గంటలసేపు చార్జి చేస్తే గంటకు 25 కిలోమీటర్లు తొక్కకుండానే నడుస్తుంది. దీనికి పవర్ సప్లై రావడానికి కంట్రోలర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ బ్యాటరీ మార్గంమధ్యలో అయిపోతే మామూలుగా సైకిల్‌ను గేర్ సిస్టం ద్వారా తొక్కుకుంటై వెళ్లిపోవచ్చు.
దీన్ని ఇంకా అభివృద్ధి చేసి సోలార్ ప్యానల్ పెడితే బ్యాటరీ ఎనర్జీ నిల్వకు వీలుంటుందని దీన్ని తయారు చేసిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొత్తూరు వెంకటేష్, దేబాషిష్ బెహరా, మూం డూరు పవన్ కుమార్ ఆచారి, ఎ.అభిషేక్, డి.తేజేశ్వర్ రావు తెలిపారు. ఈ హైబ్రిడ్ సైకిల్ తయారీకి రూ.18 వేలు ఖర్చయినట్టు పేర్కొన్నారు. ఇది సాధారణ సైకిల్ కంటే సులువుగా ఘాట్ సెక్షన్‌లో కూడా తిప్పవచ్చన్నారు. సెంచూరియన్ వర్సిటీ మెకానికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ పి.శ్రీనివాసరావు, డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఎ.ఎల్.నాయుడు, హెచ్‌ఓడీ డా.పి.ఎస్.వి.రమణారావు, ప్రాజెక్టు కో-ఆర్డినేటరు ప్రొఫెసర్ డి.ర ఘువీర్ సైకిల్ పనితీరును చూసి విద్యార్థులను అభినందించారు.