తమిళసినిమా: కాలానికి తగ్గట్టుగా మారకుంటే నిలదొక్కుకోవడం కష్టం అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఈ ఉత్తరాది బ్యూటీ బాణీ మార్చింది. అందుకే ఇంకా కథానాయకిగా తన స్థానాన్ని పదిల పరచుకుంటోందని చెప్పవచ్చు. నటిగా ఈ అమ్మడి వయసు దశాబ్దన్నరను పూర్తి చేసింది. అయినా నాయకిగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్నానే ఉంది. ప్రస్తుతం అయితే గత ఏడాది కాజల్ నటించిన 4 చిత్రాలు తెరపైకి వచ్చాయి. అందులో విజయ్‌తో నటించిన మెర్శల్, అజిత్‌కు జంటగా నటించిన వివేకం వంటి తమిళ చిత్రాలు, చిరంజీవి సరసన నటించిన ఖైదీ నంబర్ 150, రానాతో నటించిన నేనేరాజు నేనేమంత్రి వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అవకాశాలు పలచబడ్డాయి.
తమిళంలో ప్యారీస్ ప్యారీస్ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో యువ నటుడు శర్వానంద్‌తో రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పింది. ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు యువ హీరోలతో నటించడంలో ఆంతర్యం తన మార్కెట్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగమేనంటున్నారు సినీ వర్గాలు. అయితే ఆ బ్యూటీ ఏమంటుందో చూద్దాం! నేను అందంగా ఉంటానని అందరూ అంటుంటారు. అందుకు తగ్గట్టుగానే నేనూ అను నిత్యం శ్రమిస్తుంటాను. 15ఏళ్లుగా నటిస్తున్నాను. ఇప్పటికీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అదృష్టం లేకపోతే ఇదంతా జరగదు. నేను పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
నన్ను ఉత్తరాదికి చెందిన నటిగా భావించకుండా ఈ రెండు భాషల ప్రేక్షకులు తమ భాష అమ్మాయిగా ఆదరిస్తున్నారు. ఇది నేను చేసుకున్న భాగ్యం. ప్రస్తుతం తమిళంలో ప్యారీస్ ప్యారీస్ చిత్రంలో నటిస్తున్నాను. ఇది హిందీలో మంచి విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్. ఇక తెలుగులో శర్వానంద్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను. ఇప్పటి వరకూ ప్రముఖ హీరోలతో నటించిన మీరు ఇప్పుడు యువ నటులతో నటించడానికి అర్హులేనా అని అడుగుతున్నారు. కాలానికి తగ్గట్టు మారితేనే ఇక్కడ నిలబడ గలం. నేనూ అదే మార్గంలో పయనిస్తున్నాను. కథ, పాత్ర నచ్చితే యువ కథానాయకులతో నటించడానికి నేను సిద్ధమే అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment