‘సమాజ మర్యాదను కాపాడేలా సినిమాలు ఉండాలి. సమాజాన్ని జాగృతం చేసే సినిమా తీయాలి. కొత్త తరం నటులు ఎస్వీ రంగారావు తదితర మహానటులు నటించిన సినిమాలు చూసి, అందులోని వారి నటనను పరిశీలించి, అధ్యయనం చేసి నేర్చుకోవాలి. ఎస్వీఆర్ సినిమాలు చూసిన తర్వాతనే నటన నేర్చుకొని సినిమా రంగంలోకి రావాలి. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అయితే ఎస్వీ రంగారావు గుండెకాయ లాంటివారు’’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో çసంగమం ఆధ్వర్యంలో మహానటుడు దివంగత ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు జరిగాయి.
గ్లామర్ మాత్రమే కాదు. గ్రామర్ కూడా ఉండాలి
ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాల ద్వారా సమాజం చాలా విషయాల్లో జాగృతం అవుతుందన్న విషయం నేటి నటీనటులు గుర్తుంచుకోవాలి. సినిమాల్లో హింస, జుగుప్సాకర సంఘటనలు, అసభ్యత లాంటివి చూపితే సమాజానికి ఎక్కువ నష్టం సంభవిస్తుంది. సినిమాల్లో గ్లామర్‌తో పాటు గ్రామర్ కూడా ఉండాలి. సంస్కృతి, సభ్యతలకు నష్టం కలిగించేలా సినిమాలు ఉండకూడదు. తెలుగు సినీ రంగంలో గొప్ప నటులున్నారు. కైకాల, చిరంజీవి, జయప్రకాశ్ రెడ్డిలు తాము నటించేటప్పుడు శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలిస్తారు. ఆనందాన్ని .. బ్రహ్మానందాన్ని పండిస్తారు. సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్లు తమ కటుంబాలతో ముందు సినిమా చూడాలి. వారి కుటుంబం మెచ్చితే ఆ సినిమా బాగున్నట్లే. రచయితలు రాసే మాటల్లో, పాటల్లో ఔన్నత్యం ఉండాలి. సంస్కృతిని ప్రతిబింబించేలా, సమాజ మర్యాదను పాటించేలా ఉండి ప్రజల మనసులను ఆకట్టుకొనేలా ఉండాలి.
పాటలు మాధుర్యంగా ఉండాలి. ఎస్వీఆర్ సినిమాల్లో అసభ్యత, వల్గారిటీ, హింస అనేది మచ్చుౖకైనా కనిపించదు. తెలుగు సినీ రంగంలో అందమైన నటులు ఉన్నా అందమైన సినిమా కన్పించటం లేదు. సినిమాల్లో శృంగారం ఉండాలి కానీ అది సభ్యతగా ఉండాలి. శృంగారం తగ్గిపోయి అంగారం ఎక్కువైంది. పాత సినిమాలకు కొత్త సినిమాలకు పోలికే ఉండటం లేదు. నవరసాలు సినిమాల్లో ఉండాలి. సంగీత సాహిత్యాలు పోయి వాయిద్యం ఎక్కువైంది. ఈ తరం నటులు నటన నేర్చుకొని ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టాలి. ఎస్‌వీ రంగారావు నటన ఆకట్టుకొనేలా ఉండేది. సినిమాల్లో ఆహార్యం పుష్కలంగా కన్పించేది. ప్రతి సీన్ చూడముచ్చటగా ఉండేది. కీచకుడు, కంసుడు.. ఇలా ఏ పాత్ర చేసినా ఆరాధనా భావం కలిగిస్తాయి. కారణం ఆయన రూపం, నటించిన తీరు. సాంఘిక, జానపద పాత్రలకు ఆయన జీవం పోశారు. నవరసాలు పండిస్తూ ఏ పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోయేవారు. నంబర్‌వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోగానే కాదు ప్రతినాయకుడుగా విలక్షణంగా నటించేవారు. పెద్దమనిషి, తాతయ్య, ఇంటి యాజమాని ఎలా ఉంటాడో ఆయన పాత్రలు చెబుతాయన్నారు. నటనలో ఎస్వీఆర్ ఒక యశస్వీ’’ అన్నారు.
గౌరవ అతిథి, ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ –‘‘సినీ రంగంలో నభూతో నభవిష్యతి అనిపించిన నటుడు ఎస్వీఆర్. సావిత్రి, ఎస్వీఆర్‌లకు కాలం గడిచే కొద్దీ ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. సినీ రంగం నుంచి అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా పురస్కారం అందుకొన్న నటుడు ఎస్వీఆర్. సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు’’ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడారు.
ఈ వేదికపై ఎస్వీఆర్ హిట్ సాంగ్స్‌పై వందమంది బాలబాలికలచే ఏర్పాటు చేసిన బృందగానం ఆకట్టుకొంది. కాగా, ఎస్వీఆర్ శతజయంతి స్మారక పురస్కారాలను పలువురు నటీనటులకు అందజేశారు. ఎస్వీఆర్‌తో కలిసి పని చేసిన కళాకారులు కృష్ణవేణి, ‘షావుకారు’ జానకి, జమున, శారద, కె.ఆర్. విజయ, గీతాంజలి, రమాప్రభ, రోజారమణిలను, గాన కోకిల పి. సుశీలను సత్కరించారు. ఎస్వీ రంగారావు తర్వాతి తరం క్యారెక్టర్ ఆర్టిస్టులు కైకాల సత్యనారాయణ, రావి కొండలరావు, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాజర్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళిలు ఎస్వీఆర్ శత జయంతి స్మారక సత్కారాలను అందుకొన్నారు. వారికి వెంకయ్య నాయుడు శాలువ, జ్ఞాపికను అందజేశారు. ఈ వేడుకల్లో ‘సంగమం’ వ్యవస్థాపకులు సంజయ్ కిశోర్, ప్రత్యేక అతిథిగా బ్రహ్మానందం పాల్గొన్నారు.
తెలుగు చిత్రసీమకు ఎస్వీఆర్ గుండెకాయ లాంటివారు
Published Wed, Jul 4 2018 12:06 AM | Last Updated on Wed, Jul 4 2018 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment