jayanthi special
-
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్‌ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్‌ను మర్చిపోవడం కష్టం, ఎందుకంటే?
‘తేరే బినా జిందగీ సే కోయీ’.... ‘తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ’... జీవితంలో సంగీతం ఉంటే జీవన సంగీతం శృతిలో ఉంటే మనిషి ప్రయాణం సులువవుతుంది. ఆర్.డి.బర్మన్ జీవితపు ప్రతి రంగుకూ ఒక పాట ఇచ్చాడు. యవ్వనంలో ‘లేకర్ హమ్ దీవానా దిల్’.. మధ్య వయసులో ‘హమే తుమ్ సే ప్యార్ కిత్నా’ తల పండాక ‘జిందగీ కే సఫర్ మే’... మరణించి ఇన్నాళ్లయినా విడువక సేద దీరుస్తున్న ఆర్.డి.బర్మన్ జయంతి నేడు. ఈ ఆదివారం అతని పాటలకు అంకితం. ఆర్.డి. బర్మన్ అంటే 20వ శతాబ్దపు సినీ టీనేజ్ ట్రెండ్. ఇండియన్ స్క్రీన్ ఆర్.డి.బర్మన్ వల్ల సంపూర్ణంగా టీనేజ్‌లోకి వచ్చింది. ఆడింది. పాడింది. జీవితాన్ని రంగుల గాలిపటంగా ఎగరేయడం నేర్చింది. ఏ జో మొహబ్బత్ హై ఏ ఉన్కా హై కామ్ అరె మెహబూబ్ కా జో బస్ లేతే హుయే నామ్ (కటీ పతంగ్)... యువతీ యువకులు ఆర్.డి.బర్మన్ పాటను హగ్ చేసుకున్నారు. హమ్ చేశారు. స్కేటింగ్ షూస్‌గా మార్చి స్కేటింగ్ కూడా చేశారు. వాదా కరో నహీ ఛోడోగే తుమ్ మేరా సాథ్ జహా తుమ్ హో వహా మై భీ హూ (ఆ గలే లగ్ జా)... హవా కే సాథ్ సాథ్ ఘటాకే సంగ్ సంగ్ ఓ సాథీ చల్ (సీతా ఔర్ గీతా)... ఆర్.డి.బర్మన్ ఇలాంటి భావుక యువ ప్రేమికుల కోసమే కాదు... కొత్త ప్రపంచాలను వెతకాలనుకునే యువ అన్వేషకుల కోసం కూడా పాట ఇచ్చాడు. అలాంటి వాళ్లను ఆ రోజుల్లో ‘హిప్పీ’లు అనేవారు. ‘దమ్ మారో దమ్ మిట్ జాయే గమ్’ (హరే రామ హరే కృష్ణ) వారి కోసమే కదా. ఆర్.డి.బర్మన్ను, ఆనాటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నానూ యువతరం ప్రేమించింది. వారి జోడిని చూస్తే హోలి రోజు భంగు తాగి చిందులేసేంత మత్తు పొందేది. ‘జై జై శివ శంకర్... కాటా లగే యా కంకర్’... (ఆప్ కీ కసమ్) ఎంతమందిని తైతక్కలాడించింది! ఆర్.డి.బర్మన్ తన తండ్రి ఎస్.డి.బర్మన్ సమర్థతతో పాటు తన కాలపు ఊపును కూడా పాటలో స్వీకరించాడు. ఆర్.డి.బర్మన్ క్లబ్ సాంగ్స్‌కు, స్టేజ్ సాంగ్స్‌కు పెద్ద హోరు తెచ్చాడు. ‘బచ్నా అయ్ హసీనో లో మై ఆగయా’ (హమ్ కిసీసే కమ్ నహీ), ‘లేకర్ హమ్ దీవానా దిల్’ (యాదోంకి బారాత్)... ఇవన్నీ మెరిసే అద్దాల స్టేజ్ మీద తామూ మెరిశాయి. అయితే ఇదే కుర్రకారులో భావ గంభీరం కూడా ఉంటుంది. తాత్త్వికత కూడా ఉంటుంది. దానినీ పాటలో చూపాడు బర్మన్. ముసాఫిర్ హు యారో.. నా ఘర్ హై నా ఠికానా.. (పరిచయ్) ఇప్పుడు ఈ యువతీ యువకులు పెళ్లి చేసుకున్నారు. సంసారంలో పడ్డారు. సంగీతంలో సంసారంలో ఎన్ని సరిగమలని? ‘బాహోమే చలే ఆ’... (అనామికా) సినిమాలో జయ భాదురి అల్లరిగా సంజీవ్‌కుమార్‌ను ఆహ్వానించే పాట ఎంత బాగుంటుంది. ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే సే రాజ్ హై’ (ఘర్) రేఖ– వినోద్ మెహ్రా డ్యూయెట్ ఇప్పటికీ హిట్. ఈ సంసారంలో అపార్థాలు రాకుండా ఉంటాయా? ‘మేరి భీగి భీగి సీ పల్కొంపే రహె గయ్ జైసే మేరే సప్నే బిఖర్ కే’ (అనామికా), ‘మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై’ (ఇజాజత్), ‘తేరే బినా జిందగీ సే కోయి’ (ఆంధీ)... ఆర్.డి.బర్మన్ ఊదిన విషాద సమీరాలివి. ఆర్.డి.బర్మన్ గుంపులో ఉండి వినే పాటలు ఎన్ని చేశాడో ఏకాంతంలో ఉండి వినే పాటలు అన్నే చేశాడు. ఎన్నో మెలొడీ లు అతడికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ‘చందా ఓ చందా’ (లాఖో మే ఏక్), ‘తుమ్ బిన్ జావూ కహా’ (ప్యార్ కా మౌసమ్), ‘హమే తుమ్ సే ప్యార్ కిత్నా’ (ఖుద్రత్), ‘ఆనె వాలా పల్ జానే వాలా హై’ (గోల్ మాల్). రఫీ, కిశోర్, లతా, ఆశా... ఆర్.డి.బర్మన్తో కలిసి ఒక కాలాన్ని కలర్‌ఫుల్ చేశారు. జంట సంగీతకారుల ఊపు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆర్.డి.బర్మన్ ఒక్కడే నిలిచి పాటలు అందించాడు. భిన్నంగా అందించాడు. మనసును తాకేలా అందించాడు. అతణ్ణి మర్చిపోవడం కష్టము. ఎందుకంటే అతడి పాట వినపడని రోజు ఉండటమూ కష్టం. నామ్ గుమ్ జాయేగా చహెరా ఏ బదల్ జాయేగా మేరే ఆవాజ్ హీ పహెచాన్ హై ఘర్ యాద్ రహే (కినారా) – సాక్షి ఫ్యామిలీ -
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు..
ప్రకృతిలో అన్నీ మహా ప్రవాహాలే ఉండవు. మేరు పర్వతాలే ఉండవు. ఘన కీకారణ్యాలే ఉండవు. ఒక ఝరి కూడా ఉంటుంది. కొంతమందికి అది సౌందర్యాన్ని పంచుతూ ముందుకు వెళ్లిపోతుంది. ఒక పూలు నిండిన మట్టి కొండ ఉంటుంది. అది పరిమళాలు చింది గుర్తుండిపోతుంది. ఒక లేలేత కొమ్మల వనం ఉంటుంది. అది కొన్ని పాటలు పాడి పరవశింప చేస్తుంది. రామకృష్ణ ఝరి. మట్టికొండ. ఆకుపచ్చ వనం. ఆయన పాట మన జీవితాలలో ఒక నిరాడంబరమైన సున్నితమైన స్పర్శను ఇచ్చి వెళ్లింది. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు రామకృష్ణ పాడితే ఘంటసాల పాడినట్టు ఉంటుంది. రామకృష్ణ పాడితే రామకృష్ణ పాడినట్టు కూడా ఉంటుంది. పోలిక ఉంది నిజమే కాని పాడే పద్ధతి వేరు. రామకృష్ణ పాటలో ఒక తొలకరి గుణం ఉంటుంది. అప్పుడే మీసకట్టు వచ్చిన ఒక కుర్రాడి ఉత్సాహం ఉంటుంది. చెంగునదూకే లేగదూడ గంతు ఉంటుంది. వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట... వి.రామకృష్ణ సౌందర్యవంతుడు. నిలువెత్తు అందగాడు. ఆయన మాట, పలుకు కూడా అంతే అందంగా ఉంటుంది. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కాలేజీలో మైక్ ముందు రామకృష్ణ పాడితేనే కార్యక్రమం మొదలయ్యేది. మరి పాట ఎలా వచ్చు? గాయని సుశీల ఆయన పినతల్లి. విజయనగరంలో బాల్యంలో ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. చెవిన వొరుసుకుని వెళ్లే స్వరాలు కంఠంలోకి వచ్చి చేరాయి. గొంతు విప్పితే ఎదుటివాళ్లకి ఒక ఆకర్షణ కలిగేది. ఆ ఆకర్షణే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ తెచ్చింది. నా పక్కన చోటున్నది ఒక్కరికి ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే... ఏదో డాక్యుమెంటరీ కోసం సినిమా వాళ్లను ఎఫర్డ్ చేయలేరు కాబట్టి కాలేజీ కుర్రవాడైన రామకృష్ణ చేత పాడించారు. సారథి స్టూడియోలో ఆ పాట విన్న అక్కినేని ఆశ్చర్యపోయారు. ఇదేమిటి.. అచ్చు ఘంటసాల లాగే ఉంది అని. నిజానికి సినిమా సంగీత ప్రపంచం అప్పుడు కొత్త గాయకుడి అన్వేషణలో ఉంది. అప్పటికే ఘంటసాల గారి ఆరోగ్యం నెమ్మదించడం వల్ల ఎక్కువ పాటలు పాడలేకపోతున్నారు. కొత్త గాయకుడు అవసరం. అలవాటైన ఘంటసాల ధోరణిలోనే పాడే రామకృష్ణ ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అక్కినేని పిలిచి ‘విచిత్ర కుటుంబం’ (1972)లో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు హిట్. అదే సమయంలో దాసరి తొలి సినిమా ‘తాతా మనవడు’ (1972) కూడా సిద్ధమవుతూ ఉంది. చిన్న సినిమా కాబట్టి బడ్జెట్‌కు తగినట్టుగా కొత్త సింగర్ రామకృష్ణకు అవకాశం వచ్చింది. సి. నారాయణరెడ్డి రాసిన పాట రామకృష్ణ గొంతులో గొప్ప వైరాగ్యాన్ని పలికింది. అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఈ పాటలు పాడాక రామకృష్ణ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. అయితే తతిమా జీవితకాల భోజనం ఆయనకు చెన్నైలో రాసి పెట్టి ఉంటే ఆపేదెవరు. రామకృష్ణ పాడిన పాటలు శోభన్‌బాబు చెవిన పడ్డాయి. నాకు ఈ గాయకుడే పాడాలి పిలిపించండి అన్నారు. కె.విశ్వనాథ్ ‘శారద’ సినిమా కోసం రామకృష్ణ మళ్లీ చెన్నై రైలు ఎక్కారు. దాదాపు 30 సంవత్సరాలు గాయకుడిగా అక్కడే ఉండిపోయారు. ‘శారద’ పాట అలా రామకృష్ణను నిలబెట్టింది. శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా ఓ శారదా నీరదా శారదా... ఘంటసాల స్థానంలో ఆ వెలితి తీర్చే గాయకుడు వచ్చాడని అందరికీ అర్థమైపోయింది. అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీరందరికీ రామకృష్ణ ముఖ్యగాయకుడుగా నిలిచారు. అక్కినేనికి ‘భక్త తుకారాం’లో పాడిన ‘శ్యామసుందర ప్రేమమందిర’, ‘పాండురంగ నామం’ పాటలు ఊళ్లల్లో గుళ్ల దగ్గర మోగడం మొదలెట్టాయి. ‘అందాలరాముడు’లోని ‘ఎదగడానికెందుకురా తొందర’ పాట రేడియోలో పదేపదే వినిపించసాగింది. ‘పల్లెటూరి బావ’లోని ‘ఒసే వయ్యారి రంగి’ రిక్షా లాగేవాళ్ల ఫేవరెట్. ‘మహాకవి క్షేత్రయ్య’లో ‘జాబిల్లి చూసింది నిన్ను నన్ను’ రొమాంటిక్ హిట్. ఇటు ఈ పాటలు ఉంటే శోభన్‌బాబుకు వరుస హిట్స్ పడ్డాయి. ‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము’, ‘ఇదాలోకం’లో ‘నీ మనసు నా మనసు ఏకమై’, ‘చక్రవాకం’లో ‘ఈ నదిలా నా హృదయం ఉరకలు వేస్తోంది’... ఇక వీటన్నింటికీ మకుటంగా ‘కన్నవారి కలలు’ సినిమాలో శోభన్‌బాబుకు రామకృష్ణ పాడిన ప్రతి పాటా హిట్టే. మధువొలకబోసే నీ చిలిపి కళ్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు కృష్ణంరాజుకు రామకృష్ణ విలువైన పాటలు పాడారు. ‘కృష్ణవేణి’లో ‘కృష్ణవేణి తెలుగింటి విరబోణి’, ‘అమర దీపం’లో ‘నా జీవన సంధ్యాసమయంలో’, ‘భక్త కన్నప్ప’లో ‘ఆకాశం దించాలా’, ‘శివశివ శంకర’, ‘ఎన్నియలో ఎన్నియలో చందామామా’.... ఇవన్నీ శ్రోతలకు ప్రీతికరమైన పాటలయ్యాయి. కృష్ణకు రామకృష్ణ దాదాపుగా పాడలేదు కాని ‘అల్లూరి సీతారామరాజు’లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమాలోని ‘తెలుగువీర లేవరా’ పాటను ఘంటసాల పాడారు. అయితే కొన్ని చరణాలు అనారోగ్య కారణాల రీత్యా పాడలేదు. ఆయనే రామకృష్ణ చేత పాడించుకోండి అని చెప్పారు. రామకృష్ణ పాడిన ఆ చరణాలు పాటలో అందంగా కలిసిపోయాయి. ఇప్పటికీ చాలామంది ఆ పాటను ఘంటసాల ఒక్కరే పాడారనుకుంటారు. 1980ల నాటికి తెలుగునాట బాలసుబ్రహ్మణ్యం ప్రభంజనం మొదలైపోయింది. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడటానికే రామకృష్ణ పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఘంటసాల తర్వాత తెలుగు పద్యం రామకృష్ణ బాగా పాడతారనే పేరు తెచ్చుకున్నారు. ‘దానవీర శూరకర్ణ’లో పద్యాల కోసం అనేక మందిని ఎన్.టి.ఆర్ ప్రయత్నించి రామకృష్ణే ది బెస్ట్ అని నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ఎన్.టి.ఆర్కు అన్ని పాటలు రామకృష్ణే పాడారు. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుపోదురా కాలజ్ఞానం కల్ల కాదురా... రామకృష్ణ సినిమాలలో కనిపించకపోయినా వేలాది కచ్చేరీల ద్వారా శ్రోతలకు చేరువయ్యారు. దేశ విదేశాలలో ఆయన అసంఖ్యాక కచ్చేరీలు చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కూడా పాటను కొనసాగిస్తూనే వచ్చారు. ప్రకృతి ఎప్పుడూ ఏకరూపం కాదు. బహువిధమైన ఆస్వాదన ఉండాలి అనిపించినప్పుడు రామకృష్ణ పాట ఒక భిన్నమైన ఆస్వాదనను ఇస్తుంది. ఆయన పాట ఒకనాటితో మర్చిపోయేది కాదు. ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు – సాక్షి ఫ్యామిలీ -
స్క్రీన్ టెస్ట్
మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్నారంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవారో ఊహించవచ్చు. దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అలాంటివారే. 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమయ్యారు. సినీ కార్మికుల పక్షాన నిలిచిన ఆయన వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. రేపు దాసరి జయంతి. ఈ సందర్భంగా ఈ వారం ‘దాసరి’ స్పెషల్ క్విజ్ 1. దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమైంది 1972లో ‘తాతమనవడు’తో. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ఎర్రబస్సు’లో మంచు విష్ణు హీరోగా నటించారు. 2014లో విడుదలైన ఆ సినిమాతో దర్శకరత్న మొత్తం ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారో తెలుసా? ఎ) 100 బి) 120 సి) 90 డి) 151 2. దాసరి తన కెరీర్ మొత్తంలో పది రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసిన సినిమా ‘నీడ’. ఆ చిత్రం ద్వారా మహేశ్‌బాబు బాల నటునిగా, రమేశ్‌బాబు హీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని రెండో హీరో పాత్రలో ఓ నటుడు పరిచయమయ్యారు. అతనెవరో తెలుసా? ఎ) చంద్రమోహన్ బి) హరనాథ్ బాబు సి) ఆర్. నారాయణమూర్తి డి) ఈశ్వరరావు 3. రచయితగా, దర్శకునిగా దాసరి చాలా నంది అవార్డులు అందుకున్నారు. నటునిగా నంది అవార్డు అందుకున్న మొదటి సినిమా పేరేంటి? ఎ) మామగారు బి) నాయుడుగారి కుటుంబం సి) సూరిగాడు డి) యంఎల్‌ఏ ఏడుకొండలు 4. ఓ ప్రముఖ నటునికి దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చి 1,116 రూపాయల పారితోషికాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చారు. దాసరి దర్శకత్వంలో ఆ సినిమాను ప్రారంభించాలనుకున్నారు. నిర్మాతకు వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాసరికి మొదట అడ్వాన్స్ ఇచ్చిన ఆ హీరో ఎవరు? ఎ) శోభన్ బాబు బి) అక్కినేని నాగేశ్వరరావు సి) ఎన్టీఆర్ డి) ఎస్వీ రంగారావు 5. దర్శకునిగా దాసరి దాదాపు 150 సినిమాలు చేస్తే, నటునిగా చిరంజీవి 150 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దాసరి కొంచెం సీనియర్ అయినా ఇద్దరూ దాదాపుగా సమకాలీకులే. దాసరి దర్శకత్వంలో చిరంజీవి ఎన్ని చిత్రాలు చేశారో తెలుసా? ఎ) 8 బి) 4 సి) 2 డి) 1 6. కథే హీరో అంటూ చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసిన దాసరి తెలుగులో అందరి టాప్ స్టార్స్‌ని డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎవరో కనుక్కోండి. ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరరావు డి) ఎన్టీఆర్ 7. దాసరి మొదట రచయితగా పనిచేసి దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. తర్వాతి కాలంలో ఆయన నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా పేరేంటి? ఎ) గోరింటాకు బి) స్వయంవరం సి) శివరంజని డి) సంసారం–సాగరం 8. ఓ ఇతిహాసాన్ని నాలుగు భాగాలుగా దాసరి తెరకెక్కించాలనుకున్నారు. ఆ సినిమాతో దర్శకుడిగా రిటైర్ కావాలనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. దాసరి ఇష్టపడిన ఆ కథ చెప్పుకోండి చూద్దాం. ఎ) మహాభారతం బి) రామాయణం సి) భాగవతం డి) కురుక్షేత్రం 9. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) బాలకృష్ణ (అంజిగాడు) డి) రాజబాబు 10. ‘ఒక లైలా కోసం తిరిగాను లోకం..’ అనే పాట అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోనిది. ఆ పాట రచయితెవరు? ఎ) వేటూరి బి) శ్రీశ్రీ సి) కృష్ణశాస్త్రి డి) దాసరి 11. దాసరి శిష్యుల్లో ఓ దర్శకుడు మాత్రం గురువుగారిలా 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆ శిష్యుడు ఎవరో తెలుసా? ఎ) రవిరాజా పినిశెట్టి బి) కోడి రామకృష్ణ సి) రాజా వన్నెంరెడ్డి డి) రేలంగి నరసింహారావు 12. ‘జ్యోతి బనే జ్వాలా’ అనే బాలీవుడ్ చిత్రంలో రాజేశ్ ఖన్నా హీరోగా నటించారు. ఆ సినిమాకు మాతృక కృష్ణంరాజు హీరోగా నటించిన ఓ తెలుగు సినిమా. ఆ సినిమా పేరేంటి? ఎ) రంగూన్ రౌడి బి) కటకటాల రుద్రయ్య సి) తాండ్ర పాపారాయుడు డి) ఉగ్రనరసింహం 13. దాసరి దర్శకత్వంలో 1972లో ప్రారంభమైన నిర్మాణ సంస్థ ఇప్పటికీ సినిమాలు తీస్తూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఆ నిర్మాణ సంస్థ పేరేంటో తెలుసా? (చిన్న క్లూ: ఆ సంస్థ మొదటి సినిమా ‘బంట్రోతు భార్య’) ఎ) వైజయంతీ మూవీస్ బి) దేవీ ఫిలింస్ సి) గీతా ఆర్ట్స్ డి) పద్మాలయా పిక్చర్స్ 14. ‘స్వర్గం–నరకం’ చిత్రం దాసరికి దర్శకునిగా మంచి పేరు సంపాదించింది. ఆ చిత్రంలో ఓ హీరోగా ఈశ్వరరావు ముందే హీరోగా సెలెక్ట్ అయ్యారు. సెకండ్ హీరోగా నటించి తర్వాతి కాలంలో మంచి ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఆ నటుడెవరో తెలుసా? ఎ) మురళీ మోహన్ బి) మోహన్‌బాబు సి) రామ్మోహన్ డి) నరసింహరాజు 15 దాసరి దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకొంది. ఆ చిత్రంలో ఏయన్ఆర్ హీరోగా నటించగా ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించారు. అందులో ఒక హీరోయిన్ జయసుధ మరో హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) జయప్రద బి) శ్రీదేవి సి) విజయశాంతి డి) రాధి 16. సూపర్‌స్టార్ కృష్ణతో దాసరి తీసిన మొదటి చిత్రం ‘రాధమ్మ పెళ్లి’. దాసరి దర్శకత్వం వహించినవాటిలో కృష్ణ మూడు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. వారిద్దరి కాంబినేషన్లో మొత్తం ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 9 బి) 6 సి) 12 డి) 8 17. దాసరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రంలోని తాత పాత్ర రాసినప్పుడు ముందు ఎస్వీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. దాసరికి ఎంతో ఇష్టమైన నటుడు, స్నేహితుడి కోసం రాశారు ఆ పాత్రను. పారితోషికం విషయంలో ప్రాబ్లమ్ వచ్చి ఆ పాత్రను ఆ నటుడు చేయలేదు. ఎవరా నటుడు? ఎ) పద్మనాభం బి) కైకాల సత్యనారాయణ సి) నాగభూషణం డి) రావు గోపాల్‌రావు 18. 1979లో దాసరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గోరింటాకు’. కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో దాసరి అక్కా అని ఎంతో ఆప్యాయంగా పిలిచే సావిత్రి ఓ పాత్రలో నటించారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సుజాత బి) సుహాసిని సి) సుమలత డి) శ్రీప్రియ 19. సహజనటిగా పేరు తెచ్చుకొన్నారు జయసుధ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన నటి జయసుధ. ఆమె ఆయన దర్శకత్వంలో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 29 బి) 17 సి) 19 డి) 24 20. దాసరి సినీ పరిశ్రమకు రాకముందు పాలకొల్లులో ఉన్నప్పుడు కావిడి మెడలో వేసుకొని పండ్లు ఆమ్మేవారు. ఆయన ఏ పండ్లను అమ్మారో తెలుసా? ఎ) మామిడి పండ్లు బి) పనస పండ్లు సి) సపోటా పండ్లు డి) అరటి పండ్లు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) సి 5) డి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) డి 11) బి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
తెలుగు చిత్రసీమకు ఎస్వీఆర్ గుండెకాయ లాంటివారు
‘సమాజ మర్యాదను కాపాడేలా సినిమాలు ఉండాలి. సమాజాన్ని జాగృతం చేసే సినిమా తీయాలి. కొత్త తరం నటులు ఎస్వీ రంగారావు తదితర మహానటులు నటించిన సినిమాలు చూసి, అందులోని వారి నటనను పరిశీలించి, అధ్యయనం చేసి నేర్చుకోవాలి. ఎస్వీఆర్ సినిమాలు చూసిన తర్వాతనే నటన నేర్చుకొని సినిమా రంగంలోకి రావాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు అయితే ఎస్వీ రంగారావు గుండెకాయ లాంటివారు’’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో çసంగమం ఆధ్వర్యంలో మహానటుడు దివంగత ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకలు జరిగాయి. గ్లామర్ మాత్రమే కాదు. గ్రామర్ కూడా ఉండాలి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాల ద్వారా సమాజం చాలా విషయాల్లో జాగృతం అవుతుందన్న విషయం నేటి నటీనటులు గుర్తుంచుకోవాలి. సినిమాల్లో హింస, జుగుప్సాకర సంఘటనలు, అసభ్యత లాంటివి చూపితే సమాజానికి ఎక్కువ నష్టం సంభవిస్తుంది. సినిమాల్లో గ్లామర్‌తో పాటు గ్రామర్ కూడా ఉండాలి. సంస్కృతి, సభ్యతలకు నష్టం కలిగించేలా సినిమాలు ఉండకూడదు. తెలుగు సినీ రంగంలో గొప్ప నటులున్నారు. కైకాల, చిరంజీవి, జయప్రకాశ్ రెడ్డిలు తాము నటించేటప్పుడు శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలిస్తారు. ఆనందాన్ని .. బ్రహ్మానందాన్ని పండిస్తారు. సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్లు తమ కటుంబాలతో ముందు సినిమా చూడాలి. వారి కుటుంబం మెచ్చితే ఆ సినిమా బాగున్నట్లే. రచయితలు రాసే మాటల్లో, పాటల్లో ఔన్నత్యం ఉండాలి. సంస్కృతిని ప్రతిబింబించేలా, సమాజ మర్యాదను పాటించేలా ఉండి ప్రజల మనసులను ఆకట్టుకొనేలా ఉండాలి. పాటలు మాధుర్యంగా ఉండాలి. ఎస్వీఆర్ సినిమాల్లో అసభ్యత, వల్గారిటీ, హింస అనేది మచ్చుౖకైనా కనిపించదు. తెలుగు సినీ రంగంలో అందమైన నటులు ఉన్నా అందమైన సినిమా కన్పించటం లేదు. సినిమాల్లో శృంగారం ఉండాలి కానీ అది సభ్యతగా ఉండాలి. శృంగారం తగ్గిపోయి అంగారం ఎక్కువైంది. పాత సినిమాలకు కొత్త సినిమాలకు పోలికే ఉండటం లేదు. నవరసాలు సినిమాల్లో ఉండాలి. సంగీత సాహిత్యాలు పోయి వాయిద్యం ఎక్కువైంది. ఈ తరం నటులు నటన నేర్చుకొని ఆ తర్వాతే సినిమాల్లోకి అడుగు పెట్టాలి. ఎస్వీ రంగారావు నటన ఆకట్టుకొనేలా ఉండేది. సినిమాల్లో ఆహార్యం పుష్కలంగా కన్పించేది. ప్రతి సీన్ చూడముచ్చటగా ఉండేది. కీచకుడు, కంసుడు.. ఇలా ఏ పాత్ర చేసినా ఆరాధనా భావం కలిగిస్తాయి. కారణం ఆయన రూపం, నటించిన తీరు. సాంఘిక, జానపద పాత్రలకు ఆయన జీవం పోశారు. నవరసాలు పండిస్తూ ఏ పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోయేవారు. నంబర్‌వన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోగానే కాదు ప్రతినాయకుడుగా విలక్షణంగా నటించేవారు. పెద్దమనిషి, తాతయ్య, ఇంటి యాజమాని ఎలా ఉంటాడో ఆయన పాత్రలు చెబుతాయన్నారు. నటనలో ఎస్వీఆర్ ఒక యశస్వీ’’ అన్నారు. గౌరవ అతిథి, ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ –‘‘సినీ రంగంలో నభూతో నభవిష్యతి అనిపించిన నటుడు ఎస్వీఆర్. సావిత్రి, ఎస్వీఆర్లకు కాలం గడిచే కొద్దీ ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. సినీ రంగం నుంచి అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా పురస్కారం అందుకొన్న నటుడు ఎస్వీఆర్. సినీ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు’’ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడారు. ఈ వేదికపై ఎస్వీఆర్ హిట్ సాంగ్స్‌పై వందమంది బాలబాలికలచే ఏర్పాటు చేసిన బృందగానం ఆకట్టుకొంది. కాగా, ఎస్వీఆర్ శతజయంతి స్మారక పురస్కారాలను పలువురు నటీనటులకు అందజేశారు. ఎస్వీఆర్‌తో కలిసి పని చేసిన కళాకారులు కృష్ణవేణి, ‘షావుకారు’ జానకి, జమున, శారద, కె.ఆర్. విజయ, గీతాంజలి, రమాప్రభ, రోజారమణిలను, గాన కోకిల పి. సుశీలను సత్కరించారు. ఎస్వీ రంగారావు తర్వాతి తరం క్యారెక్టర్ ఆర్టిస్టులు కైకాల సత్యనారాయణ, రావి కొండలరావు, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నాజర్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళిలు ఎస్వీఆర్ శత జయంతి స్మారక సత్కారాలను అందుకొన్నారు. వారికి వెంకయ్య నాయుడు శాలువ, జ్ఞాపికను అందజేశారు. ఈ వేడుకల్లో ‘సంగమం’ వ్యవస్థాపకులు సంజయ్ కిశోర్, ప్రత్యేక అతిథిగా బ్రహ్మానందం పాల్గొన్నారు. -
మృదుగీత సుమాల క‘వనమాలి’
తెలుగు పాటకు కొత్త నెత్తావినద్దిన కృష్ణశాస్త్రి చంద్రంపాలెంలో కన్ను తెరిచిన సాహితీ దిగ్గజం నేడు స్వగ్రామంలో 120వ జయంతి వేడుకలు సామర్లకోట : ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా? కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?..’ ఎంత అందమైన సందేహమిది! అక్షరాలనే విరులుగా చేసి, గుబాళింపజేసిన ఆ క‘వనమాలి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవిగా తన మానసవీధుల్లో విహరించే భావనలను కవనంగా మార్చినా, సినీకవిగా చిత్రంలోని సందర్భానుసారం పాట రాసినా ఆయన పొదిగే లాలిత్యం పారిజాతసుమాలంత సుకుమారంగా ఉంటుంది. ఆ మహాకవి, మధురకవి కన్నుతెరిచింది మండలంలోని చంద్రంపాలెంలో 1897 నవంబరు ఒకటిన. ఆ గ్రామంలో ఆయన 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తయన తండ్రి వెంకట కృష్ణశాస్త్రి గొప్ప పండితుడు. వారి ఇంట నిత్యం ఏదో ఒక సాహిత్య గోష్టి జరుగుతూ ఉండేది. బళ్లారి పయనం ఇచ్చిన బహుమానం.. ‘కృష్ణపక్షం’ పిఠాపురం పాఠశాలలో గురువులు అయిన కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో కృష్ణశాస్రి్తకి అభిరుచి కల్పించారు. 1918లో విజయనగరంలో డిగ్రీ పూర్తి చేశాక పెద్దాపురం మిష¯ŒS హైస్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అదే కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ఉధృతంగా ఉండటంతో ఉపాధ్యాయ వృత్తిని వదలి బ్రహ్మ సమాజంలో చురుకుగా పాల్గొన్నారు. సాహితీ వ్యాసంగం చురుకుగా కొనసాగిం చారు. 1920లో వైద్యం కోసం రైలులో బళ్లారి వెళుతూ ఉండగా ప్రకృతి నుంచి లభించిన ప్రేరణతో ’కృష్ణపక్షం కావ్యం’ రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అ«ధికమయింది. తదుపరి మళ్లీ వివాహం చేసుకొని పిఠాపురం హైస్కూల్లో అధ్యాపకునిగా చేరారు. అయితే పిఠాపురం మహారాజా వారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చకపోవడంతో ఆ ఉద్యోగం వదలి బ్రహ్మ సమాజంలో, నవ్య సాహితీ సమితిలో సభ్యునిగా భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఎందరో కవులతో, పండితులతో పరిచయాలు ఏర్పడాయి. ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నందున బంధువులు వదలి వేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యా వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ’ఊర్వశి’ అనే కావ్యం రాశారు. విశ్వకవి ప్రభావంతో విచ్చుకున్న భావుకత 1929లో విశ్వకవి రవీంద్రనా«థ్ టాగూరును కలిశాక దేవులపల్లిలో భావుకత Ððకొత్త రేకులు తొడిగింది.1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. 1933–41 మధ్య కాలంలో కాకినాడ కళాశాలలో తిరిగి అధ్యాపక వృత్తిన చేపట్టారు. 1942లో బీఎ¯ŒS రెడ్డి ప్రోత్సాహంతో ’మల్లీశ్వరి’ చిత్రానికి పాటలు రాశారు. దేవులపల్లి సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని శ్రీశ్రీ కూడా శ్లాఘించారు. కృష్ణశాస్త్రి పాటల్లో ప్రణయ, విరహ గీతాలే కాక ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తి గీతాలు కూడా అనేకం ఉన్నాయి. ‘రాజమకుటం, సుఖ దుఖాలు, కలిసిన మనసులు, నా ఇల్లు, ఇల వేల్పు, బంగారు పాప, ఏకవీర, భాగ్యరేఖ, రక్త కన్నీరు, భక్త తుకారం, అమెరికా అమ్మాయి, గొరింటాకు, కార్తీక దీపం, మేఘసందేశం, శ్రీరామ పట్టాభిషేకం’ మొదలైన సినిమాలకు సుమారు 170 పాటలు రాశారు. వాడని పాటల పూదోట 1975లో ఆంధ్ర విశ్వ విద్యాలయం కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు 1976లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. 1980, ఫిబ్రవరి 24న ఆయన ఊపిరి ఆగిపోయినా.. తెలుగు జాతికి వసంతకాలపు పూదోట వంటి ఆయన పాటల లు శాశ్వత బహుమానంగా మిగిలాయి. చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డ కృష్ణశాస్త్రి చంద్రంపాలెంలోని తాను నివసించిన పాఠశాల నిర్వహణకు ఇచ్చారు.ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ ఊళ్లోని దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రాథమిక పాఠశాల వద్ద అభిమాన సంఘ నాయకులు మంగళవారం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్పతో పాటు ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ భాస్కరరామారావు, ప్రముఖ రచయిత్రి వాడ్రేపు వీరలక్ష్మిదేవి తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.