ఆ గ్రేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ను మర్చిపోవడం కష్టం, ఎందుకంటే? | Special Story on RD Barman Jayanti | Sakshi
Sakshi News home page

RD Burman: జీవితపు రంగులను చూపినవాడు

Published Sun, Jun 27 2021 12:41 AM | Last Updated on Sun, Jun 27 2021 7:13 AM

R D BARMAN - Sakshi

ఆర్‌.డి.బర్మన్‌

‘తేరే బినా జిందగీ సే కోయీ’....
‘తుఝ్‌ సే నారాజ్‌ నహీ జిందగీ’...
జీవితంలో సంగీతం ఉంటే
జీవన సంగీతం శృతిలో ఉంటే
మనిషి ప్రయాణం సులువవుతుంది.
ఆర్‌.డి.బర్మన్‌ జీవితపు ప్రతి రంగుకూ
ఒక పాట ఇచ్చాడు.
యవ్వనంలో ‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’..
మధ్య వయసులో
‘హమే తుమ్‌ సే ప్యార్‌ కిత్‌నా’
తల పండాక ‘జిందగీ కే సఫర్‌ మే’...
మరణించి ఇన్నాళ్లయినా విడువక
సేద దీరుస్తున్న ఆర్‌.డి.బర్మన్‌ జయంతి నేడు.
ఈ ఆదివారం అతని పాటలకు అంకితం.


ఆర్‌.డి. బర్మన్‌ అంటే 20వ శతాబ్దపు సినీ టీనేజ్‌ ట్రెండ్‌. ఇండియన్‌ స్క్రీన్‌ ఆర్‌.డి.బర్మన్‌ వల్ల సంపూర్ణంగా టీనేజ్‌లోకి వచ్చింది. ఆడింది. పాడింది. జీవితాన్ని రంగుల గాలిపటంగా ఎగరేయడం నేర్చింది.

ఏ జో మొహబ్బత్‌ హై ఏ ఉన్కా హై కామ్‌
అరె మెహబూబ్‌ కా జో బస్‌ లేతే హుయే నామ్‌

(కటీ పతంగ్‌)...

యువతీ యువకులు ఆర్‌.డి.బర్మన్‌ పాటను హగ్‌ చేసుకున్నారు. హమ్‌ చేశారు. స్కేటింగ్‌ షూస్‌గా మార్చి స్కేటింగ్‌ కూడా చేశారు.
వాదా కరో నహీ ఛోడోగే తుమ్‌ మేరా సాథ్‌
జహా తుమ్‌ హో వహా మై భీ హూ (ఆ గలే లగ్‌ జా)...

    హవా కే సాథ్‌ సాథ్‌ ఘటాకే సంగ్‌ సంగ్‌
    ఓ సాథీ చల్‌ (సీతా ఔర్‌ గీతా)...

ఆర్‌.డి.బర్మన్‌ ఇలాంటి భావుక యువ ప్రేమికుల కోసమే కాదు... కొత్త ప్రపంచాలను వెతకాలనుకునే యువ అన్వేషకుల కోసం కూడా పాట ఇచ్చాడు. అలాంటి వాళ్లను ఆ రోజుల్లో ‘హిప్పీ’లు అనేవారు. ‘దమ్‌ మారో దమ్‌ మిట్‌ జాయే గమ్‌’ (హరే రామ హరే కృష్ణ) వారి కోసమే కదా. ఆర్‌.డి.బర్మన్‌ను, ఆనాటి సూపర్‌స్టార్‌ రాజేష్‌ ఖన్నానూ యువతరం ప్రేమించింది. వారి జోడిని చూస్తే హోలి రోజు భంగు తాగి చిందులేసేంత మత్తు పొందేది. ‘జై జై శివ శంకర్‌... కాటా లగే యా కంకర్‌’... (ఆప్‌ కీ కసమ్‌) ఎంతమందిని తైతక్కలాడించింది!

ఆర్‌.డి.బర్మన్‌ తన తండ్రి ఎస్‌.డి.బర్మన్‌ సమర్థతతో పాటు తన కాలపు ఊపును కూడా పాటలో స్వీకరించాడు. ఆర్‌.డి.బర్మన్‌ క్లబ్‌ సాంగ్స్‌కు, స్టేజ్‌ సాంగ్స్‌కు పెద్ద హోరు తెచ్చాడు. ‘బచ్‌నా అయ్‌ హసీనో లో మై ఆగయా’ (హమ్‌ కిసీసే కమ్‌ నహీ), ‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’ (యాదోంకి బారాత్‌)... ఇవన్నీ మెరిసే అద్దాల స్టేజ్‌ మీద తామూ మెరిశాయి. అయితే ఇదే కుర్రకారులో భావ గంభీరం కూడా ఉంటుంది. తాత్త్వికత కూడా ఉంటుంది. దానినీ పాటలో చూపాడు బర్మన్‌.

ముసాఫిర్‌ హు యారో..
నా ఘర్‌ హై నా ఠికానా.. (పరిచయ్‌)

ఇప్పుడు ఈ యువతీ యువకులు పెళ్లి చేసుకున్నారు. సంసారంలో పడ్డారు. సంగీతంలో సంసారంలో ఎన్ని సరిగమలని? ‘బాహోమే చలే ఆ’... (అనామికా) సినిమాలో జయ భాదురి అల్లరిగా సంజీవ్‌కుమార్‌ను ఆహ్వానించే పాట ఎంత బాగుంటుంది. ‘ఆప్‌ కే ఆంఖోమే కుచ్‌ మెహకే హుయే సే రాజ్‌ హై’ (ఘర్‌) రేఖ– వినోద్‌ మెహ్రా డ్యూయెట్‌ ఇప్పటికీ హిట్‌. ఈ సంసారంలో అపార్థాలు రాకుండా ఉంటాయా? ‘మేరి భీగి భీగి సీ పల్కొంపే రహె గయ్‌ జైసే మేరే సప్‌నే బిఖర్‌ కే’ (అనామికా), ‘మేరా కుచ్‌ సామాన్‌ తుమ్హారే పాస్‌ పడా హై’ (ఇజాజత్‌), ‘తేరే బినా జిందగీ సే కోయి’ (ఆంధీ)... ఆర్‌.డి.బర్మన్‌ ఊదిన విషాద సమీరాలివి.

ఆర్‌.డి.బర్మన్‌ గుంపులో ఉండి వినే పాటలు ఎన్ని చేశాడో ఏకాంతంలో ఉండి వినే పాటలు అన్నే చేశాడు. ఎన్నో మెలొడీ లు అతడికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ‘చందా ఓ చందా’ (లాఖో మే ఏక్‌), ‘తుమ్‌ బిన్‌ జావూ కహా’ (ప్యార్‌ కా మౌసమ్‌), ‘హమే తుమ్‌ సే ప్యార్‌ కిత్‌నా’ (ఖుద్రత్‌), ‘ఆనె వాలా పల్‌ జానే వాలా హై’ (గోల్‌ మాల్‌).

రఫీ, కిశోర్, లతా, ఆశా... ఆర్‌.డి.బర్మన్‌తో కలిసి ఒక కాలాన్ని కలర్‌ఫుల్‌ చేశారు. జంట సంగీతకారుల ఊపు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆర్‌.డి.బర్మన్‌ ఒక్కడే నిలిచి పాటలు అందించాడు. భిన్నంగా అందించాడు. మనసును తాకేలా అందించాడు. అతణ్ణి మర్చిపోవడం కష్టము. ఎందుకంటే అతడి పాట వినపడని రోజు ఉండటమూ కష్టం.
నామ్‌ గుమ్‌ జాయేగా చహెరా ఏ బదల్‌ జాయేగా
మేరే ఆవాజ్‌ హీ పహెచాన్‌ హై ఘర్‌ యాద్‌ రహే

(కినారా)
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement