మృదుగీత సుమాల క‘వనమాలి’ | krishnasastry jayanthi special | Sakshi
Sakshi News home page

మృదుగీత సుమాల క‘వనమాలి’

Published Mon, Oct 31 2016 9:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

krishnasastry jayanthi special

  • తెలుగు పాటకు కొత్త నెత్తావినద్దిన కృష్ణశాస్త్రి
  • చంద్రంపాలెంలో కన్ను తెరిచిన సాహితీ దిగ్గజం
  • నేడు స్వగ్రామంలో 120వ జయంతి వేడుకలు
  • సామర్లకోట : 
    ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా? కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?..’ ఎంత అందమైన సందేహమిది! అక్షరాలనే విరులుగా చేసి, గుబాళింపజేసిన ఆ క‘వనమాలి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవిగా తన మానసవీధుల్లో విహరించే భావనలను కవనంగా మార్చినా, సినీకవిగా చిత్రంలోని సందర్భానుసారం పాట రాసినా ఆయన పొదిగే లాలిత్యం పారిజాతసుమాలంత సుకుమారంగా ఉంటుంది. ఆ మహాకవి, మధురకవి కన్నుతెరిచింది మండలంలోని చంద్రంపాలెంలో 1897 నవంబరు ఒకటిన. ఆ గ్రామంలో ఆయన 120వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తయన తండ్రి వెంకట కృష్ణశాస్త్రి గొప్ప పండితుడు. వారి ఇంట నిత్యం ఏదో ఒక సాహిత్య గోష్టి జరుగుతూ ఉండేది.  
     
    బళ్లారి పయనం ఇచ్చిన బహుమానం.. ‘కృష్ణపక్షం’
    పిఠాపురం పాఠశాలలో గురువులు అయిన కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో కృష్ణశాస్రి్తకి  అభిరుచి కల్పించారు. 1918లో విజయనగరంలో డిగ్రీ పూర్తి చేశాక పెద్దాపురం మిష¯ŒS హైస్కూల్‌లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అదే కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ఉధృతంగా ఉండటంతో ఉపాధ్యాయ వృత్తిని వదలి బ్రహ్మ సమాజంలో చురుకుగా పాల్గొన్నారు. సాహితీ వ్యాసంగం చురుకుగా కొనసాగిం చారు. 1920లో వైద్యం కోసం రైలులో బళ్లారి వెళుతూ ఉండగా ప్రకృతి నుంచి లభించిన ప్రేరణతో ’కృష్ణపక్షం కావ్యం’ రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అ«ధికమయింది. తదుపరి మళ్లీ వివాహం చేసుకొని పిఠాపురం హైస్కూల్‌లో అధ్యాపకునిగా చేరారు. అయితే  పిఠాపురం మహారాజా వారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చకపోవడంతో ఆ ఉద్యోగం వదలి బ్రహ్మ సమాజంలో, నవ్య సాహితీ సమితిలో సభ్యునిగా భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఎందరో కవులతో, పండితులతో పరిచయాలు ఏర్పడాయి. ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నందున బంధువులు వదలి వేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యా వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ’ఊర్వశి’ అనే కావ్యం రాశారు.
     
    విశ్వకవి ప్రభావంతో విచ్చుకున్న భావుకత
    1929లో విశ్వకవి రవీంద్రనా«థ్‌ టాగూరును కలిశాక దేవులపల్లిలో భావుకత Ððకొత్త రేకులు తొడిగింది.1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు. 1933–41 మధ్య కాలంలో కాకినాడ కళాశాలలో తిరిగి అధ్యాపక వృత్తిన చేపట్టారు. 1942లో బీఎ¯ŒS రెడ్డి ప్రోత్సాహంతో ’మల్లీశ్వరి’ చిత్రానికి పాటలు రాశారు. దేవులపల్లి సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని శ్రీశ్రీ కూడా శ్లాఘించారు. కృష్ణశాస్త్రి పాటల్లో ప్రణయ, విరహ గీతాలే కాక ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తి గీతాలు కూడా అనేకం ఉన్నాయి. ‘రాజమకుటం, సుఖ దుఖాలు, కలిసిన మనసులు, నా ఇల్లు, ఇల వేల్పు, బంగారు పాప, ఏకవీర, భాగ్యరేఖ, రక్త కన్నీరు, భక్త తుకారం, అమెరికా అమ్మాయి, గొరింటాకు, కార్తీక దీపం, మేఘసందేశం, శ్రీరామ పట్టాభిషేకం’ మొదలైన సినిమాలకు సుమారు 170 పాటలు రాశారు.
     
    వాడని పాటల పూదోట
    1975లో ఆంధ్ర విశ్వ విద్యాలయం కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు 1976లో పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్నారు. 1980, ఫిబ్రవరి 24న ఆయన ఊపిరి ఆగిపోయినా.. తెలుగు జాతికి వసంతకాలపు పూదోట వంటి ఆయన పాటల లు శాశ్వత బహుమానంగా మిగిలాయి. చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డ కృష్ణశాస్త్రి చంద్రంపాలెంలోని తాను నివసించిన పాఠశాల నిర్వహణకు ఇచ్చారు.ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ ఊళ్లోని దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రాథమిక పాఠశాల వద్ద అభిమాన సంఘ నాయకులు మంగళవారం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్పతో పాటు ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ భాస్కరరామారావు, ప్రముఖ రచయిత్రి వాడ్రేపు వీరలక్ష్మిదేవి తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement