ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు.. | Sakshi Special Story About Singer V Ramakrishna | Sakshi
Sakshi News home page

ఈ నదిలా నా హృదయం ఉరకలు వేస్తోంది...

Published Thu, Aug 20 2020 1:53 AM | Last Updated on Thu, Aug 20 2020 9:21 AM

Sakshi Special Story About Singer V Ramakrishna

ప్రకృతిలో అన్నీ మహా ప్రవాహాలే ఉండవు. మేరు పర్వతాలే ఉండవు. ఘన కీకారణ్యాలే ఉండవు. ఒక ఝరి కూడా ఉంటుంది. కొంతమందికి అది సౌందర్యాన్ని పంచుతూ ముందుకు వెళ్లిపోతుంది. ఒక పూలు నిండిన మట్టి కొండ ఉంటుంది. అది పరిమళాలు చింది గుర్తుండిపోతుంది. ఒక లేలేత కొమ్మల వనం ఉంటుంది. అది కొన్ని పాటలు పాడి పరవశింప చేస్తుంది. రామకృష్ణ ఝరి. మట్టికొండ. ఆకుపచ్చ వనం. ఆయన పాట మన జీవితాలలో ఒక నిరాడంబరమైన సున్నితమైన స్పర్శను ఇచ్చి వెళ్లింది.

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు

రామకృష్ణ పాడితే ఘంటసాల పాడినట్టు ఉంటుంది. రామకృష్ణ పాడితే రామకృష్ణ పాడినట్టు కూడా ఉంటుంది. పోలిక ఉంది నిజమే కాని పాడే పద్ధతి వేరు. రామకృష్ణ పాటలో ఒక తొలకరి గుణం ఉంటుంది. అప్పుడే మీసకట్టు వచ్చిన ఒక కుర్రాడి ఉత్సాహం ఉంటుంది. చెంగునదూకే లేగదూడ గంతు ఉంటుంది.

వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట...

వి.రామకృష్ణ సౌందర్యవంతుడు. నిలువెత్తు అందగాడు. ఆయన మాట, పలుకు కూడా అంతే అందంగా ఉంటుంది. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కాలేజీలో మైక్‌ ముందు రామకృష్ణ పాడితేనే కార్యక్రమం మొదలయ్యేది. మరి పాట ఎలా వచ్చు? గాయని సుశీల ఆయన పినతల్లి. విజయనగరంలో బాల్యంలో ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. చెవిన వొరుసుకుని వెళ్లే స్వరాలు కంఠంలోకి వచ్చి చేరాయి. గొంతు విప్పితే ఎదుటివాళ్లకి ఒక ఆకర్షణ కలిగేది. ఆ ఆకర్షణే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ తెచ్చింది.

నా పక్కన చోటున్నది ఒక్కరికి
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే...

ఏదో డాక్యుమెంటరీ కోసం సినిమా వాళ్లను ఎఫర్డ్‌ చేయలేరు కాబట్టి కాలేజీ కుర్రవాడైన రామకృష్ణ చేత పాడించారు. సారథి స్టూడియోలో ఆ పాట విన్న అక్కినేని ఆశ్చర్యపోయారు. ఇదేమిటి.. అచ్చు ఘంటసాల లాగే ఉంది అని. నిజానికి సినిమా సంగీత ప్రపంచం అప్పుడు కొత్త గాయకుడి అన్వేషణలో ఉంది. అప్పటికే ఘంటసాల గారి ఆరోగ్యం నెమ్మదించడం వల్ల ఎక్కువ పాటలు పాడలేకపోతున్నారు. కొత్త గాయకుడు అవసరం. అలవాటైన ఘంటసాల ధోరణిలోనే పాడే రామకృష్ణ ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అక్కినేని పిలిచి ‘విచిత్ర కుటుంబం’ (1972)లో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు హిట్‌. అదే సమయంలో దాసరి తొలి సినిమా ‘తాతా  మనవడు’ (1972) కూడా సిద్ధమవుతూ ఉంది. చిన్న సినిమా కాబట్టి బడ్జెట్‌కు తగినట్టుగా కొత్త సింగర్‌ రామకృష్ణకు అవకాశం వచ్చింది. సి. నారాయణరెడ్డి రాసిన పాట రామకృష్ణ గొంతులో గొప్ప వైరాగ్యాన్ని పలికింది.

అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం

ఈ పాటలు పాడాక రామకృష్ణ తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు. అయితే తతిమా జీవితకాల భోజనం ఆయనకు చెన్నైలో రాసి పెట్టి ఉంటే ఆపేదెవరు. రామకృష్ణ పాడిన పాటలు శోభన్‌బాబు చెవిన పడ్డాయి. నాకు ఈ గాయకుడే పాడాలి పిలిపించండి అన్నారు. కె.విశ్వనాథ్‌ ‘శారద’ సినిమా కోసం రామకృష్ణ మళ్లీ చెన్నై రైలు ఎక్కారు. దాదాపు 30 సంవత్సరాలు గాయకుడిగా అక్కడే ఉండిపోయారు. ‘శారద’ పాట అలా రామకృష్ణను నిలబెట్టింది.

శారద నను చేరగా
ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా
ఓ శారదా నీరదా శారదా...

ఘంటసాల స్థానంలో ఆ వెలితి తీర్చే గాయకుడు వచ్చాడని అందరికీ అర్థమైపోయింది. అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీరందరికీ రామకృష్ణ ముఖ్యగాయకుడుగా నిలిచారు. అక్కినేనికి ‘భక్త తుకారాం’లో పాడిన ‘శ్యామసుందర ప్రేమమందిర’, ‘పాండురంగ నామం’ పాటలు ఊళ్లల్లో గుళ్ల దగ్గర మోగడం మొదలెట్టాయి. ‘అందాలరాముడు’లోని ‘ఎదగడానికెందుకురా తొందర’ పాట రేడియోలో పదేపదే వినిపించసాగింది. ‘పల్లెటూరి బావ’లోని ‘ఒసే వయ్యారి రంగి’ రిక్షా లాగేవాళ్ల ఫేవరెట్‌. ‘మహాకవి క్షేత్రయ్య’లో ‘జాబిల్లి చూసింది నిన్ను నన్ను’ రొమాంటిక్‌ హిట్‌. ఇటు ఈ పాటలు ఉంటే శోభన్‌బాబుకు వరుస హిట్స్‌ పడ్డాయి. ‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము’, ‘ఇదాలోకం’లో ‘నీ మనసు నా మనసు ఏకమై’, ‘చక్రవాకం’లో ‘ఈ నదిలా నా హృదయం ఉరకలు వేస్తోంది’... ఇక వీటన్నింటికీ మకుటంగా ‘కన్నవారి కలలు’ సినిమాలో శోభన్‌బాబుకు రామకృష్ణ పాడిన ప్రతి పాటా హిట్టే.

మధువొలకబోసే నీ చిలిపి కళ్లు
అవి నాకు వేసే బంగారు సంకెళ్లు

కృష్ణంరాజుకు రామకృష్ణ విలువైన పాటలు పాడారు. ‘కృష్ణవేణి’లో ‘కృష్ణవేణి తెలుగింటి విరబోణి’, ‘అమర దీపం’లో ‘నా జీవన సంధ్యాసమయంలో’, ‘భక్త కన్నప్ప’లో ‘ఆకాశం దించాలా’, ‘శివశివ శంకర’, ‘ఎన్నియలో ఎన్నియలో చందామామా’.... ఇవన్నీ శ్రోతలకు ప్రీతికరమైన పాటలయ్యాయి. కృష్ణకు రామకృష్ణ దాదాపుగా పాడలేదు కాని ‘అల్లూరి సీతారామరాజు’లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమాలోని ‘తెలుగువీర లేవరా’ పాటను ఘంటసాల పాడారు. అయితే కొన్ని చరణాలు అనారోగ్య కారణాల రీత్యా పాడలేదు. ఆయనే రామకృష్ణ చేత పాడించుకోండి అని చెప్పారు. రామకృష్ణ పాడిన ఆ చరణాలు పాటలో అందంగా కలిసిపోయాయి. ఇప్పటికీ చాలామంది ఆ పాటను ఘంటసాల ఒక్కరే పాడారనుకుంటారు.

1980ల నాటికి తెలుగునాట బాలసుబ్రహ్మణ్యం ప్రభంజనం మొదలైపోయింది. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడటానికే రామకృష్ణ పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఘంటసాల తర్వాత తెలుగు పద్యం రామకృష్ణ బాగా పాడతారనే పేరు తెచ్చుకున్నారు. ‘దానవీర శూరకర్ణ’లో పద్యాల కోసం అనేక మందిని ఎన్‌.టి.ఆర్‌ ప్రయత్నించి రామకృష్ణే ది బెస్ట్‌ అని నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ఎన్‌.టి.ఆర్‌కు అన్ని పాటలు రామకృష్ణే పాడారు.

వినరా వినరా ఓ నరుడా
బ్రహ్మం మాట పొల్లుపోదురా
కాలజ్ఞానం కల్ల కాదురా...

రామకృష్ణ సినిమాలలో కనిపించకపోయినా వేలాది కచ్చేరీల ద్వారా శ్రోతలకు చేరువయ్యారు. దేశ విదేశాలలో ఆయన అసంఖ్యాక కచ్చేరీలు చేశారు. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేశారు. హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాక కూడా పాటను కొనసాగిస్తూనే వచ్చారు. ప్రకృతి ఎప్పుడూ ఏకరూపం కాదు. బహువిధమైన ఆస్వాదన ఉండాలి అనిపించినప్పుడు రామకృష్ణ పాట ఒక భిన్నమైన ఆస్వాదనను ఇస్తుంది. ఆయన పాట ఒకనాటితో మర్చిపోయేది కాదు. ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు – సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement