తెలుగు సినిమా పాటల్లో హిందీ గీత పరిమళాలు | telugu songs singing in hindi singers | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా పాటల్లో హిందీ గీత పరిమళాలు

Published Mon, Mar 30 2015 10:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

తెలుగు సినిమా పాటల్లో హిందీ గీత పరిమళాలు - Sakshi

తెలుగు సినిమా పాటల్లో హిందీ గీత పరిమళాలు

 బాలీవుడ్
 డా. పైడిపాల
 ప్రముఖ సినీ గీత పరిశోధకుడు
 మొబైల్-9989106162

 
 తొలి భారతీయ శబ్ద చిత్రం ‘ఆలమ్ ఆరా’ (విడుదల 1931 మార్చి 14) హిందీ భాషా చిత్రమనీ, ఆనాటి నుంచి నేటి వరకు అంతో యింతో హిందీ ప్రభావం పడని భారతీయ చలనచిత్రాలు లేవనీ, ఆ ప్రభావం తెలుగు సినిమాల మీద మరింత ఎక్కువనీ - సినీ పరిజ్ఞానం ఉన్నవాళ్లందరికీ తెలుసు. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) తెలుగులో తొలి టాకీ వచ్చిన మొదటి పదేళ్లలో విడుదలైన ‘లవకుశ’, ‘గృహలక్ష్మి’, ‘మళ్లీ పెళ్లి’, ‘వందేమాతరం’ మొదలైన చిత్రాల్లోనూ కొన్ని పాటల మీద నాటి హిందీ చిత్రాల్లో సైగల్, పంకజ్-మల్లిక్ వంటి ప్రసిద్ధ గాయకులు పాడిన పాటల బాణీల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. కె.సి. డే అనే అంధ గాయకుడు పాడిన ‘మన్కి యాంఖే ఖేల్ బాబా...’ అనే పాట బాణీలో ‘గృహలక్ష్మి’ చిత్రంలో మద్యపాన వ్యసనాన్ని వీడవలసిందిగా ప్రబోధిస్తూ నాగయ్య పాడిన
 
 ‘లెండు భారత వీరులారా... నిదుర లేవండోయ్! మీరూ నిదుర...’
అనే గీతం అలాంటి పాటలకు ప్రసిద్ధ ఉదాహరణం! తొలినాళ్లలో బాణీలకు మాత్రమే పరిమితమైన హిందీ ప్రభావం తెలుగులో తొలి డబ్బింగ్ చిత్రం ‘ఆహుతి’ (1950 జూన్ 22) విడుదలైన తర్వాత సాహిత్యానికి కూడా విస్తరించింది. అయితే, చాలామంది భ్రమపడుతున్నట్టు హిందీ పాటల ఛాయలున్న తెలుగు పాటలన్నీ డబ్బింగ్ కోవవి కావు! - ఆ పోలికలున్న ఇతర ప్రక్రియలకు చెందినవి. ఉదాహరణకు ‘ఆహ్’ హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన ‘ప్రేమలేఖలు’ (1953)లో ఆరుద్ర రాయగా తెలుగునాట మారుమ్రోగిన -
 
 1. పందిట్లో పెళ్లవుతున్నాది, కనువిందవుతున్నాది...
 2. నీ పేరు విన్నా నీ రూపు కన్నా
   ఉయ్యాలలూగు మది సైసైసై...

 3. పాడు జీవితమూ యౌవనం మూడునాళ్ల ముచ్చట...
 
 మొదలైన పాటలన్నీ ‘ట్రాక్ ఛేంజ్’ (ధ్వని పరివర్తనం) సాంగ్స్‌గా పరిగణింపబడతాయి. అంటే తెలుగులో హిందీ బాణీలకు అనుగుణంగా పాటలు రాయించి, తిరిగి చిత్రీకరించినవి. అలాగే హిందీ చిత్రం ‘భాభీ’ ఆధారంగా తెలుగులో తీసిన ‘కులదైవం’ చిత్రంలోని పాటలు ‘రీమేక్’ (పునర్నిర్మిత) సాంగ్సే అవుతాయి.
 ఉదా:    ‘చల్ చల్ రే పతంగ్ చల్ చల్ రే...’ (భాభీ)
 
 ‘పదపదవే ఒయ్యారి గాలిపటమా...’ (కులదైవం)
 అయితే ఇలా రీమేక్ హక్కులు తీసుకొని తీసినవే కాక, హక్కులు తీసుకోకుండా అదే కథాంశంతో తీసిన తెలుగు చిత్రాల్లో హిందీ బాణీలనూ, కొంతవరకు వస్తువునూ వాడుకొన్న ‘ఫ్రీమేక్’ పాటలు కూడా ఉన్నాయి.
 ఉదా:    ‘ఏ జిందగీ వుసీకి హై...’ (అనార్కలి -1950- లతామంగేష్కర్)
 
 ‘జీవితమే సఫలమూ, రాగసుధాభరితమూ...’
 (అనార్కలి -1955 - జిక్కీ)
 ఇక ఏ సంబంధం లేని హిందీ చిత్రాల నుండి ప్రాచుర్యం పొందిన బాణీలను కొల్లగొట్టిన తెలుగు చిత్రాల్లోని పాటలు కోకొల్లలు!
 ఉదా:    ‘గాతా రహే మేరా దిల్, తూహీ మేరీ మంజిల్...’ (గైడ్)
 
 ‘పడవా వచ్చిందే పిల్లా పిల్లా... హాయ్...’
 (సిపాయి చిన్నయ్య -1969)
 పై రెండు పాటలకు ఒక్క బాణీలో తప్ప మిగతా ఏ విషయంలోనూ సంబంధం లేదు!
 తెలుగు చిత్రాల్లోని హాస్యగీతాలకు హిందీలోని ‘హిట్ సాంగ్స్ ట్యూన్స్’ని ఏ మాత్రం పొంతన లేకుండా వాడుకొన్న సందర్భాలెన్నో! మచ్చుకి -
 ఉదా:    ‘రూప్ తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా...’ (ఆరాధన)
 
 ‘ముత్యాలూ వస్తావా! అడిగింది ఇస్తావా!...’
 (మనుషులంతా ఒక్కటే -1976)
 ఆ కాలంలోనే ‘జీవితం’, ‘అభిమానం’ మొదలైన చిత్రాల్లో అనేక హిందీ చిత్రాల నుంచి బాణీలను ఎంపిక చేసుకుని తెలుగు పాటలు రాయించడం ఆ బాణీల పట్ల నిర్మాతలకు, సినీ ప్రియులకు ఉన్న మోజును తెలియజేస్తుంది. ఇలా హిందీ బాణీలను అనుసరించి తెలుగులో ఎక్కువగా పాటలను రాయించిన సంస్థల్లో ఎ.వి.యం. విజయ, అన్నపూర్ణ మొదలైనవాటిని, సంగీత దర్శకుల్లో సత్యం, మాస్టర్ వేణు మున్నగువారిని చెప్పుకోవాలి. తెలుగువాళ్ల నోళ్లలో మాతృభాషలోని సినిమా పాటలు ఎక్కువగా నానడానికీ, వాటిపట్ల మనవాళ్లకు మక్కువ పెరగడానికీ దోహదం చేసిన కార్యక్రమాలు - రేడియో సిలోన్ నుంచి మీనాక్షీ పొన్నుదురై నిర్వహణలో ప్రసారమైన హిందీ పాటలు, ‘బినాకా గీత్ మాలా’ పేరుతో పాతికేళ్ల పాటు ప్రసారమైన బాలీవుడ్ పాటలూ! ఏతావాతా హిందీ సినిమాలు, పాటలు తెలుగు నాట నేరుగా ఆదరాభిమానాలను పొందడం వల్ల హిందీ చిత్రాలను తెలుగులో ‘డబ్’ చేసే ఆవశ్యకత తగ్గింది. అందువల్ల ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన సుమారు 2500 డబ్బింగ్ చిత్రాల్లో హిందీ మాతృకల శాతం స్వల్పమనే చెప్పాలి (అధిక శాతం తమిళం). ఆ డబ్బింగ్ చిత్రాల్లో అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కూడా ప్రాచుర్యం పొందిన, సాహిత్యపు విలువలు కలిగిన కొన్ని పాటల సమాచారాన్ని తెలుసుకొందాం...
 
 1.‘ఆహుతి’ (1950)
 ప్రేమయే జనన మరణ లీలా
 మృత్యుపాశమే అమరబంధమా
 యువ ప్రాణుల మ్రోల...    - శ్రీశ్రీ
 మూలం: ‘ప్రేమ్ హై జనన్ మరణ్ కా ఖేల్...’
 (నీరా ఔర్ నందా)

 
 2.‘శ్రీరామభక్త హనుమాన్’ (1958)
 లెమ్మోయి పవనసుతా
 ప్రభుకార్యమే తీర్చగ తరుణమ్ము నేడే
 లేరయ్య లేరయ్య లేరయ్య నీ సాటి
 వేవేగ రావయ్య వీరాంజనేయ... - శ్రీశ్రీ
 మూలం: ‘జాగేహో భజరంగభళీ...’
 (పవన్‌పుత్ర హనుమాన్)

 
 3.‘గాంధారీ గర్వభంగం’ (1959)
 పదునాలుగు లోకముల ఎదురన్నది లేదుగా
 మానవుడే సర్వశక్తి ధాముడు కాదా - శ్రీశ్రీ
 మాతృకలో పల్లవికి మాత్రమే పెదవుల కలయిక ఉంది. అందువల్ల మిగిలిన పాట శ్రీశ్రీ స్వతంత్రంగా రాశారు. అర్జునుడు బాణాలతో పేర్చిన నిచ్చెన మీదుగా భీముని స్వర్గయానం సందర్భం.
 మూలం:    ‘ధరతీకా షాన్ తూహై
 మనుష్య తేరా బడే మహాన్ హై’ (గజగౌరీ)
 భావం:     ధరణికి అలంకారం నీవే. మనిషీ!
 నువ్వు మహానుభావుడివి.

 
 4.‘జింబో’ (1959)
 అవును నిజం ప్రణయ రథం సాగెను నేడే
 కోరిన కోరిక పారటలాడే! ఔను... - శ్రీశ్రీ
 మూలం:    ‘లే చలే హమ్ బఢ్ కే కదమ్
 ఆజ్ ఖుషీసే ఆగయా ఆగయా...’ (జింబో)
 భావం:     నేను బయలు దేరానుగా,
 అడుగులు తడబడగా...
 నేడు ఆనందం కలిగెనుగా....

 
 5.‘సంపూర్ణ రామాయణం’ (1961)
 ధరణీ దేవత శోషించెనుగా
 ఘోషించెనుగా అంబరమే
 అయోధ్య నేడే అరణ్యమాయె... - శ్రీశ్రీ
 మూలం:    ‘ధరతీ క్యోం విపరీత్ హుయే
 ఔర్ క్యోం నిరుధ్ ఆకాశ్ హువా...’
 (సంపూర్ణ రామాయణ్)
 
 6.‘ప్రేమపావురాలు’ (1989)
 ఓ పావురమా, ఓ పావురమా
 తొలి ప్రేమల్లో తొలకరి లేఖ
 చెలునికి అందించి రా... - రాజశ్రీ
 మూలం:    ‘జా జా కబూతర్ జా
 పెహలీ ప్యార్ కీ పెహలీ ఛిట్టీ...’
 (మైనే ప్యార్ కియా)
 భావం:    తెలుగు పాట పల్లవి లో ఉన్నదే. తొలికరి లేఖ
 అనడంతో రాజశ్రీ మెరుపును గమనిస్తాం.

 
 7.‘శ్రీదేవి’ (1990)
 మోగుతున్నాయి గాజులు నా చేతిలో... - రాజశ్రీ
 మూలం: ‘మేరీ హాథోమ్ మే నానో చుడియారే’ (చాందినీ)
 భావం:    తెలుగు పాటలో ఉన్నదే
 
 8‘ప్రేమించి పెళ్లాడుతా’ (1995)
 నీ ఆశే నాకు ఆరాధనం
 ప్రేమించే గుండె ఒక నందనం - వెన్నెలకంటి
 మూలం: ‘తుఝే దేఖాతో యే జానా సనమ్...
 ప్యార్ హోతా హై దివానా సనమ్...’
 (దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే)
 భావం:     నిను చూశాకే నా దానివని తెలిసింది.
 ప్రేమ అనేది ఓ పెద్ద పిచ్చి.

 
 9.‘ప్రేమాలయం’ (1995)
 అక్కా, నీ మరిదెంతో వెర్రోడే,
 ఓ అక్కా నీ మరిదెంతో వెర్రోడే
 అయ్యో రామా, పిట్టలకు వలవేస్తాడే - వెన్నెలకంటి
 మూలం:    ‘దీదీ తేరా దేవర్ దివానా,
 హో దీదీ తేరా దేవర్ దివానా
 హై రామ్ కుడియోంకో డాలే దానా...’
 (హమ్ ఆప్‌కే హై కౌన్)
 భావం:    తెలుగులో తీసుకొన్నదే. పిట్టలకు
 వల వెయ్యడం తెలుగు నుడికారం.

 
 10.‘రంగేళీ’ (1995)
 యాయురే యాయురే వారెవా ఇది ఏం జోరే
 యాయురే యాయురే ఈ జోరుకు నా జోహారే...        - సిరివెన్నెల సీతారామశాస్త్రి
 మూలం: ‘యాయురే యాయురే జోర్ లగాకే నాచీరే
 యాయురే యాయురే మిల్‌కే ధూమ్ మచాయిరే...’     (రంగీలా)
 భావం:    జోరుగా నాట్యం చెయ్యండి.
 కలిసి హడావిడి చెయ్యండి.
 
 11.‘ప్రేమ బంధం’ (1997)
 బాటసారీ బాటసారీ నన్నే విడి పోరాదోయ్, పోరాదోయ్
 పరచిందీ బతుకే, నీకై వలచేటి మనసే - వెన్నెలకంటి
 మూలం:    ‘పరదేశీ, పరదేశీ జానా నహీ
 ముఝే ఛోడ్‌కే, ముఝ్ ఛోడ్‌కే...’
 (రాజా హిందుస్థానీ)
 భావం: తెలుగు పాటలో ఉన్నదే. బాటసారీ అనడంలో వెన్నెలకంటి ముద్ర ఉంది
 
 12.‘ప్రేమతో...’ (1998)
 చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
 చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య
 మది చెదిరి కదా కలిచెయ్య హొయ్య
 - సీతారామశాస్త్రి
 
 మాతృక:    ‘చల్ ఛయ్య ఛయ్య ఛయ్య ఛయ్య
 సర్ ఇష్క్‌కీ చావోన్ చల్ ఛయ్య ఛయ్య ఛయ్య
 పాన్వే జనత్ చలేచల్ ఛయ్య ఛయ్య ఛయ్య...’
 (దిల్‌సే) - గుల్జార్
 భావం: వలపు నీడలో నీ తల ఉండగా, మనం స్వర్గం మీద పాదాలు మోపి నీడలోకి నడుద్దాం.

 
 లయ కోసం హిందీ పదజాలాన్ని తెలుగులో కూడా యథాతథంగా వినియోగించుకోవడం ఈ పాటలో చూస్తాం. అందువల్ల డబ్బింగ్ పాటల్లో కూడా అప్పుడప్పుడు మాతృభాషానువాదమే కాక ఆ ప్రభావం కూడా ఉంటుందనడం గమనార్హం.పై పాటల పంక్తులు మచ్చుకి మాత్రమే. ఇలా ప్రాచుర్యం పొందిన డబ్బింగ్ పాటలు మరెన్నో! ఒక భాషా చిత్రంలోని దృశ్యాన్ని మార్చకుండా మరో భాషతో ప్రత్యామ్నాయ శబ్దజాలాన్ని సమకూర్చుకోవడాన్నే డబ్బింగ్ అన్నారు. డబ్బింగ్ పాటల్లో భావాల, బాణీల అనుసరణతో పాటు మాతృకలోని పరిమళాలనూ ఆస్వాదిస్తాం. ఏ సంబంధం లేకుండా ఇతర భాషల్లోని బాణీలను మాత్రం అనుకరిస్తూ రాయించిన ‘ఫ్రీమేక్’ పాటల కంటే రాజమార్గంలో నడిచే ‘డబ్బింగ్’, ‘రీమేక్’ చిత్రాల్లోని పాటలు మూలాలకు అన్ని విధాలా దగ్గరగా ఉండడం సహజం.చివరిగా ఓ మాట చెప్పకపోతే పాఠకులు అపార్థం చేసుకొనే అవకాశం ఉంది. హిందీ నుంచి పరివర్తితమైన తెలుగు చిత్రాలు, పాటలులాగే మన భాష నుంచి హిందీకి వెళ్లిన చిత్రాలు, పాటలు కూడా చాలా ఉన్నాయి సుమా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement