ఆలయంలో మృత్యుఘోష.
మధ్యప్రదేశ్‌లోని కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట.. 10 మంది మృతి
60 మందికిపైగా గాయాలు..
రాష్ట్రపతి సంతాపం
సత్నా, భోపాల్: దైవ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు ఒక్కసారిగా ముందుకు పోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠనాథ్ ఆలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలే. సోమవారం ‘సోమవతి అమావాస్య’ వేడుకల సందర్భంగా వేలాది మంది కంఠనాథ్ ఆలయానికి వచ్చారు. వారంతా దర్శనం కోసం ఒక్కసారిగా ముందుకు పోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కంఠనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు తగిన సహాయం అందించాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశించారు.