Divine appearance
-
క్షమయే దైవము
క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి? అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి! గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు. అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు. ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం. – అమ్మాజీ ఉమామహేశ్వర్ -
ఆలయంలో మృత్యుఘోష.
మధ్యప్రదేశ్‌లోని కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట.. 10 మంది మృతి 60 మందికిపైగా గాయాలు.. రాష్ట్రపతి సంతాపం సత్నా, భోపాల్: దైవ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు ఒక్కసారిగా ముందుకు పోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా చిత్రకూట్‌లోని కంఠనాథ్ ఆలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలే. సోమవారం ‘సోమవతి అమావాస్య’ వేడుకల సందర్భంగా వేలాది మంది కంఠనాథ్ ఆలయానికి వచ్చారు. వారంతా దర్శనం కోసం ఒక్కసారిగా ముందుకు పోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కంఠనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు తగిన సహాయం అందించాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశించారు.