క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి?
అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి!
గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు.
ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు.
అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు.
ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం.
– అమ్మాజీ ఉమామహేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment