నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు.
శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment