2జీ స్కాంపై నవంబర్ 10న తుది వాదనలు
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు మరో 15 మందిపై దాదాపు మూడేళ్ల కిందట విచారణ ప్రారంభించి న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం వారి తరఫు సాక్ష్యాల నమోదును ముగించింది. కేసు తుది వాదనలను నవంబర్ 10న వింటామని 2జీ స్కామ్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపడుతున్న సీబీఐ ప్రత్యేక జడ్జి ఒ.పి. సైనీ తెలిపారు. ఈ కేసులో ప్రమేయమున్న ఎస్సార్ గ్రూప్, లూప్ టెలికాం ప్రమోటర్లతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసు, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కంపెనీల వివాదాస్పద ఒప్పందంపై తుది వాదనలను ఆ రోజు వింటామన్నారు.
కాగా, ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యులుగా ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్‌సింగ్ సహా పలువురికి సమన్లు జారీ చేసేందుకు అనుమతించాలన్న సీబీఐ విజ్ఞప్తిని న్యాయమూర్తి గురువారం పరిశీలిస్తామన్నారు. ఈ కేసు విచారణలో కొత్త ఆధారాలు లభించినందున సాక్షుల విచారణ అవసరమని సీబీఐ పేర్కొంది. సీబీఐ 153 మంది సాక్షులను ఎగ్జామిన్ చేయగా నిందితు లు తమ తరఫున 29 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. 2జీ స్పెక్ట్రమ్ కోసం 122 లెసైన్సుల కేటాయింపులో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 30,984 కోట్ల నష్టం వాటిల్లిందంటూ సీబీఐ ఈ కేసులో ఆరోపించడం తెలిసిందే.
ముగిసిన సాక్ష్యాల నమోదు
Published Thu, Sep 11 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement