యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు
కంచర్ల యాదగిరిరెడ్డి (ముజఫర్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి):
యోగి ఆదిత్యనాథ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమొక్కటే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉత్తరప్రదేశ్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సాగిస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర బహిరంగంగానే కనిపిస్తుంది.
ముఖ్యమంత్రి కాకమునుపు సంఘ్ ఫుల్ టైమర్ అయిన యోగి కోసం దాదాపు 2,500 మంది ఆర్ఎస్ఎస్ ఫుల్‌టైమ్ కార్యకర్తలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్విరామంగా పని చేస్తున్నారు. ముగ్గరు ప్రచారక్‌లు శివ ప్రకాశ్, కీలకనేత బిఎల్ సంతోష్ (సంఘ్ నుంచి డిప్యుటేషన్‌పై బీజేపీకి వచ్చి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు) విష్ణుదత్ శర్మ బీజేపీ విజయం కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. (చదవండి: మాయవతి మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!)
వీరిలో శివప్రకాశ్కు పశ్చిమ యూపీపై మంచి పట్టు ఉంది. గడచిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే ఆయన ఈ ప్రాంతంలో బీజేపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. గతంలో చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోయే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇప్పుడు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తూ యోగి ఆదిత్యనాధ్ సర్కారు గడచిన ఐదేళ్లలో సాగించిన అభివృద్ధిని వివరిస్తున్నాయి.
కరడుగట్టిన కాషాయనేత
మధుర, ఇటావా, మెయిన్‌పురి, ఆగ్రా, ఫిరోజాబాద్, హాత్రస్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్కు తోడు దాని ఉప శాఖ అయిన థర్మ్ జాగరణ్ సమితి వంటివి బీజేపీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. ‘మేము బీజేపీ విజయాన్ని మాత్రమే కోరుకోవడం లేదు. ఈ దేశహితాన్ని కోరుకుని ముందుకు వెడుతున్నాము’అని ప్రచారక్ మహేంద్ర కుమార్ ఈ ప్రతినిధితో అన్నారు.
పశ్చిమ యూపీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. ఘర్ వాపసీ పేరుతో రాజేశ్వర్ సింగ్ కొన్ని సంవత్సరాల పాటు రీ కన్వర్షన్ (తిరిగి మతంలోకి రావడం) వంటి కార్యకలాపాలు చేపట్టారు. ఘర్ వాపసీ సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల వల్ల చివరకు ప్రధానమంత్రి మోడి, ముఖ్యమంత్రి యోగి సైతం రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. (చదవండి: కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!)
ఒక దశలో ఆర్ఎస్ఎస్ నాయకత్వం రాజేశ్వర్ సింగ్ ను బలవంతంగా అజ్ఞాతంలోకి పంపించాల్సి వచ్చింది. అయినా ఇక్కడి కరుడుగట్టిన హిందూత్వ వాదులు రాజేశ్వర్ సింగ్ ను గట్టిగా సమర్థిస్తున్నారు. ‘ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయన చర్యలు ఒకరకంగా బీజేపీకి బాగా తోడ్పడుతున్నాయి’ అని ఘజియాబాద్‌కు చెందిన మోటార్ మెకానిక్ సుందర్ సింగ్ తివారీ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ చర్యలు ముస్లింలకు మరింత కోపాన్ని తెస్తున్నాయని, వారు గంప గుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలన్న నిర్ణయానికి వచ్చేలా చేస్తున్నాయని మండిపడుతున్న బీజేపీ నేతలూ ఉన్నారు. (చదవండి: యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ)