బెంగుళూరు: ఇంటిపన్ను, కరెంటుబిల్లు, డిష్బిల్లు, కుళాయిపన్నులాంటివే ఇప్పటి వరకు మనం విన్నాం.. ఇప్పుడు బోరునీటి వినియోగం పైనా పన్ను విధించబోతున్నారు. ఈ ప్రక్రియకు బెంగుళూరులో బీజంపడింది. ఇంటి, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే బోర్లకి బెంగుళూరు వాటర్ బోర్డ్ త్వరలో మీటర్లను బిగించనుంది. భూగర్భ జల వినియోగాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ మొదలైంది.
రానున్నరోజుల్లో భూగర్భజలాలను భారీగా వినియోగించుకునే వారికి బెంగుళూరు వాటర్ బోర్డ్ పన్ను విధించనుంది. దీని మీద కర్నాటక ప్రభుత్వానికి నివేధిక సమర్పించింది. బెంగుళూరులో భూగర్భజలాలను విచక్షణ రహితంగా వాడుతున్నారని బెంగుళూరు వాటర్ బోర్డు చైర్మన్ అంజుం పర్వీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాగునీటి కుళాయిలకు మాత్రమే మీటర్లు బిగించారు. మోత్తం బెంగుళూరులో 2.16 లక్షల బోరు పంపులు ఉండగా, కొత్తగా 92,790 బోర్లు తవ్వుతామంటూ ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టు బెంగుళూరు వాటర్ బోర్డు తెలిపింది.